గురువాయూర్‌ని దర్శించాలంటే చివరికి బొద్దింకలా పుట్టాలా!..ఎన్నాళ్లీ ఆక్రొశం


ఆయనో ప్రముఖ గాయకుడు..ఆయన స్వరం వింటే చాలు మిన్నాగులైనా ఆడతాయనేంతటి మధుర కంఠం. ఆధ్యాత్మికత ఉట్టిపడే గొంతుకతో ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకున్న సదరు గాయకుడు ఇప్పుడు తన ఆవేదన వెళ్లిబుచ్చాడు. కేవలం తన మతం, కులం కారణంగానే తనకి ఇష్టమైన దైవాన్ని దర్శించుకునే భాగ్యం కలిగించుకోలేకపోయాడంటే..నమ్మగలరా..ఇప్పుడదే విషయాన్ని చెప్పాడాయన. చిన్ననాటినుంచే తాను పూజించే గురువాయూర్ శ్రీకృష్ణుని ఇంతవరకూ చూడలేదని..కనీసం ఓ పురుగులా పుట్టినా ఈ పాటికి తన దేవుడ్ని చూసి ఉండేవాడినని హృదయం ద్రవించిపోయేలాగా తన ఆవేదన వెళ్లగక్కాడు. దీంతో మరోసారి ఈ విషయం చర్చకు వస్తోంది. దీనికి కారణంగా చెప్పేది యేసుదాసు కులమే..ఆయనది రోమన్ కేథలిక్కుల మతంగా చెప్తారు..ఐనా ఆయన ఇంట్లో హిందూసంప్రదాయాలే పాటిస్తారు. కెరీర్ బిగినింగ్‌లో ఇలాంటి దరిద్రపు ఆంక్షలతోనే కొంతమంది గాయనీమణులు యేసుదాసుతో పాడటానికి నిరాకరించారు కూడా..78 ఏళ్ల వయస్సులో ఇప్పుడు కూడా యేసుదాసు కృష్ణదర్శనానికి ఆక్రోశించడం బాధ కలిగించేదే.

కొచ్చిన్‌లో పుట్టిన కట్టసెరీ జోసెఫ్ యేసుదాస్ చిన్ననాటినుంచే ఆర్ధిక బాధలు ఎదుర్కొన్నారు . తండ్రి నుంచి అబ్బిన జ్ఞానంతో కర్నాటక సంగీతంలో కేరళ రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. అప్పట్లో తిరుపుణిత్తారని లో ఒక మ్యూజిక్ కాలేజ్ ఉండేది. అందులో చేరితే తన ప్రతిభకి ఇంకా సానపట్టవచ్చని జేసుదాసు తండ్రి ఆయన్ని అక్కడ చేర్పించగా..అక్కడా తోటివారి ఎగతాళికి గురయ్యాడు. అలా సంగీతజ్ఞానం ఆర్జించుకుంటుండగానే..జేసుదాసు తండ్రి ఆగస్టీన్ చనిపోయాడు. దీంతో కుటుంబం ఆర్ధికభాదలు ఎక్కువయ్యాయ్. అలా చెన్నైకి వస్తే తన సంగీతానికి ఆదరణ దక్కి ఆర్ధికంగా కూడా నిలదొక్కుకోవచ్చనే ఆలోచనతో చెన్నపట్నం చేరాడు జేసుదాస్. అలా దాదాపు రెండేళ్లు తిరిగినా ఎలాంటి అవకాశాలు ఆయనకు రాలేదట.ఐతే మద్రాసులోనే అనేక స్టేజీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా..ఏకే ఆంటోనీ అనే మలయాళ దర్శకుడు 1961లో జేసుదాసుకు మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చారు. జాతి బేధం, మాతాద్వేషం అనే పల్లవితో ప్రారంభమయ్యే ఆ పాట ఆయనకి కాస్త పేరు తీసుకురాగా..అటెన్షన్ పెన్నే అటెన్షన్ పెన్నే అనే పాట మలయాళంలో బాగా పేరు తెచ్చింది. కాల్పడుకాల్ అనే మలయాళం మూవీలో ప్లేబాక్ సింగింగ్‌తో ఇక ఫుల్ ప్లెడ్జెడ్ గా తన కెరీర్ ప్రారంబించారాయన. ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో తన ముద్ర వేయడం ఆరంభించాడాయన. 1967లో విడుదలైన భార్య అనే మలయాళ సినిమాతో ఆయనకి పెద్ద బ్రేక్ లభించింది. 1965లో సోవియట్ యూనియన్ ప్రభుత్వం ఆయనని తమ దేశాల్లో ప్రదర్శనలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానించడం విశేషం..అంటే కెరీర్ ప్రారంభించిన నాలుగేళ్లకే అంత పేరు తెచ్చుకున్నాడటన్నమాట. రేడియో కజకస్తాన్‌లో ఓ రష్యా పాట కూడా అప్పట్లోనే ఆయన ఆలపించారు. మలయాళంలో ప్రేమ్ నజీర్ అనే గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిందీ ఈ సమయంలోనే. 1970లోనే కేరళ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు కేజే ఏసుదాస్. అతి చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా జేసుదాసుకు రికార్డు ఉంది .తెలుగులోనూ అంతులేని కథలో దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి పాటతో విపరీతమైన అబిమానులను సంపాదించుకున్నారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గాత్రానికి సమకాలికంగా పేరు తెచ్చుకున్నారు.
 కృష్ణకు బాలుకి విబేధాల సమయంలో కృష్ణ సినిమాల్లో అన్ని పాటలూ కొంతకాలం జేసుదాసే పాడారు. విషాద గీతాలు, భక్తిరసగాత్రాలు ఏవైనా అవి జేసుదాసుకే వెళ్లేవి. ముఖ్యంగా రమేష్ నాయుడు సంగీతంలో వచ్చిన మేఘసందేశం సినిమాలో పాటలు అజరామరం అనడంలో సందేహం లేదు. మోహన్ బాబు తన సినిమాల్లో ఒక్కటైనా జేసుదాసు పాటలు ఉండేట్లుగా చూసుకునేవారు. ఇక్కడ బాలుకి ఎంత పేరు వచ్చిందో, మలయాళంలో జేసుదాసుకు అంత పేరు వచ్చింది..కొన్ని లెక్కల ప్రకారం జేసుదాసు 80వేల పాటలు పాడారంటారు. యాభైఏళ్లుగా తన స్వరంతో ప్రేక్షకులకు గానామృతం పంచుతోన్న జేసుదాసు ఆధ్యాత్మిక మార్గంలోనూ పయనించారు. ప్రతి ఏటా అయ్యప్ప మాల ధరించేవారు. అసలు అయ్యప్పపై పాటలంటే ఏసుదాసు గాత్రం లేనిదే ఊహించుకోవడం కష్టమనే స్థాయిలో లెక్కలేనన్ని పాటలు ఆయన పాడారు. వ్యక్తిగత విషయాలకు వస్తే జేసుదాసుకి కొచ్చిలోనే ప్రభ అనే ఆవిడతో వివాహం జరిగింది. వినోద్,విజయ్,విశాల్ అని ముగ్గురు కొడుకులు ఉన్నారు .వారిలో విజయ్ ఏసుదాస్‌ గొంతు అచ్చం తండ్రి గాత్రంలానే ఉంటుంది. విజయ్‌ కూడా మంచి గాయకుడు కావడంతో రెండు సార్లు  కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు దక్కించుకున్నారు.



