భ్రమల సదస్సుకి అంతా సిధ్దం

                                       
                                                 ( కథనం మొత్తం  నాసాగారి సౌజన్యమే)
విశాఖ వేదికగా ముచ్చటగా మూడోసారి భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలంతా హాజరుకాబోతున్నారు. గత రెండు సదస్సుల్లో సుమారు రూ.15లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలకు సంతకాలు చేసుకున్నారు. వాస్తవానికి అందులో 2 శాతం కూడా పెట్టుబడులు రాలేదని తెలిస్తే మనకు మతిపోతుంది. లక్షల్లో ఉద్యోగాలంటూ ఊదరగొడ్తున్నారే కానీ కనీసం వేలల్లో కూడా ఆ సంఖ్య లేదని తెలిస్తే ఔత్సాహికులు రగిలిపోతారు. తూతూ మంత్రంగా సాగుతున్న ఈ భాగస్వామ్య సదస్సులు కేవలం కట్టుకథలకు వేదికలుగా మారాయి స్పష్టంగా అర్థమవుతోంది.2016లో సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు, 2017లో ఆ సంఖ్య రెట్టింపై ఏకంగా రూ.10 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు. వీటిని చూస్తే... మన మనస్సు పులకించిపోతుంది. అబ్బబ్బా.. ఇన్ని లక్షల కోట్లు మన ఆంధ్రకు వచ్చిపడ్తున్నాయా.. అంటూ ఉబ్బితబ్బిబ్బైపోతాం. రాష్ట్రంలో ఔత్సాహికులందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయే అంటూ సంబరపడ్తాం. కానీ ఇవన్నీ కాకిలెక్కలు. కట్టుకథలు. సముద్ర తీరంలోని నీళ్లపై రాస్తున్న లెక్కలు. స్వయానా సిఎం డాష్ బోర్డ్‌లో కూడా చాలా తప్పుల తడకలు లెక్కలు ఉండడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాస్తవానికి ఎంఓయూ కుదుర్చుకున్నప్పటి నుంచి ఆన్ గ్రౌండ్‌లో ప్రొడక్షన్ మొదలయ్యే వరకూ వివిధ దశలు ఉంటాయి. వాటిని ఏపి ప్రభుత్వం 9 దశలుగా విభజించింది. R4 అంటే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ సమర్పణ నుంచి G1 అంటే.. ప్రొడక్షన్ మొదలైంది అనే వరకూ చాలా దశలున్నాయి. ఇందులో జి1 ఒక్కటినే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
2016 విషయానికి వస్తే.. ప్రభుత్వ లెక్కల ప్రకారం అప్పటి ఒప్పందాల్లో కార్యరూపం దాల్చినవి రూ.70 వేల 338 కోట్లు. కానీ వాస్తవానికి ఈ లెక్క కేవలం రూ.21 వేల కోట్లు మాత్రమే. ఎందుకంటే ప్రభుత్వం చెప్పున్న వాటిల్లో సుజ్లాన్ ఎనర్జీ అనే సంస్థ రూ.28 వేల కోట్లు, ఐనాక్స్ విండ్ అనే సంస్థ రూ.840 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చెప్పారు. వాస్తవానికి ఈ రెండు సంస్థలూ అప్పుల ఊబిలో కూరుకుపోయి.. బయటికి రాలేక నానా తంటాలు పడ్తున్నాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఏ ప్రాంతంలో పవన విద్యుత్ ప్లాంట్ పెడ్తారో కూడా తెలియకుండానే సుజ్లాన్‌తో రూ.28 వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఏపి సర్కార్.
