లైంగికహింస సినిమాల్లోనే కాదు..అన్ని చోట్లా గళం విప్పిన పూనం కౌర్, నివేదా


తెలుగు చిత్రపరిశ్రమలో వేషం కోసం పడక సుఖంపై రగడ జరుగుతున్న వేళ ఇతర భాషల నటులు కూడా స్పందిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో చోటు చేసుకున్న అత్యాచారాలు ఈ పరిణామాలపై మరింత చర్చకు దారితీస్తున్నాయ్. కాశ్మీర్ లో జరిగిన దారుణం, ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యే చేసిన రేప్ వంటి ఉదంతాలు ప్రస్తుతం దేశాన్నికుదిపి వేస్తున్నాయ్. 

తమిళ నటి నివేదా పేతురాజ్ తనకీ ఇలాంటి అనుభవం ఎదురైనట్లు చెప్పింది. ఒక్క సినిమా ఫీల్డ్ అనే కాదు సమాజంలో అమ్మాయిగా పుట్టడమే పాపం అన్నట్లుగా సంఘటనలు జరుగుతుంటాయ్. నా చిన్నప్పుడు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు లైంగికంగా వేధించారని వాపోయింది. అసలు తనపట్ల  ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో..దానిపై ఎవరికి ఎలా వివరించాలో కూడా తెలీని వయసదని ఆవేదనగా చెప్పింది. సమాజంలో ఇలాంటి కామాంధులతో జాగ్రత్తగా ఉండాలని పసిపాపలనుంచి వృధ్దుల వరకూ ఎవరినీ వదలరని ఇది ఆడవారికి ఓ శాపంలాంటిదని కన్నీరు పెట్టింది. పురుషులంతా అలాంటివారు కాకపోయినా..అజాగ్రత్తగా ఉంటే మాత్రం బాధలు పడాల్సి వస్తుందని హెచ్చరించిందామె.

 నివేదా పేతురాజ్ బాధ అలా ఉంటే..తాము ఎదుర్కొన్న అనుభవాలపై బైటికి వచ్చి మాట్లాడేవారిని చులకనగా చూడొద్దని చెప్పింది పూనమ్ కౌర్. తనపైనా వేధింపులు చోటు చేసుకున్నాయని..అలాగని తానేం వీక్ మైండెడ్ కాదని అంటోంది పూనమ్ కౌర్. ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరిస్తానే తప్ప నిస్సహాయంగా చూస్తూ ఉండిపోనని ఇన్ డైరక్ట్ కామెంట్స్ చేసింది పూనమ్. శ్రీలేఖారెడ్డికి మద్దతుగానే పూనమ్ కౌర్ ఇలా మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలుగు పరిశ్రమలో ఎవరు ఎలాంటి వారో అందరికీ తెలిసినా ఇన్నాళ్లూ నోరు విప్పలేదని..ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆమె ఓ దుమ్మురేపే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. శ్రీలేఖారెడ్డికి ఎంత భాద కలిగితే అలా బైటికి వచ్చి మాట్లాడుతుందో అర్ధం చేసుకోవాలని లేకపోతే సైలెంట్ గా ఉండాలని సూచించింది. అంతేకానీ ఎవరిష్టం వచ్చినట్లు కామెంట్లు చేయవద్దని కూడా విజ్ఞప్తి చేసింది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ స్పందన అనూహ్యం కావడంతో కొన్ని రోజుల్లో కొన్ని సెన్సేషనల్ విషయాలు బైటికి వస్తాయని టాక్ నడుస్తోంది

Comments