కొల్లూరు మూగాంబిక ఆలయంలో 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా గానోత్సవాలు జరుపుతున్నారు. సరస్వతి కీర్తనలను తొమ్మిదిరోజుల పాటు ఆలపించడం వీటి ప్రత్యేకత. ఇప్పటికి ఇలా 18ఏళ్లుగా సాగుతున్నాయ్. ఇక జేసుదాసుకు వచ్చిన అవార్డులకు లెక్కేలేదు. 1975లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్  అత్యున్నత పురస్కారాలు కాగా, 7 జాతీయ ఉత్తమ నేపధ్య గాయకుడు అవార్డులు దక్కించుకున్నారు. కేరళ రాష్ట్ర ఆస్థాన గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక గాయకుడు ఏసుదాసే.. కేరళ రాష్ట్ర ఉత్తమ నేపధ్యగాయకుడిగా పాతికసార్లు పురస్కారాలు అందుకున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగుసార్లు అవార్డు అందుకున్నారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఆనందలోక్ బెస్ట్ మేల్ ఫ్లేబ్యాక్ అవార్డ్. చెన్నై నుంచి
సంగీత కళాశిఖామణి అనే పురస్కారం కూడా దక్కించుకున్న ఏసుదాసు స్వరం దైవదత్తమైనదని..సంగీత దర్శకుడు బప్పీలహరి శ్లాఘించడం గొప్ప విషయంగా చూడాలి. అలానే రవీంద్రజైన్ అనే సంగీతదర్శకుడు తనకి చూపంటూ వస్తే మొదటిగా చూడాలనుకునేది జేసుదాసునే అంటూ చెప్పడం ఆయనకి ఉన్న ప్రతిభని చెప్పకనే చెప్తోంది..ఐతే ఇంత ఘనత ఉన్నా..తన జీవిత చరమాంకంలో కూడా గురువాయూర్ దేవస్థానంలోని శ్రీకృష్ణుని దర్శనభాగ్యం దక్కకపోవడం మాత్రం కలచివేస్తుందని చెప్పడం ఎవరికైనా చివుక్కుమనిపించే విషయమే. మరి ఇన్నాళ్లూ కేరళ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే..గురువాయూర్ దేవస్థానం ముందు కూర్చుని పాటలు పాడటం వరకూ అనుమతిస్తోంది తప్ప లోపలికి మాత్రం వెళ్లనీయలేదు..కమ్యూనిస్టు భావజాలం ఉన్న ప్రాంతమైనా..ఆధ్యాత్మికమైన అంశం కావడంతో ఇందులో చొరవ చూపించడానికి ప్రభుత్వాలు సాహసించడం లేదనుకోవాలి. లేకపోతే..శబరిమల ఆలయంలోకే మహిళల ప్రవేశానికి దాదాపుగా సుప్రీంకోర్టు అనుమతి ఇస్తోన్న నేపధ్యంలో ఏసుదాసు లాంటి గాయకులకు ఆలయప్రవేశం నిషిధ్దం చేయడం తప్పిదమే అవుతుంది

Comments