రెడ్ స్టార్...మాదల రంగారావు ఇక చరిత్రే


మాదల రంగారావ్..విన్పించి కన్పించి చాలా రోజులే అయింది. పోయిన వారమే ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రిలో చేర్పించారని తెలిసిన తర్వాతే ఒక్కసారిగా ఆయన పాత సినిమాలు..వాటి గురించిన చర్చ కాస్త ప్రారంభమైంది. నిన్న చనిపోయాడని తెలీగానే..ఆయన గొప్పదనం గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. 1980 నుంచి పదేళ్లపాటు ఒక ఊపు ఊపిన రంగారావ్ ఆ తర్వాత కన్పించడం మానేశాడు. హఠాత్తుగా 1995లో  ఎర్రసూర్యుడనే తన మార్క్ సినిమా ఒకదానితో తెరపై ప్రత్యక్షమైనా ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే తెలుగు సినిమాల్లో హీరోయిజమే తప్ప ఇక ఏ ఇజం పని చేయని రోజులొచ్చాయ్. ఇప్పుడంటే కాస్త కథల్లో వాస్తవికత, పరిశీలనాత్మక సినిమాలు వస్తున్నాయి కానీ..1991-2011 వరకూ వచ్చినవన్నీ రాశిపరంగానే కానీ..వాసి పరంగా గొప్పగా ఉన్న సినిమాలు ఏ పదో పాతికో ఉంటాయ్.
coming back 

చిన్న చిన్న క్యారెక్టర్లతో కెరీర్ నిర్మించుకుంటూ వచ్చినా..పెద్ద క్యారెక్టర్లు రాని బ్యాచ్ ఒకటుంది. ఆ బ్యాచ్‌లో నారాయణమూర్తి, శివకృష్ణ, నరసింహరాజు, మాదల రంగారావు వారిలో కొంతమంది. వీళ్లందరికీ చెప్పలేనంత తపన, కసి..తమని తాము ప్రూవ్ చేసుకోవాలనే ఆరాటం. కానీ వాళ్లతో హీరోలుగా పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు రాలేదు. అప్పుడే వీరిలో మధనం ప్రారంభమై..పెద్ద హీరోలు టచ్ చేయని..తమకి కలిసి వచ్చే తమ క్యారెక్టర్లకు దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకున్నారు. వాటిలో ఇంకొకరు వేలు పెట్టలేని విధంగా కథలు తయారు చేసుకుని నిర్మాతలుగా హిట్లు కొట్టారు. తమ కెరీర్‌నీ నిర్మించుకున్నారు.




అలా మాదాల రంగారావు సంగతే చూస్తే..ఎర్రమల్లెలు, విప్లవశంఖం, మరో ప్రపంచం, ప్రజాశక్తి, యువతరం కదిలింది, తొలిపొద్దు, ఎర్రపావురాలు ఇలా డజను సినిమాల వరకూ అప్పటి రాడికల్ యూత్‌ని ఊపేశాయ్. ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లోనే రెడ్ స్టార్ గా బతికానని చెప్తాడు. రెడ్ షర్ట్ వేసుకుని వెళ్తే ఆ రోజు ఏదోక గొడవ ఉన్నట్లని చెప్పుకునేవారని స్వయంగా మాదలే చెప్తారు. ఎన్టీఆర్ రాజకీయరంగంలోకి దూకాక సినిమాల పరంగా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అలా చేసిన వారిలో కృష్ణది అగ్రస్థానమమైతే, తర్వాతి స్థానం మాదల రంగారావుదే..సూటిగా సుత్తి పెట్టి కొట్టినట్లు ఉండే డైలాగులతో పాలకపక్షంపై విమర్శలు ఉండేవి ఆయన సినిమాల్లో..దీంతో కమ్యూనిస్టు పార్టీలకు రెడ్ స్టార్ అండగా నిలబడినట్లైంది. తన సినిమాల కలెక్షన్లను సిపిఎంకే పంచేవాడంటే మాదల రంగారావు నిబద్దత అర్ధం చేసుకోవచ్చు. ఓ రకంగా ఇదే అలవాటు నారాయణమూర్తి విషయంలో కూడా చూడొచ్చు. మాదల రంగారావ్ కి ఉన్న క్రేజ్‌కి ఎక్కడ నిలబడ్డా ఎమ్మెల్యేగా, ఎంపిగా గెలిచేవాడు. కానీ ఎందుకో ఆ వైపు మాత్రం ఈయన దృష్టి పడలేదు.  మాదల రంగారావు కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చినా..సక్సెస్ కాలేదు. నేనుసైతం అనేది ఆ సినిమా పేరు. ఆ తర్వాత రూటు మార్చి దేవీ మహత్యం పేరుతో ఇంకో సినిమాలో నటించి చేతులు కాల్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వాటివైపు చూడలేదు. ఓ సాధారణమైన రామారావు, నాగేశ్వర్రావు, కాంతారావు, తర్వాత పూర్తి పేరుతో హీరో అయి ఇప్పటికీ అదే పేరుతో పాపులర్ అయిన గొప్పదనం మాదల రంగారావు సొంతం. ఎక్కడ ప్రసంగించినా చివరిగా ఓ నినాదంతో ముగించేవారు  అదే..లాల్ సలామ్ 

Comments