శభాష్...! ఇదీ వారసత్వం అంటే..

లింగవివక్ష, సమానత్వం ఈ రెండు పదాలు కన్వీనెంట్‌గా ఎప్పటికప్పుడు వాడుకుంటూ కొంతమంది హడావుడి చేస్తుంటారు..ఐతే వారసులంటే కేవలం మగాళ్లేనా..ఆడపిల్లలు కారా అంటే మాత్రం సమాధానం నెగటివ్‌గానే వస్తుంది. ఎందుకంటే నీతులు..సమాజంలో ఎలా బతకాలనే అంశాలపై లెక్చర్లు ఇచ్చే స్వాములకు దేశంలో కరువే లేదు..అలాంటోళ్లలో కలబుర్గీలో ఓ సామి ఉన్నాడంట...అతగాడి వయసు 82 ఏళ్లు...ఆయనకి ఇద్దరు భార్యలు..రెండో భార్యకి 48 ఏళ్లు...ఈ రెండో భార్యకి ఇప్పుడు ఓ మగబిడ్డ పుట్టాడట..అంటే..వారసుడు పుట్టాడంట..మరి  ఇంతకుముందు పిల్లలు లేరా..అంటే..ఉన్నారు 8మంది..వాళ్లంతా ఆడపిల్లలే..అంటే వాళ్ళెవరూ వారసత్వానికి అర్హులు కారట..

 ఇతగాడి పేరు..శరణబసవప్ప..ఈయనకో మఠానికి పీఠాదిపత్యం ఉంది..ఆ పీఠానికి ఇప్పుడు పుట్టిన బుడ్డోడే వారసుడట..అక్కమహాదేవి..ఇంకా చెప్పుకోదగ్గ మహిళలు ఉన్న కన్నడనాట కూడా ఇలా మగవారసుల కోసం తాపత్రయ పడటం గమనార్హం


-----
 నవమాసాలు మోసి కనిపెంచారు.. కంటికి రెప్పలా కాపాడారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారని బోలెడన్ని ఆశలూ పెట్టుకున్నారు. చెట్టంత కొడుకులు చేదోడుగా ఉంటారని వారు ‘కన్న’కలలు కల్లలయ్యాయి. ఆ కొడుకులే కర్కో టకులయ్యారు. కనికరం లేకుండా తల్లిదండ్రులను గెంటేశారు. సామానంతా బయట పడేయడంతో ఎముకలు కొరికే చలిలో ఆ వృద్ధ దంపతులు పడిన ఇబ్బందులు చూసి చలించనివారుండరు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మిదేవిగూడేనికి చెందిన నారగోని ముత్యాలు(65), మంగమ్మ (62) దంపతులకు నలుగురు కుమారులు. ఇరవై ఏళ్ల క్రితం నలుగురిలో ముగ్గురికి వివాహం చేశారు. ఆ సమయంలోనే ఆస్తులను సమ భాగాలుగా పంచి ఇచ్చి వేరు కాపురం పెట్టించారు. వివాహం కాని చిన్న కొడుకుకు కూడా భాగం ఇచ్చి తల్లిదండ్రులు అతనితో ఉండేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇంట్లో ఒక గది తీసుకొని అతనితోపాటు ఉంటున్నారు. చిన్న కుమారుడికి వివాహం కాగానే, అతను కూడా వేరు పడ్డాడు. అదే ఇంట్లో ఉంటున్న ముత్యాలు, మంగమ్మ దంపతులు నలుగురు కుమారుల వద్ద ఖర్చులకు డబ్బులు తీసుకుని సొంతంగా వండుకుంటున్నారు.
నెల రోజులుగా చిన్న కుమారుడు తన ఇంట్లో ఉండ వద్దని నిత్యం గొడవ పడుతున్నాడు. వారికి వేరే చోట ఉండేందుకు గూడు లేకపోవడంతో అదే ఇంట్లో మాటలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. దీంతో తాను ఎంత చెప్పినా వినడంలేదని ఆగ్రహించిన చిన్న కుమారుడు తల్లిదండ్రుల సామగ్రిని బుధవారం రాత్రి వీధిలో పడేశాడు. ఏం చేయాలో దిక్కుతోచక రాత్రంతా చలికి వణుకుతూ ఆరుబయటే తల్లిదండ్రులు ఉండిపోయారు. గురువారం సామాన్లు పెట్టుకుని వంట చేసుకున్నారు. నలుగురిలో ఇద్దరు కుమారులు మాత్రం మీకు ఇచ్చిన ఇంట్లోనే ఉండాలని, తామెలా తీసుకెళ్తామని అంటుండగా, మరో ఇద్దరు మాత్రం చడీచప్పుడు చేయడం లేదని వృద్ధ దంపతులు ముత్యాలు, మంగమ్మ తెలిపారు. తమను కుమారులు పట్టించుకోవడం లేదని, వారిని చట్టపరంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments