అర్జున్ ఫిట్‌నెస్‌తో పాటు ఇతర విశేషాలూ చూడండి


అతని పేరు వింటే చాలు..వెంటనే గుర్తొచ్చేది ఫైట్లే..వయసు చెప్పినా అంత ఉండదని అనేంత ఫిట్‌నెస్ ఆయనది..అర్జున్ పుట్టింది కన్నడనాట మధుగిరిలో..పేరు తెచ్చుకుంది తెలుగు సినిమాలతో..స్టార్ కమ్ యాక్టర్‌గా సెటిలైంది మాత్రం మద్రాస్‌లో..1962 ఆగస్ట్ 15న పుట్టిన అర్జున్ పూర్తి పేరు అశోక్ బాబు అర్జున్ కి ఇంకో పేరు కూడా ఉంది శ్రీనివాస్ సర్జా. తండ్రి శక్తిప్రసాద్ కూడా కన్నడంలో మంచి పేరున్న నటుడట. తల్లి లక్ష్మి ఓ ఆర్ట్ టీచర్..ఈ కుటుంబంలో పుట్టిన అర్జున్ సినిమారంగంలో 1981లో ఎంట్రీ ఇచ్చాడు. అంటే 19వ ఏట..సింహదమరి సైన్య పేరుతో వచ్చిన ఈ సినిమాలో అర్జున్ చేసిన కరాటే విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయ్. ఇందులోనే
అర్జున్ 500 అడుగుల ఎత్తున హెలికాప్టర్‌ని పట్టుకుని వేలాడే సీన్ హైలైట్‌గా చెప్తారు. తనకి 16వ ఏటనే అర్జున్ బ్రూస్‌లీ ఎంటర్ ది డ్రాగన్  ఇన్ స్పిరేషన్‌తో కరాటే నేర్చుకున్నాడు..ఇదే ఆయన తర్వాతి రోజుల్లో యాక్షన్ కింగ్‌గా ఇమేజ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడింది.

1981లో మొదలైన అర్జున్ సినిమా ప్రయాణంలో మూడేళ్లకే మంచి బ్రేక్ వచ్చింది. తెలుగులో దర్శకుడు కోడిరామకృష్ణ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో తీసిన మా పల్లెలో గోపాలుడు సినిమా బంపర్ హిట్ కావడంతో అటు మాస్ జనానికీ బాగా ఎక్కాడు. ఆ తర్వాత అటు తమిళ్, కన్నడ..ఇటు తెలుగు భాషల్లో వరసగా బిజీగా సినిమాల్లో నటించాడు. ఓ దశలో అర్జున్ రోజులో ఏడు షిఫ్ట్స్‌లో పని చేశాడట. అంటే రోజుకి 24గంటలైతే, ప్రతి రెండు గంటలు ఒక సినిమాకి చొప్పున ఏడు సినిమాల్లో నటించాడట. అలా 1985లో తెలుగువరకూ చూసుకుంటే, టెర్రర్, బంగారు చిలక, నాగదేవత కుట్ర, ప్రతిధ్వని,కోటిగాడు కోనసీమ కుర్రాడు, మన్నెంలో మొనగాడు, మనవడొస్తున్నాడు, న్యాయానికి సంకెళ్లు,త్రిమూర్తులు, చిన్నారి దేవత, తాయారమ్మ తాండవకృష్ణ, సిరిపురం చిన్నొడు, వేగుచక్కు పగటిచుక్క, ఆగష్ట్15రాత్రి సినిమాలు చేశాడు.. అలా 1988 వరకూ తెలుగులో కూడా నటించిన అర్జున్..ఆ తర్వాత తెలుగులో నటించడం మానేశాడు. దానికి కారణం తమిళంలో బిజీ అవడమే.


ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌కి షిప్ట్ అవడం కూడా ఓ కారణం కావచ్చు. ఐనా తెలుగువారికి దూరం కాకుండా డబ్బింగ్ సినిమాలతో పలకరించాడు వాటిలో 1991లో వచ్చిన సేవగన్ ఒకటి. సొంత డైరక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టైంది. తెలుగులో కూడా డబ్బైంది.  1993లో శంకర్ డైరక్షన్లో వచ్చిన జెంటిల్మెన్‌తో రెండు భాషల్లో స్టార్ హీరోగా మారాడు. అప్పుడే అర్జున్ వరసగా ఆరు హిట్లు ఇచ్చాడు. జైహింద్ కూడా ఆయన డైరక్షన్లోనే చేశాడు. ఆ వరసలోనే 1994లో డైరక్ట్ తెలుగు మూవీ మా ఊరి మారాజు చేశాడు..ఐతే అది కూడా కోడిరామకృష్ణే డైరక్టర్ కావడం విశేషం. తెలుగులో అర్జున్ చేసిన సినిమాల్లో ఎక్కువ దర్శకత్వం వహించింది కోడి రామకృష్ణే.. 1998లో తిరిగి శుభవార్త అనే సినిమా డైరక్ట్ తెలుగు సినిమా..దీన్నే తమిళంలోనూ తీశారు..ఈ సినిమానే అర్జున్ కి వందో సినిమా..ఇక మళ్లీ శంకర్ దర్శకత్వంలో 1999లొ ఒకే ఒక్కడు వచ్చింది. దీంతో మినిమం గ్యారంటీ హీరోగా తమిళంలో అర్జున్ సినిమాలు కనీసం 12 సినిమాలు హిట్టయ్యాయ్. ఎప్పటెప్పటివో అర్జున్ తమిళ సినిమాలు వరసబెట్టి తెలుగులోకి డబ్ చేశారు కూడా.



