మనోహర్ పారికర్‌కి ఏమైంది..?


గోవా సిఎం, మాజీ రక్షణశాఖామంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంది..ఇంతకీ ఆయనకి ఏమైంది..ఎందుకు సడన్‌గా ఇలా అనారోగ్యం పాలయ్యారనే సందేహాలు తలెత్తుతున్నాయ్. ఎందుకంటే మామూలు రాజకీయనేతగా కాకుండా..మనోహర్ పారికర్ ఎప్పుడూ హెల్దీగా ఫిట్‌గా కన్పిస్తుండేవారు. ప్రస్తుతానికి ఆయన పాంక్రియాస్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని తెలుస్తోంది.
అలాంటిది ఆయన గత నెల అంటే..ఫిబ్రవరి 15న ముంబై లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఫిబ్రవరి 22న డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలోనే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారా లేదా అనే సందేహాలకు తెరదించుతూ అసెంబ్లీ సెషన్స్ కి హాజరయ్యారు. కానీ ఆ నాలుగు రోజుల అసెంబ్లీ సెషన్స్ ఆయన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీశాయంటారు. ఆ సెషన్స్ పూర్తి కాగానే గోవాలోని మెడికల్ కాలేజ్ హాస్పటల్‌లో జాయినయ్యారు..శరీరంలోని నీరు ఆవిరైపోవడంతో ఆయన అనారోగ్యం తిరగబెట్టింది. అక్కడ ట్రీట్‌మెంట్ అయిన తర్వాత మార్చి 1న డిశ్చార్జ్ అయినా...పరిస్థితిలో మార్పు రాలేదు..తిరిగి మార్చి 6న లీలావతి ఆస్పత్రిలో చెకప్ చేయించుకోగా..మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లాల్సిందేనంటూ వైద్యులు తేల్చేశారు. ఈ దశలోనే మనోహర్ పారికర్ తన విధులను కేబినెట్ అడ్వైజరీ కమిటీకి అప్పగిస్తూ..గోవా గవర్నర్‌కి లేఖ రాశారు.  దాంతో పాటే తన ఆరోగ్యం కోసం పూజలు చేయాలని ఫాలోయర్లు ట్వీట్ చేశారు. మీరు చేసిన పూజల వలనే నా ఆరోగ్యం మెరుగుపడింది...ఇప్పుడు పూర్తిగా కోలుకోవాలంటే మళ్లీ మీరు పూజలు చేయాలని ఆ ట్వీట్ సారాంశం. వీలైతే విదేశాలనుంచే రాష్ట్రమంత్రివర్గం తాలుకూ సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు అవుతానని కూడా మనోహర్ పారికర్ చెప్పడం గమనార్హం. ఇక ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే..అకస్మాత్తుగా ఏడాది క్రితమే ఆయన్ని కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించి..గోవాకి ముఖ్యమంత్రిగా తిరిగి పంపారు కేంద్రమంత్రిగా కాకముందు  కూడా ఆయన గోవాకే సిఎంగా చేసేవారు. 62ఏళ్ల మనోహర్ పారికర్ 1978లో ఐఐటి బాంబేలో మెటలర్జీలో ఇంజనీరింగ్ చేసిన ప్రతిభాశాలి. చిన్నవయస్సులోనే ఆర్ఎస్ఎస్‌లో చిన్నవయస్సులోనే ముఖ్య శిక్షక్ స్థాయికి చేరారు.1994లోనే ఎమ్మెల్యేగా ఎంపికైన పారికర్..1999లో గోవా ప్రతిపక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000లో గోవా సిఎంగా ప్రమాణస్వీకారం చేశారు.ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఎంపిగా..ఆ తర్వాత కేంద్ర రక్షణశాఖామంత్రిగా ఎదిగారు..ఐతే అంతే త్వరగా ఆయన తిరిగి రాష్ట్రరాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. మూడేళ్లపాటు కేంద్రమంత్రిగా పని చేసిన సమయంలో పారదర్శకతతో కూడిన సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు మనోహర్ పారికర్. ఈయన హయాంలోనే అగస్టా వెస్ట్ లాండ్ స్కామ్‌ని వెలికితీయడం జరిగింది. వివాదాల విషయానికి వస్తే..పదిహేడేళ్ల క్రితమే గోవాలో సంఘ్ పరివార్ భావజాలంతో విద్యావ్యవస్థని నింపేయాలని చూసారని విమర్శలున్నాయ్. 2013లో తన పార్టీకి చెందిన 37మందిని యూరప్‌లో పరిశుభ్రతా విధానాలను పరిశీలించేందుకు  ప్రభుత్వఖర్చులతో పంపించారు.  అలానే 2014 ఫుట్ బాల్ వరల్డ్ కప్‌కి ఆరుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వఖర్చులతో టూర్ కి పంపించారు. ఇక ఆయన జీవితంలో అన్నిటికన్నా
పెద్ద విమర్శ..2016లోఅమీర్ ఖాన్ దేశంలో అసహనం పెరిగిపోయిందని కామెంట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలా మాట్లాడేవాళ్లకి జీవితాంతం గుర్తుండే పాఠం చెప్పాలంటూ పిలుపు ఇచ్చారు..ఇదే చాలామంది విమర్శలకు గురైంది. అలానే పాకిస్తాన్ కి వెళ్లడమంటే నరకానికి వెళ్లడమే..అంటూ చేసిన కామెంట్ కూడా వివాదాలకు తావిచ్చింది. 

Comments