ట్రెండ్ సెట్ చేశాడు..కానీ బూతుల ఇవివిగానే గుర్తుండిపొయాడు


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్లు కొంతమందే ఉంటారు. వారిలో కొంతమంది సృష్టించిన దారి కొంతకాలం మాత్రమే మనుగడలో ఉంటుంది
ఐతే ఈ డైరక్టర్ వేసిన మార్గం మాత్రం గత దాదాపు 30 ఏళ్లుగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్ని ట్రెండ్స్ వచ్చినా..ఆయన ట్రెండ్ ని ఫాలో అవ్వని డైరక్టర్లంటూ లేరు..ఒకరకంగా ఆయన సినిమాలను బూతు సినిమాలనేవాళ్లూ ఉన్నారు..డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ని ఊరు ఊరుకీ వ్యాపింప జేసిన ఘనుడు ఇప్పుడు వాడుకలో ఉన్న అనేకానేక డైలాగ్స్‌కి ఆద్యుడు ఆయనే. ద్వంద్వార్ధాల మాటలనే తన బ్రాండ్ గా చేసుకున్న ఈవివీ సత్యనారాయణ పుట్టింది పశ్చిమగోదావరి జిల్లా దొ్మ్మేరులో..మరి అక్కడివారంతా మాటకారులు..అందులోనూ ఎటకారం పాళ్లెక్కువ అంటారు. అందుకే ఆ గాలి అబ్బిందేమో కానీ ఈదర వీరవెంకట సత్యనారాయణ ఉరఫ్ ఈవీవీ సినిమాల్లో బోలెడంత డబుల్ మీనింగులుంటాయ్. ఇప్పుడంటే పట్టించుకోవడం లేదు కానీ..ఈవీవీ ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో ఆయనపై బూతు సినిమాల దర్శకుడిగా ముద్ర వేశారు. పైగా టివి చర్చల్లో మహిళసంఘాలు ఆయనపై డైరక్ట్‌గా ఫేస్ టు ఫేస్‌గానే దుమ్మెత్తి పోసేవి.  ఈవివి కుటుంబ నేపధ్యం కూడా సినిమా బ్యాక్ గ్రవుండ్ ఉన్నదే..ఆయన ఇద్దరు సోదరులు ఇవివిగిరి, ఇ. శ్రీనివాస్ ఇద్దరూ సినేమా స్టిల్ ఫోటోగ్రాఫర్లు..1956 జూన్ పదిన పుట్టిన ఈవీవీ
డిగ్రీ కూడా పూర్తి కాకుండానే చైన్నై రైలెక్కి తన లక్ టెస్ట్ చేసుకున్నారు. తన జిల్లాకే చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నవత కృష్ణంరాజు సాయంతో ఇండస్ట్రీలో కాస్త చోటు దక్కించుకున్నారట. చోటంటే అదేదో భారీ ఆఫర్ అనుకునేరు. ఓ ఇంటి బాగోతం సినిమాకి దేవదాస్ కనకాల డైరక్టర్ గా పని చేయగా..ఆయనకి సహాయకుడిగా పని చేశారు. అది కాస్తా బాల్చీ తన్నేయడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చిందట..అలా పస్తులు పడుతూ ఉండగానే రచయిత, దర్శకుడు జంద్యాలతో పరిచయం కలిగిందట. అలా ఆయనతో 1982లో నాలుగు స్తంభాలాటతో ఏర్పడిన బంధం ఎనిమిదేళ్లపాటు సాగింది. రెండుజళ్లసీత, రెండురెళ్లు ఆరుకి జంధ్యాలకి సహాయదర్శకుడిగా పనిచేయగా..అహ నాపెళ్లంట, మొగుడు పెళ్లాలు. హైహై నాయకా, ఇంద్రుడు చంద్రుడు, తదితర సినిమాలకు రైటర్ గా..అసోసియేట్ డైరక్టర్ గా పని చేశారు. జంధ్యాల శిష్యరికంలోనే డైలాగులు రాయడం, హాస్యం సృష్టించడం తెలిసినా  ఆ తర్వాత మాత్రం తన గురువు పోకడలకు భిన్నంగా వెళ్లడం విశేషం..జంధ్యాల స్కూల్ పూర్తి ఆరోగ్యంగా..గిలిగింతలు పెట్టి..పొట్టచెక్కలయ్యేలా నవ్వు పుట్టించేదైతే..ఇవివిది పూర్తి విరుద్దం. పంచ్ డైలాగులు..డబుల్ మీనింగ్ డైలాగులు.
