ప్రభుత్వంలో ఏపిఎస్ఆర్‌టిసి విలీనమా..! తర్వాత ఏం జరగొచ్చు


వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటూ ఓ ప్రకటన చేశారు. దీనిపై ఆ శాఖ కార్మికులు కొందరు అప్పుడే అదేదో జరిగిపోయినట్లుగా కృతజ్ఞతలు తెలియజేయడం కూడా జరిగిపోయింది. ఇక్కడే కొన్ని వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది

1958లో ఏర్పాటు అయిన రాష్ట్రరోడ్డు రవాణా సంస్థలో 55628 మంది ఉద్యోగులు ఏపిఎస్ఆర్‌టిసిలో ప్రస్తుతం పని చేస్తున్నట్లు సంస్థ సమాచారం. రూ.5100కోట్ల ఆదాయం ప్రతి ఏటా ఆర్జిస్తున్న ఈ సంస్థలో పని చేసే ఉద్యోగులకు పదవీవిరమణ సందర్భంగా ఇచ్చే నగదే తప్ప పెన్షన్ సౌకర్యం ఉండేది కాదు. ప్రభుత్వ రంగ సంస్థే తప్ప ఇది పూర్తిగా ప్రభుత్వ సంస్థ కాదు. ఏపీ ఆర్టీసీకి 126 బస్ డిపోలు 426 బస్ స్టేషన్లు ఉన్నాయి. 11678 బస్సులతో 44లక్షల 15వేల కిలోమీటర్లలో సర్వీసులు తిరుగుతుండగా..2016 ఫిబ్రవరినాటికి ఉన్న లెక్కల ప్రకారం 4650 మిలియన్ రూపాయల నష్టాలతో నడుస్తోంది. 1999లో అయితే 22వేల బస్సులతో ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా సంస్థగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి కూడా ఏపిఎస్ఆర్‌టిసి ఎక్కింది. ఇది ఆర్‌టిసి గురించిన కాస్త చరిత్ర మాత్రమే

ప్రవేట్ వాహనాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, వ్యక్తిగతంగా వాహనాలు పెరిగిపోవడం, కాలం చెల్లిన బస్సులనే పట్టుకుని వేలాడటం వంటి అనేక కారణాలతోఆర్‌టిసి ఎప్పటికప్పుడు నష్టాల్లోనే కూరుకుపోతుంది తప్ప లాభాల్లోకి వచ్చింది లేదు. ఐతే ఈ పరిస్థితుల్లోనూ ఆర్టీసి బస్సుకి ఆదరణ తగ్గలేదు. ఇప్పటికీ రాష్ట్రంలోఆర్టీసీ బస్సు ప్రయాణం తప్పనిసరి అయిన గ్రామాలు పట్టణాలు కోకొల్లలు. రాజకీయపార్టీల సభలు సమావేశాలకు జనాల తరలింపు వీటి ద్వారానే. ఎన్నికలు తదితర సామూహిక కార్యక్రమాలకు సిబ్బందిని తరలించేదీ ఈ ప్రగతి రధచక్రాలపైనే! తెలంగాణ వరకూ జిహెచ్ఎంసీలో విలీనమవుతుందనే వార్తలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వీటిపై ఉలుకూ పలుకూ లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రకటనతో ఒక్కసారిగా ఆర్టీసీ అంశం మరోసారి చర్చకు వస్తోంది. 

  • ఎందుకంటే ప్రభుత్వంతో విలీనమైతే నష్టాలతో నిమిత్తం లేకుండా సర్వీసులు నడుస్తాయ్
  • ప్రభుత్వ ఉద్యోగుల హోదా ఈ 55వేల చిలుకు ఉద్యోగులకు వర్తిస్తుంది
  • ఈ ఉద్యోగులందరికీ ప్రభుత్వపరంగా వచ్చే గృహనిర్మాణం, ఇతర ఋణాలు మంజూరు అవుతాయి
  • అన్నింటికన్నా ముందుగా పెన్షన్ (పించన్) సౌకర్యం కలుగుతుంది
  • రాజకీయసభలకోసం కాకుండా సర్వీసులు యధావిధిగా నడవచ్చు
  • ఐతే నష్టం ఏమిటయ్యా అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలోని పెద్దల నిర్ణయాలకు అనుగుణంగా సర్వీసులు నడపాలి
  • ఉద్యోగుల భర్తీ కూడా వారికి ఇష్టం వచ్చిన రీతిలో జరిపే అవకాశం ఉంది 

(ఇవన్నీ ప్రాథమిక జ్ఞానంతో వేసిన అంచనాలు తప్పులు ఉంటే సరి చేయగలరు)

Comments