ఈ హీరొ కూడా రాముడే..శ్రీరామనవమి రొజున హరనాధ్ తప్పక కన్పిస్తాడు


మనం ఇప్పుడు చెప్పుకునే హీరో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్‌కి కూడా ధీటుగా క్రేజ్ సంపాదించాడని చెప్తారు. అందంలో కానీ అభినయంలో కానీ ఆ ఇద్దరికీ గట్టి పోటీ ఇచ్చాడంటారు. పౌరాణికాల్లో ఎన్టీఆర్‌కి, సాంఘిక చలనచిత్రాల్లో రొమాంటిక్ హీరోగా అక్కినేనికి దడలు పుట్టించారని కూడా ప్రచారం జరిగింది. ఐతే
మధ్యలో ఏమైందో కానీ, సడన్‌గా కెరీర్ అంతా డల్లైపోయి..చివరికి క్యారెక్టర్ యాక్టర్‌గా దిగజారాడంటారు. ఆయనే హరనాధ్..అసలు పేరు బూదరాజు వెంకట అప్పల హర్‌నాధ్ రాజు ఈస్ట్‌గోదావరి జిల్లాలోని రాపర్తి అనే గ్రామంలో 1936 సెప్టెంబర్ 2న పుట్టాడు. పిఠాపురం, గొల్లప్రోలుకి మధ్యలగా ఉన్న ఈ ఊరిలో పుట్టిన హరనాధ్‌కి ఇద్దరు తమ్ముళ్లు ఒక చెల్లెలు. అప్పట్లోనే కాకినాడ పిఆర్ కాలేజీ‌లో డిగ్రీ చదివాడు. సాహిత్యకార్యక్రమాల్లో ఎక్కువగా ఆసక్తి ఉన్న హర్‌నాధ్ డ్రామాల్లో నటించడం ద్వారా తన తృష్ణ తీర్చుకునేవాడట.

 చూడచక్కగా..స్ఫురద్రూపి అయిన హర్‌నాధ్ పైలట్ ట్రైనింగ్ కూడా వెళ్తుండటం విశేషం. అలా ఒక రోజు మద్రాసులోని వాణీమహల్  బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తుండగా, ముక్కామల కృష్ణమూర్తి చూశారట..ఆయన అప్పట్లో కొన్ని సినిమాలకు దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహిరించారు. అలా తన రుష్యశృంగ సినిమాకి హరనాధ్‌నే ఎంపిక చేశారు. ఐతే ఆయన రెండో సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి ముందు విడుదల అయింది. ఇందులో హీరో కృష్ణ, హీరోయిన జమున...జమునకు అన్నగా హరనాధ్ నటించారు..ఈతకోసం అని స్నేహితులతో కలిసి వెళ్లి చనిపోయే పాత్ర అది.  ఐతే విశేషం ఏంటంటే..మొదటి సినిమాలో చెల్లిగా నటించిన జమునతోనే కలిసి చాలా సినిమాల్లో హీరోగా నటించారు హర్ నాధ్.

 లేతవయసులోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన హర్‌నాద్ అక్కినేనికి కొడుకుగా అమరశిల్పి జక్కన్న, ఎన్టీఆర్ పుత్రుడిగా పల్నాటి యుధ్దంలో నటించారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న కథలో ఒక పాటలో గెస్ట్ పాత్రల్లో కన్పించిన కృష్ణ,శోభన్ బాబు, రామకృష్ణతో పాటు హరనాధ్ కూడా మెరిశాడు. ఆ తర్వాత లేతమనసులు, చిట్టి చెల్లెలు, ఆడజన్మ, చల్లనినీడ, మా ఇంటి దేవత, భీష్మ, పాండవ వనవాసం, అభిమన్యు, వంటి అనేక సినిమాల్లో నటించారు. మొత్తం 117 సినిమాల్లో నటించిన హర్‌నాధ్..ఓ దశలో అంటే 1960లలో రొమాంటిక్ హీరోగా విజయయాత్ర సాగించారు. ఆయనంటే ఒకరిద్దరు హీరోయిన్లు కూడా మనసు పడ్డారని ప్రచారం జరిగింది.వారిలో జమున పేరు ప్రస్ఫుటంగా విన్పించేది.






సీతారామకల్యాణంలో స్వయంగా ఎన్టీఆరే రాముడిగా ఆయన్ని ఎంపిక చేశారంటే ముఖవర్చస్సు ఎలాంటిదో తెలుసుకోవచ్చు.


