స్టీఫెన్ హాకింగ్..మహామనిషి


స్టీఫెన్ హాకింగ్..ఒక మనిషి చిత్తశుద్దితో కార్యదీక్ష కలిగి ఉంటే ఎన్ని అద్భుతాలు సృష్టించగలడో అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఐతే ఆయన శాశ్వతంగా కన్నుమూయడం శాస్త్రలోకానికి తీరని లోటుగా చెప్పాలి.  1942 జనవరి 8న ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించిన హాకింగ్స్ 76ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఒక మనిషి జననం ఎంత సాధారణమో..ఏదోక రోజు చనిపోవడమూ అంతే సహజం..ఐతే ఈ మధ్యకాలంలో సదరు వ్యక్తి ఎలా జీవించాడనేదే తర్వాతి తరాలకు గుర్తుండిపోయేలా చేస్తుంది. చెట్లూ పుడుతున్నాయ్. మనుషులూ పుడుతున్నారు..పెరుగుతున్నారు..ఏదోలా బతుకు బండి లాగించేస్తున్నారు ..చివరికి ఆఖరి మజిలీలో ఏం సాధించారని చూసుకుంటే మాత్రం ఏం మిగలకపోవచ్చు..కానీ కొంతమంది మాత్రం భూమిపై తమవంటూ కొన్ని ముద్రలు వేస్తారు. అలాంటి వాళ్లో స్టీఫెన్ హాకింగ్ మొదటి స్థానంలో ఉంటారనడంలో సందేహం లేదు. ఎందుకంటే..21ఏళ్ల వయస్సులోనే శరీరం చచ్చుబడటం ప్రారంభమై కొన్నాళ్లకి ఇక పూర్తిగా కుర్చీలో కూలబడి వెళ్లడం తప్ప ఇంకేమీ చేయలేడు అని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. కానీ ఓ రకంగా విధిని ఎదిరించే పట్టుదల సొంతమైనప్పుడు అవకాశాలు సాధ్యమవుతాయని స్టీఫెన్ హాకింగ్ నిరూపించాడు. ఏకంగా ఆకాశంలోని అద్భుతాలు, వాటి వెనుక ఉన్న నిగూఢ రహస్యాలను ఆవిష్కరించగలిగాడు. ఏకాగ్రత, పట్టుదల, స్ధిరత్వంతో ఆయన చెప్పిన అంశాలు, సిధ్దాంతాలు తర్వాతి తరాలవారికి కూడా అనుసరణీయంగా మారాయ్.
నలుగురు పిల్లలలోఒకరిగా జన్మించిన స్టీఫెన్ హాకింగ్ కుటుంబం మొదట్లో నార్త్ లండన్ ఉండేది. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌కి నివాసం మార్చింది. మొదట్లో స్టీఫెన్ హాకింగ్స్ జీవశాస్త్రం చదవగా..డిగ్రీ కూడా అందులోనే తీసుకున్నాడు. హాకింగ్ తండ్రి కొండప్రాంతాల్లో దొరికే మూలికలతో వైద్యం చేస్తుండేవాడు..ఆయన తన కొడుకు స్టీఫెన్ కూడా అదే వృత్తి స్వీకరిస్తాడని అనుకున్నాడు. కానీ హాకింగ్ మాత్రం మంచి లెక్కల మాస్టార్ అవుదామనుకున్నాడట. ఈ రెండూ కాకుండా జీవశాస్త్రం సబ్జక్ట్ గా తీసుకోవడం మధ్యేమార్గంగా అనుకోవాలి. అలా కాలం జరుగుతుండగానే...1963లో స్టీఫెన్ హాకింగ్ శరీరం చచ్చుబడిపోయిన వ్యాధి బారిన పడ్డాడు..ఇదే విషయం హాకింగ్ 2013లో అంటే 71వ ఏట గుర్తు చేసుకుంటూ,  " నా పని అయిపోయింది, ఇక నన్నెవరూ కాపాడలేరు..నా జీవితం వృధా అని అనుకున్నా..కానీ ఇప్పుడు మాత్రం నా గడచిన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో తృప్తిగా ఉంది " అని ప్రకటించడం విశేషం.
అనుకోవడానికి ఈ రెండు మాటలూ చాలా సాఫీగా ఉండొచ్చు..కానీ అసలు శరీరమే కదలని..గొంతు పెగలని స్థితిలో ఉన్న మనిషి ఒక్క రోజు మామూలు జీవితం గడపడమే భారం..అలాంటిది ఏకంగా 55ఏళ్లు అలానే జీవించడం వైద్యశాస్త్ర అద్భుతాలతో  పాటు..ఆ వ్యక్తి జీవితేఛ్చ కూడా ప్రశంసించదగ్గది. ఇక స్టీఫెన్ హాకింగ్ కి ఇచ్చిన డిగ్రీలు కనీసం డజనుకిపైగానే. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే గ్రంథం శాస్త్రవేత్తల లోకం హాకింగ్ స్థానాన్ని సుస్థిరం చేసింది. బాంటమ్ ప్రెస్ 1988లో ఈ పుస్తకం పబ్లిష్ చేయగా అంతకుముందు 20మంది పబ్లిషర్లు దాన్ని తిరస్కరించడం విశేషం.


