కోడిపందేల వలనే కోడి జాతి బతికిపోతోందట, ఏం చెప్పావయ్యా రాజూ


కోడిపందేలు వద్దు అని హైకోర్టు నిర్ద్వంద్వంగా చెప్తే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లైనా పర్మిషన్ తెచ్చుకుంటామని కొంతమంది వాదించడం కాస్త అర్ధం చేసుకోవచ్చు. దీనికి సంప్రదాయం అనే ముసుగు వేయడం ఇంకా కొనసాగుతూనే ఉఁది. ఎందుకంటే ఏదో రెండు మూడు జిల్లాలకు పరిమితమైన దాన్ని రాష్ట్రమంతా వ్యాపించేలా చేయడం మంచిది కాదు. ఎప్పుడో పల్నాడులో కోడిపందేలు జరిగాయని..అప్పటి యుధ్దాన్ని కథలుగా చెప్తుంటారు.

సంప్రదాయం పేరు చెప్పి కోడి పందేలు సాగాలని చెప్పేవాళ్లు.. ఒకప్పుడు ఓలి, ఇంకా కొనసాగుతోన్న వరకట్నం ఆచారాలు కూడా సంప్రదాయాలుగానే చూస్తారా..ఇంకా వెనక్కి వెళ్లే బలవంతంగానో, బలహీనతతోనో సతిసహగమనం అనే వ్యవహారం సాగింది మరి దాన్ని కూడా ఇంకా సంప్రదాయంగా చూస్తే ఎలా. చిన్న ప్రాణి కాబట్టి కోడిని వదిలేయాలి అనడం కాదు.
ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీనుంచి ఆ పార్టీకి జంపై ఎక్కడా చోటు దొరక్క చివరకు బిజెపిలో సెటిలైన రఘురామకృష్ణరాజు అనే లీడర్ వాదన మరీ విచిత్రంగా ఉఁది. కోడి పందేలు ఆడొద్దని కోర్టు చెప్పలేదట. వాటికి కత్తులు కట్టొద్దు కత్తులను మాత్రం సీజ్ చేయండి. ఇలా పందేలు కట్టినవారికి పదిరూపాయలు జరిమానా విధించండి అని చట్టంలో ఉందంటాడాయన. పైగా కోళ్లు వాటంతట అవే కొట్టుకుంటాయట..వాటిని చూడటం తప్పు కాదని కూడా సమర్ధించుకుంటాడు. నిజంగా ఎక్కడైనా కోళ్లు కొట్టుకోవచ్చు కానీ కోడిపందేలు సాగే స్థాయిలో జనం చూస్తున్నా..రెచ్చగొడుతున్నా వాటంతట అవే కాళ్లకు బ్లేడ్లు, కత్తులు కట్టుకుని పోరాడతాయా...?

ఇంకా కోడిపందేల ద్వారా కోడి జాతులు సంరక్షించబడుతున్నాయ్ వాటి జాతి వర్ధిల్లుతుంది లేదంటే వాటిని కోసుకుతినేస్తారు అని చెప్పడం ద్వారా రఘురామకృష్ణరాజులాంటి వాళ్లు ఏం చెప్పదలిచారో కానీ ఆయన వాదన చూస్తున్నంత సేపూ ఇలాంటోడికి సీటు నిరాకరించి తెలుగు పార్టీలు మంచి పని చేశాయనిపించింది పైగా బోలెడంత కామెడీ కూడా పుట్టింది. టివిఛానల్స్ రేటింగ్ పెంచుకోవడానికి రకరకాల ఐటెమ్స్ పై డిస్కోలాడిస్తాయ్..ఐతే వాటిలో వెళ్లే ముందు తమ వాదన ఎలా  ఉందో ఓసారి సరిచూసుకోకపోతే జనానికి బోలెడంత వినోదం దొరుకుతుంది తప్ప సామాజిక ప్రయోజనం ఆశించడం దండగ..ఇప్పటికే ఈ విషయం చాలామందికి తెలిసిపోయింది కూడా. అయినా ఇలాంటి వాళ్లు కేతిగాళ్లలాగా హాస్యాన్ని పోషిస్తూ బతికిస్తుంటారు

Comments