తడబాటా..పొరపాటా..ఒంటిమిట్టకు ప్రాశస్త్యం అద్దే తాపత్రయమా


తెలుగువారికి పురాణ గ్రంధాలంటే రామాయణం, భాగవతం, భారతం..వీటిలో జయం అనే పేరుతో మహాభారతాన్ని
వేదవ్యాసుడు రచించగా..భాగవతాన్ని బమ్మెర పోతన, రామాయణాన్ని ఆదికావ్యంగా వాల్మీకి గ్రంథస్తం చేసారని ప్రతీతి. ఇదే నిజం కూడా అనడానికి కొన్ని ఆధారాలు చూపిస్తారు కూడా..ఐతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం అలవోకగా ఈ వరస మార్చేశారు. అది కూడా సీతారామ కల్యాణం రోజునే. కడప జిల్లాలోని ఒంటిమిట్ట ప్రాశస్త్యం గురించి వివరిస్తూ..ఇక్కడే బమ్మెర పోతన రామాయణాన్ని రచించిన సంగతి
గుర్తుంచుకోవాలంటూ ప్రసంగించారు. ఆయన ఆ ప్రసంగం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఎవరూ ఇది గుర్తించలేదు. సరికదా మా ముఖ్యమంత్రికెంత జ్ఞానమో అన్నట్లు పరవశంగా చూస్తుండిపోయారు. బాలాజీ బంటుగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ పుణ్యకార్యం జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యే...డాలర్ శేషాద్రీ అక్కడే  ఉన్నారు..చంద్రబాబు మాట తడబడో..గుర్తుకురాకనో..లేదంటే ఫ్లోలోనో..తప్పుగా చెప్పినా..పట్టించుకోలేదాయన. ఇక చంద్రబాబు పక్కనే ఆయన భార్య భువనేశ్వరి ఉన్నా..ఆమెదీ డిటో ఎక్స్ ప్రెషన్..చిరునవ్వు చిందిస్తూ కన్పించారు. చంద్రబాబు వెనుకగా..ఈ మధ్యనే రాజ్యసభకి రెండోసారి నామినేట్ అయిన సిఎం రమేష్ ఉన్నాడంటే ఆయన ప్రత్యర్ధి పార్టీల ఎంపీలపై ఒంటికాలిపై లేస్తాడే తప్ప ఇలాంటివి పట్టించుకోడనుకోవాలి. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా చంద్రబాబుకి సమీపంగా ఉన్నా..తప్పు సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. నెల్లూరు జిల్లాకి చెందిన మరో మంత్రి సోమిరెడ్డి అయితే ఇవేం నాకు పట్టవబ్బా అన్నట్లు ఎటో చూస్తుండిపోయారు. ఇదంతా చూసిన తర్వాత చంద్రబాబు ఒంటిమిట్ట ప్రాశస్త్యం పెంచే ప్రయత్నం చేశారు తప్ప..నిజంగా ఉద్దేశపూర్వకంగా తప్పు చెప్పారని అనుకోలేం. ఎందుకంటే ఆయన హైటెక్ సిఎం మరి..

నిజానికి ఒంటిమిట్టపైనే కొన్ని రోజులు నివాసముండి బమ్మెర పోతన భాగవతాన్ని రచించారని అక్కడి వారు నమ్ముతుంటారు. ఇదే విషయంపై గత ముఖ్యమంత్రి వైఎస్ చాలా సందర్భాల్లో ఏకశిలానగరం అంటే ఒంటిమిట్ట అని.. పోతన ఇక్కడి వారే అని నొక్కి వక్కాణించే ప్రయత్నం చేశారు..ఐతే దాన్ని కేసీఆర్ మాత్రం ఒప్పుకోకుండా..ఏకశిలానగరం అంటే ఓరుగల్లు అని చెప్పుకునేవారు. ఐతే తాజాగా చంద్రబాబు పొరపాటుతో మరోసారి ఒంటిమిట్ట-పోతన అంశం వార్తల్లో విషయంగా మారిందనుకోవచ్చు

Comments