ఇక హెటిరో, హీరో విండ్, గమేసా లాంటి సంస్థల పెట్టుబడులన్నీ ఎప్పుడో వచ్చినా వాటిని భాగస్వామ్య సదస్సు కోటాలో పడేశారు. ఇక ఐటి విషయానికి వస్తే.. 2016లో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.34 కోట్లు. అవును మీరు విన్నది నిజమే 2016లో ఐటికి వచ్చిన పెట్టుబడి రూ.34 కోట్లు, దాని ద్వారా వచ్చిన ఉద్యోగాలు కేవలం 275. ఇలా అన్నింటినీ పోస్ట్ మార్టం చేసుకుంటూ వెళ్తే చివరికి 2016 భాగస్వామ్య సదస్సు ద్వారా ఏపికి వచ్చిన పెట్టుబడులు రూ.21 వేల కోట్లు. దాని ద్వారా వచ్చిన ఉద్యోగాలు 48 వేలు
ఇక 2017లో జరిగిన భాగస్వామ్య సదస్సుకు వద్దాం. ఇందులో ఎన్ని జోకులు, కామెడీ యాంగిల్స్ ఉన్నాయో చెప్పనేలేము. రూ. 7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి పనులు నడుస్తున్నాయంటూ ప్రభుత్వం తన వెబ్ సైట్లో చెప్పుకుంటోంది. కానీ గ్రౌండ్ రియాల్టీ ఏంటో చూస్తే నవ్విపోతారు. ఎందుకంటే కేవలం రూ.1516 కోట్ల విలువైన పెట్టుబడులే వచ్చాయి. రష్యాకి చెందిన JSC సంస్థ రూ. 998 కోట్లు పెట్టి సంస్థ నిర్వాహణను మొదలుపెట్టిందని చెప్పారు కానీ.. కేవలం ఒక్క ఉద్యోగాన్ని కూడా కల్పించలేదు. ఇక వెల్లూర్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు పెట్టిన పెట్టుబడులను అటు సిఆర్‌డిఏలో, ఇటు హయ్యర్ ఎడ్యుకేషన్‌లో చూపించారు. పగలబడి నవ్వుకోవాల్సిన అంశం ఏంటంటే.. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.29700 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, దానివల్ల 45 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వాస్తవానికి యూనివర్సిటీలో అంతమంది విద్యార్థులు కూడా ఉండరు. అలాంటప్పుడు 45 వేల ఉద్యోగాలు, రూ.30 వేల కోట్ల పెట్టుబడులు ఎలా సాధ్యమనే విషయం కామన్ మ్యాన్‌కు అర్థంకావాలి. ఇక వెల్లూర్ యూనివర్సిటీ రూ.3700 కోట్లను కుమ్మరిస్తోందని లెక్కలుగట్టేశారు. అలాంటి గాలిలెక్కలన్నింటినీ పక్కనబడేసి చూస్తే 2017 భాగస్వామ్య సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.1500 కోట్లు. వచ్చిన ఉద్యోగాలు 15 వేలు. అంటే 10 లక్షల కోట్ల రూపాయలకు ఒప్పందాలు కుదుర్చుకుంటే రూ.1500 కోట్ల  పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి లెక్కేలెస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే వర్కవుట్ అవుతున్నాయి
2016, 2017 సంవత్సరాల్లో ప్రతిపాదనలుగానే మిగిలిపోయిన వాటి విలువ రూ.5.78 లక్షల కోట్లు. ఈ కంపెనీలు కనీసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కూడా సమర్పించలేదు. అంటే కేవలం ఫోటో ఆపర్చునిటీ కోసం అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు తప్ప అందులో విషయమేమీ లేదు. ఏదైనా కంపెనీ మెమొరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ కుదుర్చుకుంటోంది అంటే దానర్థం వాళ్లకు కొద్దోగొప్పో ఇంట్రెస్ట్ ఉండబట్టే అర్థం. కానీ ఇక్కడి అవగాహనా ఒప్పందాలన్నీ.. కేవలం జనాల్ని అమాయకులని చేయడానికే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పెట్టుబడులన్నీ పేపర్లపైనా, కట్టుకథలన్నీ ప్రభుత్వ లెక్కల్లో కనిపిస్తున్నాయి
                                                 ( కథనం మొత్తం  నాసాగారి సౌజన్యమే)

Comments