2జి-రాజా-కనిమెళి అసలు కథ ఇదే


అందరూ నిర్దోషులే అంటూ ఛానల్స్ ఊదరగొడుతోన్న 2జి స్పెక్ట్రమ్ కేసులో పాటియాల కోర్టు ఇచ్చిన తీర్పు సరిగా అర్ధం చేసుకోవాలి. ప్రాసిక్యూషన్ నిందితులపై మోపిన అభియోగాలను నిరూపించడంలో విఫలమైంది..కాబట్టి వీరిని విడుదల చేస్తున్నారనే కోర్టు తీర్పు చెప్తోంది కానీ..వీరంతా నిజంగా నిర్దోషులని చెప్పలేదు. అందుకే ఇప్పుడీ అంశంపైనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం.
యూపిఏ పాలన కాలంలో అతి పెద్ద కుంభకోణంగా వర్ణించినప్పుడే ఈ కేసులో ఇది నిజంగా స్కామ్ కాదని నిందితులు వాదించారు. నిబంధనలను పాటించి ఉంటే కేంద్రప్రభుత్వ ఆదాయం దాదాపు 2లక్షలకోట్లు అదనంగా వచ్చేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక చెప్పింది. దాని ప్రకారమే కోర్టులు కూడా ఎంక్వైరీకి ఆదేశించాయి. అయితే ఇక్కడే నిందితులంతా తమ తమ కంపెనీల్లోకి పెట్టబడులు అనేక రూపాల్లో లాభం పొందిన వ్యక్తులనుంచి రాబట్టారనేది ఆరోపణ

పాటియాలా కోర్టు ముందుంచిన ఆధారాల మేరకు సిబిఐ కానీ, ప్రాసిక్యూషన్ కానీ తమ అభియోగాలను నిరూపించలేకపోయారు.  అంటే ఇది సాక్ష్యాలపై ఆధారపడిన కేసుగా అర్ధమవుతోంది. కేసు నిలబడనంత మాత్రాన అంతకు ముందు ఎత్తిచూపిన అంశాలు వాస్తవం కాకుండా పోవు. టూజి స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారాలను చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. అసలీ కేసు దర్యాప్తు ఆరేళ్లక్రితం సిబిఐ టుజి స్పెక్ట్రమ్ కేసులో మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ప్రారంభమైంది.  వినోద్ రాయ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పెక్ట్రమ్ కేటాయింపులు, లైసెన్సులు జారీ వంటి అంశాలలో పలు అవకతవకలు జరిగినట్లు తేల్చింది.  మాజీ టెలికాం శాఖామంత్రి ఏ.రాజా  ఆయన కార్యదర్శి సిధ్దార్ధ్ బెహూరా సహా మరో 12మందికి ఈ వ్యవహారంలో  హస్తమున్నట్లు సిబిఐ చెప్పింది.  వేలంపాటలో కేటాయించాల్సిన స్పెక్ట్రమ్ తాము అనుకున్నవారికి కట్టబెట్టేందుకు ఆఖరి తేదీలను సవరించడం, గడువు ముగిసినా నిబంధనలను మార్చడం వంటి అనేక లోపాయికారీ వ్యవహారాలు ఈ 12మంది చేసినట్లు సిబిఐ అభియోగం అలానే లైసెన్సుల జారీ ప్రక్రియ కోసం అనుసరించామంటూ చెప్తోన్న ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదిక కూడా అనుమానాలకు తావిచ్చింది. ఏదైతే స్పెక్ట్రమ్ కేటాయింపు జరిగిందో అది 2001నాటి రేట్ల ప్రకారం చేసారు..ఐతే వేలం జరిగిన  సమయం మాత్రం 2008లో. అంటే ఖచ్చితంగా తక్కువ ధరలకే కేటాయింపు చేసారని తేల్చారు. అంచనా ధరలకంటే కూడా బాగా తక్కువ ధరలకే కేటాయించారనే మరో అంశం కూడా అభియోగాలకు తావిచ్చింది. ఇలా కేంద్రప్రభుత్వానికి దాదాపురూ.1.76లక్షలకోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ లెక్కగట్టింది. నిబంధనల మేరకు అర్హత సాధించకపోయినా స్వాన్ టెలికాం రూ.1537కోట్లకు లైసెన్స్ పొందడం ఆరోపణలకు గురైంది. అలానే మరో 8 కంపెనీలు కేవలం రూ.10722కోట్లు మాత్రమే చెల్లించి 2జి లైసెన్సులు పొందడం కూడా అనుమానాస్పదంగా మారింది. ఐతే ఇలా లైసెన్సులు పొందిన ఈ సంస్థల తర్వాతి కాలంలో వారి విదేశీ భాగస్వాములకు లేదంటే పెద్ద సంస్థలకు తమ వాటాలు అమ్ముకుని భారీగా సొమ్ము వెనకేసుకున్నారు. ఇవన్నీ అప్పుడు చోటు చేసుకున్న సంఘటనలు..తాజా తీర్పుతో ఇవన్నీ పటాపంచలు అయినట్లు నిందితులు చెప్పుకుంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మాత్రం హైకోర్టుకు వెళ్తామనే అంటోంది

కేసు తీర్పుకి ఈ బేటీ కూడా కారణమేనా


Comments