అరే..ఆవో సల్మాన్ జైలు గది పిలుస్తోంది..రా..!


సల్మాన్ ఖాన్ ని దోషిగా తేల్చుతూ జోధ్ పూర్ కోర్టు శిక్ష విధించడం హిందీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నా..చేసిన తప్పు ఎన్నాళ్లైనా వెంటాడుతుందనేది రుజువు అయింది.దీనిపై సుప్రీంకోర్టులో ఊరట దక్కొచ్చు దక్కకపోవచ్చు కానీ ..శిక్ష కత్తి మాత్రం సల్మాన్ పై ఇరవైఏళ్లుగా వేలాడుతూనే ఉంది. ఇది ఒక రకంగా మానసిక హింసే..అయితే సల్మాన్ పై ఉన్న తీవ్రమైన కేసుల్లో ఇది రెండోది. గతంలో మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి బాంద్రా ఏరియాలో ఒకరి మరణానికి కారణమయ్యాడు. సెప్టెంబర్ 28, 2002న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో సల్మాన్ ఖాన్ ని దోషిగా ఒకసారి..సాక్ష్యాలు లేవని  ఒకసారి కోర్టులు తీర్పులు ఇచ్చాయి. ఆ సంఘటనలో నలుగురు గాయాల పాలు కాగా..ఒకరు చనిపోయారు. ముంబై సెషన్స్ కోర్టు ఈ హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ని దోషిగా తేల్చగా..బాంబే హైకోర్టు సాక్ష్యాలు లేవంటూ వదిలేసింది. అంతేకానీ నిర్దోషి అని మాత్రం చెప్పలేదు.. ఈ కేసులో బెయిల్ పై సినిమాలు చేసుకుంటున్న సల్మాన్ కి తాజా తీర్పు శరాఘాతమే. ఎందుకంటే ఇప్పటికే అతగాడికి 53 ఏళ్లు..ఇంకో రెండేళ్లు శిక్ష పడినా...బైటికి వచ్చేసరికి 55 ఏళ్లు వస్తాయి..అందుకే ఇతగాడితో సినిమాలు తీస్తోన్న నిర్మాతలు ఈ తీర్పుపై అప్పీల్ కి వెళ్లేందుకు సిధ్దం అవుతున్నారు. ఓ వేళ ఈ తీర్పుల నుంచి సల్మాన్ బైటపడినా, శిక్ష నుంచి తప్పించుకోకపోవచ్చు..అదెలానో తెలియాలంటే ముందు  ఈ కేసు గురించి పూర్తిగా తెలుసుకోవాలి..