ఇదే గురుశిష్యుల మధ్య వైరుధ్యం. పాపులారిటీ, ట్రెండ్ సెట్టింగ్‌లో వీరిద్దరూ ఒకరికి ఒకరు తీసిపోరు. 
ఇక అలా అసోసియేట్ డైరక్టర్ గా..అసిస్టెంట్ డైరక్టర్ గా కావాల్సినంత  అనుభవం వచ్చిందీ అని అనుకున్న తర్వాత దర్శకత్వంపై గాలి మళ్లింది ఇవివికి. తన స్క్రిప్ట్ పట్టుకుని ఎన్ని ఆఫీసులు తిరిగినా లాభం లేకపోయింది.కానీ చివరకు రామానాయుడిని సినిమా తీసేందుకు ఒప్పించడంతో 1990లో చెవిలోపువ్వు అనే సినిమా ప్రారంభమైంది..ఈ సినిమా చూస్తే బాగానే ఆడుతుందనుకున్నా అట్టర్ ఫ్లాపైంది..నాయుడుగారి
నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయా అని ఇవివి అప్పుడు మదనపడుతున్న సమయంలోనే ఆయనే పిలచి ధైర్యం చెప్పారని ఇవివి అంటారు. అలా అదే ఏడాది మరో సినిమా వారి కాంబినేషన్లో వచ్చింది. అదే ప్రేమఖైదీ..అందులో హీరో హరీష్..హీరోయిన్ అప్పటిదాకా తెలుగులో వ్యాంప్ క్యారెక్టర్లు..చెల్లెలు క్యారెక్టర్లు వేసి కన్నడానికి వెళ్లిన మాలాశ్రీది హరీష్ ని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే..హరీష్ అప్పటికే తన గురువుగారైన జంధ్యాల తీసిన వివాహభోజనంబు సినిమాలో యంగ్  క్యారెక్టర్ చేసి ఉన్నాడు. లవ్ స్టోరికి ఓ ఫ్రెష్ క్యారెక్టర్ ఉండాలనే ఉద్దేశంతో  అలా హరీష్..మాలాశ్రీని ఎంపిక చేశారు. ఇందులో మంచి పాటలు, జైలర్ గా శారద అభినయం, బ్రహ్మానందం హాస్యం, గోకిన రామారావ్
విలనిజంతో బంపర్ హిట్టైంది. ఇక అప్పట్నుంచీ ఇవివి వెనుదిరిగి చూసుకోలేదు. తన తొలిచిత్రహీరో రాజేంద్రప్రసాద్‌తో అప్పుల అప్పారావు పేరుతో బ్రహ్మాండమైన కామెడీ సినిమా తీసి హిట్ కొట్టారు.తర్వాతి  ఏడాది సీతారత్నంగారి అబ్బాయి, ఆ ఒక్కటి ఆడక్కు హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్ డైరక్టర్ అయిపోయారు. తర్వాత నాగేంద్రబాబుతో తీసిన 420 ఆడకపోయినా నాగార్జునతో వారసుడు తీసి పెద్దహీరోలతో సినిమా తీసి కూడా సక్సెస్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన జంబలకిడిపంబ ఇండస్ట్రీని కుదిపేసిన హిట్..నరేష్‌తో తీసిన ఆ సినిమా దాదాపు 4కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. అలా మొదలుపెట్టిన ఇవివి జైత్రయాత్ర అందరి హీరోలతో సాగింది. శోభన్‌బాబు,కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్, జెడి చక్రవర్తి, కృష్ణంరాజు, ఉపేంద్ర, రాజశేఖర్, శ్రీహరి ఇలా అందరితో దర్శకత్వం వహించిన ఘనత దక్కించుకున్నారు. అలానే తెలుగులో హిట్టైన సూర్యవంశాన్ని అమితాబ్ బచ్చన్‌తో హిందీలో రీమేక్ చేసిన గుర్తింపు కూడా ఇవివి తెచ్చుకున్నాడు. ఇది పద్మాలయా వారు హిందీలో నిర్మించారు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్‌తో సినిమాలు తీసేవారు తక్కువయ్యారు. అలాంటి సమయంలో వచ్చిన ఈ సినిమా ఆయనకి భారీగా హిట్ కాకపోయినా..