 ఒక అందమైన రాకుమారుడు పాత్ర అయినా..శ్రీకృష్ణుడు పాత్ర అయినా..అర్జునుడైనా..ఎలాంటి పాత్ర అయినా ఎన్టీఆర్, ఏఎన్నార్ కాకపోతే హరనాధ్ నే పిలిచేవారు. ఐతే ఇక్కడే ఓ విషయం చెప్పాలి. సీతారామకల్యాణం షూటింగ్‌లో హరనాధ్ షూట్ గ్యాప్‌లో సెట్లోనే సిగరెట్ కాల్చుతూ ఎన్టీఆర్ కళ్లబడ్డారట. దీంతో అక్కడిక్కకడే ఎన్టీఆర్ ఆయనపై మండిపడ్డారట. పౌరాణిక పాత్రలు చేస్తూ ఇలాంటి వేషాలేంటని కేకలు వేశారట. దీంతో పాటు హరనాధ్‌కి మద్యం తాగే అలవాటు విపరీతంగా ఉండేదట.
నటుడు ఎస్వీ రంగారావ్ ఈయన కలిసి రాత్రులకు రాత్రులు ఇలా మందుకొడుతూ ఉండేవారట. ఎస్వీ రంగారావ్ స్వయంగా తాను దుర్యోధనుడిగా..హరనాధ్ కృష్ణుడిగా -రారాజు-అనే సినిమా నిర్మించాలని అనుకున్నారట. కానీ దురలవాట్లతో ఇద్దరూ పాడైపోయారు.  ఐతే దీనికి కారణం కూడా ఆనాటి అగ్రనటులే అని హరనాధ్ ఫ్యాన్స్ చెప్తుంటారు. కావాలని ఆయనకు పార్టీల నెపంతో మందు తాగించడం, ఆ తర్వాత సినిమాలకు లేట్‌గా వెళ్లేలా చేయడం చేసేవారట. దీంతో శరీరంపై అదుపు తప్పి మొహంలో కళా కాంతులు తగ్గిపోయాయ్. ఎవరైతే ఆయనకి దుర్వ్యసనాలు ఎక్కువ చేసారో వాళ్లే ఆయనకి సినిమాలు తగ్గకపోయినా..లేని ప్రేమ నటించి తమ సినిమాల్లో అప్రాధాన్య పాత్రలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో హరనాధ్ ఇక హీరో పాత్రలు చేయడట అనే పుకార్లు పుట్టించి ఆటోమేటిగ్గా క్యారెక్టర్ యాక్టర్‌గా టర్న్ అయ్యే పరిస్థితి కల్పించారు. ఒకసారి వారి లక్ష్యం నెరవేరాక ఇక హరనాధ్ సంగతే పట్టించుకోలేదట. దీంతో చివరికి రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న హరనాధ్ చివరికి ఐదారు నిమిషాలు కన్పించే పాత్రలు కూడా చేయాల్సి వచ్చింది. చివరిగా గుర్తున్నంత వరకూ హరనాధ్ గడసరి అత్త సొగసరి అల్లుడు అనే కృష్ణ సినిమాలో ఆయన అన్నగా నటించారు.


1984లో చిరంజీవి నాగులో చిన్న పాత్రతో తెరమరుగు కాగా... 1989లో కనుమరుగు అయ్యాడు. హరనాధ్‌కి శ్రీనివాసరాజు అనే ఒక కొడుకు ఉన్నాడు..ఈయన కొన్ని సినిమాల్లో టీవి సీరియల్స్‌లో నటించాడు. పవన్ కల్యాణ్ తో గోకులంలో సీత నిర్మాతగా ఈయన పేరే ఉంది..ఇక హరనాధ్ అల్లుడు జివిజి రాజు ప్రభాస్‌తో రాఘవేంద్ర, పవన్ కల్యాణ్‌తో తొలిప్రేమ నిర్మించాడు. బ్యాక్ గ్రౌండ్ పరంగా ఇబ్బందులు లేకపోయినా..ఎంతో భవిష్యత్తు ఉన్నా..కెరీర్‌ని పట్టించుకోకుండా దుర్ వ్యసనాలకు బానిస అవడంతో 53ఏళ్లకే హర్‌నాధ్ కన్నుమూయడమే విషాదం. 

Comments