1998 కాలానికి వెళ్లాలి..హమ్ ఆప్ కే హై కౌన్..సినిమా సూపర్ సక్సెస్ తర్వాత సూరజ్ చంద్ బర్జాత్యా తీస్తోన్న మూవీ హమ్ సాత్ సాత్ హై..ఇందులో భారీ తారాగణంతో ఉదయ్ పూర్ , జోథ్ పూర్ కోటల వద్ద షూటింగ్ జరుగుతుండేది..ఆ సమయంలో షూటింగ్ గ్యాప్‌లో ఈ కండలహీరో పెద్ద మొనగాడిలాగా..వేట తుపాకీలను భుజాన వేసుకుని జీపులో ఊరేగింపుగా తిరిగేవాడు..ఆ సందర్భాల్లోనే ఇతర నటులు, నీలం, సోనాలి బెంద్రే, సైఫ్ ఆలీ ఖాన్, టబూని వెంటేసుకుని జోథ్ పూర్ అడవుల్లోకి షికారుకి వెళ్లాడు..కన్పించిన జింకలను చూసి ఎంజాయ్ చేయకుండా...తన హీరోయిజం ప్రదర్శించేందుకు తుపాకీ తీసి కాల్చడం ప్రారంభించాడు. అలా కొన్ని జింకలు చనిపోయాయ్. కొన్ని గాయపడ్డాయి. అవి మామూలు జింకలు కాదు..ఇలా ఎందుకంటున్నామంటే ఇవి ప్రపంచంలో ఇంకే ఏరియాలో ఇవి కన్పించవు..కేవలం మన ఉపఖండం నేపాల్, పాకిస్తాన్ లో మాత్రమే కన్పిస్తాయ్.  అంతరించిపోతోన్న అరుదైన జాతిగా ఈ కృష్ణజింకలను గుర్తించారు.  పైగా జోథ్ పూర్ అడవుల్లో ఉండే బిష్ణోయ్ జాతి వారు వీటిని తమ కులదేవతలుగా పూజిస్తారు పర్యావరణం కోసం చెట్లను కూడా కౌగలించుకునే తత్వం ఈ తెగవారిది. చెట్లను కొట్టే ప్రయత్నం చేసినా..వాటిని వాటేసుకుని రోజులు తరబడి నిరసన చేయగలరు..ఇంతకు ముందు చేశారు కూడా..అలాంటి బిష్ణోయ్ తెగ ఇలా కృష్ణజింకలను సల్మాన్ ఖాన్ వేటాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..వారి తెగకే చెందిన లారెన్స్ బిష్ణోయ్ అనే వ్యక్తి సల్మాన్‌ని ఏ రోజుకైనా నేనే చంపుతా అంటూ శపధం చేశాడు..ఇతగాడి బ్యాక్ గ్రౌండ్ సామాన్యమైనది కాదు..జోథ్ పూర్ గ్యాంగ్ స్టర్ ఇతను..పంజాబ్ హర్యానా బెల్ట్‌లో 20కి పైగా మర్డర్ కేసులున్నాయి ఇతగాడిపై..కోర్టులు శిక్షలు వేయకపోయినా..నేను మాత్రం అతన్ని చంపుతా..అప్పుడే మా బిష్ణోయ్ తెగ అంటే ఏంటో సల్మాన్‌కి తెలిసి వస్తుందంటూ శపధం చేశాడు కూడా...ఇక  ఈ పగ ప్రతీకారం ఎపిసోడ్ పక్కనబెడితే..కోర్టు తీర్పు తర్వాత సల్మాన్ ఖాన్ కోసం జోథ్ పూర్ జైలు సిబ్బంది ..సెల్ సిధ్దం చేశారు. నీట్ గా శుభ్రం చేశారు కానీ..ఇందులో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండవని..ఏసీ సంగతి వదిలేయండి, ఈ గదిలో .కనీసం ఫ్యాన్ కూడా ఉండదని సూపర్నెంట్ చెప్పడం విశేషం..దీంతో సల్మాన్ కి ఈ సమ్మర్ల‌ో చుక్కలు కనపడొచ్చని టాక్..గతంలో ఇలానే అక్రమఆయుధాల కేసులో సల్మాన్‌కి శిక్ష పడితే..జైలుగదిలోని ఖైదీలు మనోడిని తెగ హెరాస్ చేశారట. సాజన్, మైనే ప్యార్ కియాలోని పాటలు పాడుతూ రాత్రంతా నిద్ర లేకుండా చేశారట..మళ్లీ ఇప్పుడు శిక్ష పడటంతో నిర్మాతల బెంగతో పాటు సల్మాన్ పాత అనుభవాలు గుర్తు చేసుకుంటుండొచ్చు

Comments

  1. ఈ కేసు మరొక దీర్ఘసూత్రం వెంబడి పరుగెత్తి పరుగెత్తి... మరో పాతికేళ్ళకు మన సుప్రీంకోర్టు వారి తీర్పు దగ్గరకు వస్తుంది.

    అప్పుడు సాక్ష్యాధారాలు లేవనో ఉన్నవి సరిపోవనో ప్రస్తుతం లేదా తుదివిచారణ నాటికి మిగిలిన సాక్ష్యాలు నమ్మదగ్గవిగా కనిపించటం లేదనో ఒక ముక్క అనేసి, ఎంతో మహానుభావుడైన సల్మాన్ ఖాన్ గారిని నిష్కారణంగా ఇన్నాళ్ళూ ఇబ్బందులకు గురిచేసినందుకు పోలీసుశాఖవారిని ముక్కచీవాట్లు వేసి ఆయన్ను అత్యంతసగౌరవంగా విడుదల చేస్తారు.

    తప్పీజారీ ఆయన్ను ఏదో కొద్దో గొప్పగా శిక్షించక తప్పదని నిశ్చయించిన అరుదైన పక్షంలో -- అయన ఇన్నాళ్ళుగా అనుభవించిన క్షోభనూ వగైరానూ దృష్టిలో ఉంచుకొని -- ఇప్పటికే ఆయనకు పడిన శిక్ష ఎక్కువ అనీ అందుకని ఇంక ఏశిక్ష్హా అవసరం లేదనీ అందుచేత వేంఠనే విడుదల చేస్తున్నామనీ నొక్కి వక్కాణించి మరీ సబహుమానంగా పంపిస్తారు.

    చూస్తూ ఉండండి.

    ReplyDelete

Post a Comment