బిజెపితో టిడిపికి ఎక్కడ చెడింది..దీనికి మూలం ఏంటో తెలుసా..?


భారతీయజనతాపార్టీతో టిడిపికి ఎక్కడ చెడిందనే విషయం ఇప్పుడు ఆసక్తి కలిగించకమానదు. 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోడి, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ఈ ముగ్గురూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. వీరికి తోడు వెంకయ్యనాయుడు ఉండనే ఉన్నాడు..అసలు మోడీ ఓ దైవదూత అని వెంకయ్యనాయుడు భజన చేయడం..వెంకయ్యజీ లేకపోతే ఏపీ అనాధ అయిపోయేది అని మోడీ చిడతలు వాయించడం గుర్తుండే ఉంటుంది..పనిలోపనిగా చంద్రబాబులాంటి వ్యక్తిని గెలిపిస్తే..ఏపీకి ఢిల్లీని మించిన రాజధాని కట్టుకోవచ్చుంటూ డబ్బా వాయించడం చూసినవాళ్లకి మూడేళ్లు తిరిగేసరికి ఎందుకు ఇలా ఉప్పూ నిప్పూ అయ్యారు అనే సందేహం రాకమానదు. ఎందుకంటే ఏపి సిఎంగా కానీ..టిడిపి అధ్యక్షుడిగా కానీ..చంద్రబాబునాయుడు ఎక్కడా మోడీ పరివారంపై విమర్శలు చేయలేదు. పైగా ఆయనే అమరావతి శంకుస్థాపన సమయంలో మోడీకి ఇబ్బంది రాకుండా..స్పెషల్ ప్యాకేజీ కావాలని అడిగారు..దీనికి రుజువులు కూడా ఉన్నాయ్..ఆ తర్వాతి రోజు నేను స్పెషల్ స్టేటస్ అనబోయి..స్పెషల్ ప్యాకేజీ అన్నాను..రెండిటికీ తేడా లేదు అని కవర్ చేసుకోబోయారు కూడా.. ఇక హోదా ఇవ్వడమేది సాధ్యం కాదు అని బిజెపి నేతలు తెగేసి చెప్పిన సందర్భాలలో తాను కూడా "ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి..హోదాతో వచ్చే లాభమేంటో ముందు నాకు చెప్పండి" అంటూ అడ్డంగా ఎదురు తిరిగారు కూడా.. అంటే దాదాపుగా బిజెపినేతలు కానీ..కేంద్రమంత్రులు కానీ ఏరకమైన సమాధానాలు ఇస్తే దానికి అనుగుణంగా తన వైఖరిని మార్చుకున్నారు. ఐనా కూడా మరి ఎందుకు బిజెపి టిడిపికి పొగబెట్టింది అనే సందేహం రాకమానదు..దీనికి ఆన్సర్ కావాలంటే 
దాదాపు ఒక సంవత్సరం వెనక్కి వెళ్లాలి..అది మే 12, 2017.. జగన్ తన ఎంపీలతో కలిసి ప్రధానమంత్రి మోడీని కలిసి వచ్చారు..అప్పటికే చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మోడీని కలిసి ఏడాది దాటిపోయింది..అప్పాయింట్ మెంట్లు ఇవ్వడం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది అప్పట్లో..అలాంటి సమయంలో జగన్‌తో మోడీ సమావేశం కావడం టిడిపి నేతలకు చిరాకు పుట్టించింది. దీంతో డొక్కశుధ్ది లేని టిడిపి నేతలు కొందరు అసలు మోడీకి బుద్ది ఉందా..కేసులున్న జగన్‌ని కలవడం ఏంటి..ఇది తప్పు..ఏమనుకుంటున్నారు ఆయన..అనే రేంజ్‌లో ప్రేలాపించారు. ఐతే ఓ ప్రతిపక్షనేత ప్రధానిని కలిస్తే తప్పేంటి..ఎవరొచ్చినా కలవడం అన్నది సంప్రదాయమే అని అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సర్దిచెప్పబోయారు. ఐనా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. 
మరోవైపు రాష్ట్రంలో పోలవరం పనులని కట్టబెట్టిన కాంట్రాక్ట్ వైఖరి కూడా బిజెపి-టిడిపి సంబంధాలను దెబ్బతీసింది. మేం నిధులు విడుదల
చేస్తుంటే, మీ పెత్తనం ఏంటనే ప్రశ్నలూ వేశారు. ఇక్కడే బిజెపికి చెందిన వీర్రాజనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఏకంగా చంద్రబాబునే టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం మొదలైంది. దీనికి మాజీ కేంద్రమంత్రి పురంధీశ్వరి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయ్. అటు రాష్ట్రంలోనూ టిడిపి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో జగన్ మోహన్ రెడ్డి బలం పెరుగుతుందని సర్వేలు చెప్పాయంటారు. దీంతో ఈ అగాధం అలా అలా పెరుగుతూ పోయింది. దీనికి పీక్ స్టేజ్‌కి తీసుకువెళ్లింది పాదయాత్రలో జగన్ ప్రకటన. ప్రత్యేకహోదా ఇస్తే...బిజెపితో కలిసి పనిచేయడానికి 
అభ్యంతరం లేదని ఆయన చెప్పడంతో ఇక ఈ రెండు పార్టీల మధ్య ఇన్ డైరక్ట్ వార్ కాస్తా...డైరక్ట్ వార్ గా మారింది. మీరేం ఇచ్చారు అని టిడిపి అంటే..మీరేం ఖర్చుపెట్టారని బిజెపి నేతలు వాదులాడుకోవడం ప్రారంభమైంది..చివరికి అలా రెండు పార్టీల పొలిటికల్ మైలేజీ కోసం చేస్తోన్న పోరు విడాకులకు దారి తీసింది.ఇక ఇప్పుడు ఎవరి వాదన నెగ్గుతుందన్నది 2019లో తేలనుంది

Comments