తెరపై ఊపు తెచ్చింది. అలానే 1995కి ముందు మూడేళ్లు  ఫ్లాపుల ఒరవడిలో ఉన్న చిరంజీవితో అల్లుడా మజాకా తీసి హిట్ ట్రాక్‌పై నిలబెట్టిన ఘనత ఆయనదే..అలానే కృష్ణ 300వ సినిమా తెలుగువీరలేవరాకి కూడా ఆయనే దర్శకుడు జయాపజయాలతో నిమిత్తం లేకుండా..హీరోల నమ్మకం సంపాదించిన ఘనుడు. ఐతే తెలుగువీరలేవరా మాత్రం తనకి సూట్ కాదని తెలిసినా చేశారని చెప్తారు. ఎందుకంటే అప్పట్లోనే బాలకృష్ణతో మాతోపెట్టుకోకు సినిమాకు ఇవివినే దర్శకుడు..కానీ మధ్యలో తప్పుకోవాల్సి వచ్చింది. అలానే ఇప్పుడు కృష్ణ సినిమా ఆఫర్ వద్దంటే తనని పొగరుబోతు అంటారనే ఉద్దేశంతో ఒప్పుకున్నానని ఇవివినే చెప్పారు. మరోవైపు కృష్ణ కూడా ఈ సినిమా పరాజయం ముందే ఊహించానని చెప్పారు
ఇక తన సినిమా సెట్స్ పైనే డైలాగులు రాయించడం ఇవివి స్టైల్..అది కూడా ఒక్కరితో కాకుండా..నలుగురు ఐదుగురు రైటర్స్ సెట్స్ పైనే ఉంది రాసేవారు. అలా ఆయనతొ పనిచేసినవారిలో ఇప్పటి డైరక్టర్ వివి వినాయక్ కూడా ఒకరు. అలా సెట్ పైనే డైలాగులు రాయించడం చాలామందికి నచ్చేది కాదు. కానీ ఇవివి ఉన్న స్టేజ్‌లో ఎవరూ ఆయనకి ఎదురు చెప్పేవారు కాదు. ఐతే తనపై పడ్డ బూతు సినిమాల ముద్రని తొలగించుకునేందుకు ఆమె, చాలాబాగుంది, అమ్మో ఒకటో తారీఖు వంటి సినిమాలు తీశారు. ఆ తర్వాత అలాంటి శషబిషలు పెట్టుకోకుండా తనదైన శైలిలో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ని దింపేశారు. కత్తి కాంతారావ్ ఆయన చివరి సినిమా.. 1990లో సినిమాలు దర్శకత్వం వహించడం మొదలుపెట్టగా 2010లో కెరీర్ ముగిసింది. మొత్తం 51 సినిమాలు దర్శకత్వం వహించారాయన. ఇవివికి ఇద్దరు కొడుకులు రాజేష్, నరేష్..ఇందులో ఆర్యన్ రాజేష్ ని హీరోగా నిలబెట్టలేకపోయానని ఎప్పుడూ బాధపడేవారట. నరేష్‌ క్లిక్ అవడంతో ఆ బాధ కాస్త పూడిందని కూడా చెప్పేవారట. చిన్నవయసులోనే ఆయన మరణించడానికి కారణం క్యాన్సర్..గుట్కాలు నమలడమే త్రోట్ క్యాన్సర్‌కి కారణమని కొంతమంది చెప్తారు 
ఇవివి హాబీల్లో పుస్తకాలు చదవడం ఒకటి..అలానే పాత సినిమాలంటే ఇష్టపడే ఇవివికి ఆవకాయతో పెరుగన్నం అన్నా..వేడి వేడి మిర్చి బజ్జీలన్నా బహు ప్రీతి అని చెప్తారు. ఇవివి సత్యనారాయణ తీసిన సినిమాలు ఆయనకి సక్కెస్ ఇవ్వడంతో పాటు ఎంతో మంది కమెడియన్లకు..ప్రత్యేకించి రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్ కెరీర్‌కి ఎంతో హెల్ప్ అయ్యాయ్. ఎందుకంటే ఓవైపు ఎస్వీ కృష్ణారెడ్డి..మరో వైపు ఇవివి తీసిన సినిమాలే ఈ ముగ్గురి హీరోల జీవితంలో భారీ హిట్లు..వీళ్లు ఫేడౌట్ అయిన తర్వాత ఈ ముగ్గురూ స్లో అవడం గమనించవచ్చు. ఏదెలా ఉన్నా తెలుగు ఇండస్ట్రీలో దర్శకులంలో ఇవివి ముద్ర మాత్రం చెరగనిదనే చెప్పాలి

Comments