 2003 వరకూ మళ్లీ తెలుగులో చేయని అర్జున్ 2003లో పుట్టింటికి రా చెల్లీ..ఆ తర్వాత హనుమాన్ జంక్షన్తో ప్రేక్షకులని పలకరించాడు. తెలుగులో హీరోగానే కాకుండా..మంచి పాత్రలు చేయడం కూడా అర్జున్ కెరీర్ ని పొడిగించింది. రామ రామ కృష్ణ కృష్ణ, శ్రీఆంజనేయం, స్వాగతం వంటివి వాటిలో కొన్ని..2017లో విస్మయ పేరుతో వచ్చిన సినిమా అర్జున్‌కి 150వ సినిమా.



ఆ తర్వాత ఇక తన పాత్ర హీరోనా..కాదా అని ఆలోచించడం మానేసి ప్రాధాన్యత ఉన్నదా లేదా అనేదే అర్జున్ పట్టించుకోవడం ప్రారంభించాడు. కెరీర్ మొత్తం మీద 13 సినిమాలకు దర్శకత్వం వహించాడు అర్జున్. అలానే 4 పాటలు కూడా పాడాడు. 2సార్లు తమిళనాడు ప్రభుత్వం, 2సార్లు కన్నడ ప్రభుత్వం ఉత్తమనటుడిగా సత్కరించాయి. తెలుగుహీరోల్లో జగపతిబాబుతో స్నేహంగా ఉండే అర్జున్, తన యంగ్ ఏజ్‌లో షూటింగ్ గ్యాప్‌లో ఇతర నటులపై సరదాగా కరాటే ప్రయోగించి ఇబ్బంది పెట్టేవాడని అంటారు. భానుచందర్, సుమన్, అర్జున్ వీళ్ళు ముగ్గురూ ఒకటే సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చిన కరాటే తెలిసిన హీరోలు..ఐతే ఈ ముగ్గురూ ఎప్పుడూ కలిసి నటించకపోవడం విశేషం. కుటుంబం విషయానికి వస్తే కన్నడ నటి నివేదితని ప్రేమించి పెళ్లాడాడు అర్జున్..ఈమే తెలుగులో నీతూ పేరుతో నటించింది.. డాక్టర్ గారి అబ్బాయి అనే సినిమాలో అర్జున్, నివేదిత కలిసి నటించారు..ఈ దంపతులకు ఐశ్వర్య, అంజన అనే ఇద్దరు కూతుళ్లు..వీరిలో ఐశ్వర్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. అర్జున్ హాబీల విషయానికి వస్తే..ఈ రోజుకీ రోజూ జిమ్‌లో మూడు గంటలు గడుపుతాడట. పైగా చిన్న స్వీట్ ముక్క తిన్నా కూడా కనీసం కిలోమీటర్ రన్నింగ్ చేస్తానని చెప్తాడు చిన్ననాటి నుంచీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది అర్జున్ కోరికకాగా..సినిమాల్లోకి రావడంతో అది తీరలేదు..అందుకే వీలైనప్పుడల్లా తన సినిమాల్లో పోలీస్ పాత్రలే చేయడానికి ఇష్టపడతాడు.





 ఇక ఆంజనేయస్వామిని విపరీతంగా ఆరాధించే అర్జున్, చెన్నై శివార్లలో 35 అడుగుల స్వామి విగ్రహం ఏర్పాటు చేశాడు. ఇది 140 టన్నుల బరువుతో 35 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పు ఉన్న ఈ ప్రతిమకి మరో విశేషం..కూర్చున్న ఆంజనేయస్వామిరూపం..


.తోటి నటులు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించడం అర్జున్ నైజంగా చెప్తారు. ఓ చినదానా, స్టూడెంట్ నంబర్ వన్ హీరోయిన్ గజాలా ఓసారి నిద్రమాత్రలు మింగిన సందర్భంలో స్వయంగా అర్జునే ఆమెని హాస్పటల్‌కి చేర్చాడు. హాస్పటల్ స్టాఫ్ అందుబాటులో లేకపోవడంతో..కారులోనుంచి ఆమెని చేతులపైనే మోసుకుంటూ ఐసియూ వరకూ తీసికెళ్లాడు. అది గజాలా సూసైడ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నమని అంటారు. ఐతే నిద్రమాత్రలు ఎక్కువ మింగి ప్రమాదంలో పడిందని ఆమె వెర్షన్. దీనిపై అర్జున్ మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు. గజాలా బతికి ఉంది చాలంటాడు. ఇది జరిగింది 2002 జులై 22 హైదరాబాద్‌లో..గజాలాని చేర్పించింది నిమ్స్‌లో. భరతసింహారెడ్డి అనే సినిమాలో గజాలా అప్పుడు నటిస్తుంది..అప్పట్లో సినిమానటులు చాలామంది బంజారాహిల్స్‌లోని ప్రశాంత్ కుటీర్‌లో బస చేస్తుండేవారు..సౌందర్య కూడా అందులోనే దిగేది. గజాలా కూడా ఈ ప్రశాంత్ కుటీర్‌లో బస చేసిన సమయంలోనే ఈ ఘటన జరిగింది..ఈ విషయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదు అయింది కూడా.

ఇతర హీరోలతో స్నేహంగా ఉండే అర్జున్ రాజకీయాలవైపు వస్తారని భావించినా వాటికి దూరంగా ఉండిపోయారు. 60ఏళ్లకి దగ్గరపడినా తరగని ఉత్సాహంతో సినిమాలు చేస్తున్న అర్జున్..తొందర్లోనే 200 సినిమాలు పూర్తి చేస్తానని చెప్తుండటం విశేషం

Comments