చావులోనే మనశ్సాంతి..విశ్రాంతి..ఇదేనా రేపటి మన భవిష్యత్తు కూడా!


ఆమె పేరు లక్ష్మి..ఆయన పేరు ముత్తు..ఇద్దరూ పెళ్లాడారు..నలుగురు పిల్లలకి జన్మనిచ్చారు..వారి ఆటపాటలు వింటుంటే కాలం ఇట్టే గడిచిపోయింది. సరదా సరదా కాపురం మజా అనుభవించారు.. కాలగమనంలో వాళ్ల పిల్లలకి  చక్కగా పెళ్లిళ్లు చేశారు. మనవళ్లని కూడా చూసారు..ఇంకేముంది జీవితంలో అంతా చూశారనుకుంటున్నారా...ముత్తు ముత్తయ్య అయ్యాడు..లక్ష్మి లచ్చమ్మ అయింది..క్రమంగా వృధ్దాప్యం మీద  పడుతుంటే..సంతానం దూరమవసాగింది..వేరు కాపురాలతో దూరంగా మసలసాగారు..అలా అలా 90ఏళ్లు గడిచాయ్..
ప్రస్తుతానికి వస్తే,  పలకరించే దిక్కు లేదు..పని చేసే ఓపిక లేదు..మరి సంతానం ఏమైందా..ఇద్దరు కూతుళ్లూ చనిపోయారు..ఇద్దరు కొడుకులున్నారు కదా...! ఆ వాళ్లూ పెద్దవాళ్లైపోతున్నారు..ఎంతగా అంటే తల్లిదండ్రులకు  ఆసరా కూడా ఇవ్వలేనంతగా..! మానసిక కుంగుబాటుకి...అనారోగ్యం తోడైంది..మంచమే దిక్కైంది..ఇంకెన్నాళ్లీ నరకం అనుకున్నారో ఏమో..పురుగుల మందుతో లక్ష్మి, ముత్తు ఇద్దరూ ఒక్కసారే ప్రశాంతత వెతుక్కున్నారు..

పండుటాకుల పయనం..ముత్తయ్య మరణం ఏం చెప్తోంది..ఈ హెడ్డింగ్స్ కూడా ఆలోచించా ఇది రాసేముందు..కానీ ఆ తాపత్రయం పేపర్లు..ఛానళ్లకి కానీ మనకెందుకు అని సూటిగా మనసుకి తోచింది పెట్టేశా. కరీంనగర్ జిల్లా వెంకట్రావుపల్లి ఊరు..ఇద్దరి ఆత్మహత్య..ఒకరికి 95..అంటే ఇంటియజమాని ముత్తయ్యకి..గృహస్తు లచ్చమ్మకి 90 ఏళ్లు. నలుగురు సంతానం..ఐనా ఇద్దరూ చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఆర్ధిక బాధలు ఉన్నా చనిపోవడానికి కారణం కా కపోవచ్చు.  సంతానం పట్టించుకోకపోవడమే కారణం. ఈ వయస్సులో ఊసులు చెప్పుకునేందుకే మనుషులే కదా కావాలి..ఇంకా ఏం మాట్లాడతారు..ఏం తెలుసుకుంటారు ఏం అనుభవిస్తారు అంటారా..మరి అలాగైతే..ప్రాణానికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉందా..!
ఈ మధ్యకాలంలో ఇలాంటి వార్తలే ఎక్కువగా హెడ్‌లైన్స్ అవుతున్నాయ్..అవ్వాలి కూడా..ఎందుకంటే రేపటి మన భవిష్యత్తు కూడా ఇలానే ఉంటుంది..తలచుకుంటేనే భయం వేస్తోంది..కానీ ఏం చేయలేం..స్వీకరించాల్సిందే..ఏది ఎలా వస్తే అలా యాక్సెప్ట్ చేయడం తప్ప చేయగలిగింది లేదు..డబ్బు మాత్రమే లేక బాధ పడితే వేరు..పలకరించే దిక్కు లేకపోవడం...అదే కదా నిజమైన పేదరికం..ఇది రొటీన్‌గా అనుకునేది కాదు. అనుభవానికి వచ్చినప్పుడు తెలుస్తుంది.. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ..పిల్లల్ని మాత్రం దగ్గరే ఉంచేసుకుందామనుకునే మన తరానికి ఈ విషాదం ఓ భవిష్యద్దర్శిని!

Comments