విశ్వం. దాని పుట్టుక భౌతికశాస్త్రం వంటి విషయాలపై ఆయన రాసిన గ్రంథాలు 237 వారాలపాటు నంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం. వీల్ ఛైర్‌కే పరిమితమైన స్టీఫెన్ హాకింగ్ 1985లో ఒక కంప్యూటర్ సాయంతో బైటి ప్రపంచానికి మరోసారి కన్పించాడు. తన బుగ్గల కదలికతో ఆ కంప్యూటర్ ని ఆపరేట్ చేశాడాయన అప్పట్లో. ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్, ది బిగ్ బ్యాంగ్ థియరీ, స్టార్ ట్రెక్ వంటి సినిమాల్లోనూ కన్పించాడు స్టీఫెన్ హాకింగ్. టైమ్ ట్రావెల్, బ్లాక్ హోల్స్ , అలియన్స్ మిస్టరీ వంటి అనేక అంశాలపై తన సిధ్దాంతాలను అభిప్రాయాలను వ్యక్తీకరించాడు. కొన్నాళ్ల తర్వాత భూమి మనుషులకు నివాసయోగ్యం కాదని..గ్రహాంతరవాసులతో కనెక్ట్ అవ్వాలనే ప్రయత్నాలను మానుకోవాలనీ హాకింగ్ విస్పష్టంగా చెప్పారు. సాపేక్షసిధ్దాంతంపై ప్రయోగాలు చేసి సిధ్దాంతాలు పొందుపరిచిన స్టీఫెన్ హాకింగ్ జీవితంలో కాస్మోలజీని ప్రతిపాదించడమే పెద్ద విజయంగా చెప్పాలి..అసలీ సిధ్దాంతాన్ని రూపొందించినదే ఆయన. సాపేక్షసిధ్దాంతం, క్వాంటమ్ మెకానిక్స్ కలయికతోనే దీన్ని ప్రతిపాదించాడాయన.ఆయన చెప్పిన మాటల్లో తెలివి అంటే మార్పులకు అనుగుణంగా మారగలిగే సామర్ధ్యమే . అలానే జ్ఞానానికి అతి పెద్ద శత్రువు అంటే అజ్ఞానం కాదని..జ్ఞానం ఉందని అనుకోవడమేనట. అలానే లోకంలో జరిగే ప్రతి విషయమూ ముందే విధి ద్వారా లిఖించబడి ఉంటుందని నమ్మేవాళ్లూ రోడ్డు దాటే ముందు కూడా అలానే విధికే వదిలేసి దాటాలని స్టీఫెన్ హాకింగ్ చమత్కరించారు కూడా..!


కుటుంబ విషయానికి వస్తే స్టీఫెన్ హాకింగ్ చదువుకునే రోజుల్లోనే ప్రేమించిన జేన్ విల్డేని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ ముగ్గురు సంతానం కాగా..1995లో ఆమెకి విడాకులు ఇచ్చి తనకి సర్వీస్ అందించే నర్స్ ఎలైన్ మేసన్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఆమెకి కూడా 2006లో విడాకులు ఇచ్చి తన మొదటి భార్య, ఆమె సంతానం, మనవళ్లు, మనవరాళ్లతోనే చివరి వరకూ గడిపారు. ఇక స్టీఫెన్ హాకింగ్‌కి వచ్చిన అవార్డులకు లెక్కలేదు. ఇప్పుడు కన్నుమూసినా..శాస్త్రవేత్తల జాబితాలో మాత్రం అగ్రస్థానంలో శాశ్వతంగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు

Comments