స్టార్ కావాల్సిన ఈ సూపర్‌స్టార్ సన్..చివరికిలా మిగిలాడు


సూపర్ స్టార్ కి కొడుకు..మరో సూపర్ స్టార్‌కి అన్న..స్వయంగా తానే ఒక హీరో..కెరీర్ బిగినింగ్‌లోనే మూడు సూపర్ హిట్ సినిమాలు..ఐనా అతను మాత్రం తెరపై ఎక్కువకాలం మెరవలేకపోయాడు. సరికదా ఫేడౌటై..చివరికి తెరమరుగు అయ్యాడు. అతనే ఘట్టమనేని రమేష్..1988-89 మధ్య సినేమా ఇండస్ట్రీకి వచ్చి రైజింగ్ స్టార్ గా పిలవబడిన రమేష్ బాబు ఓపెనింగ్ సినిమానే మంచి క్రేజ్ సంపాదించుకుంది. దానికి కారణం తండ్రి సూపర్ స్టార్ కృష్ణకి ఉన్న క్రేజే..ఆ సినిమా యావరేజ్‌గా ఆడినా..వరసగా ఆఫర్లు వచ్చాయి.



నిజానికి కృష్ణ సినిమాల్లో చిన్న పిల్లల క్యారెక్టర్లు ఏవైనా ఉన్నాయంటే అవి తన పిల్లలచేతనే యాక్ట్ చేయించేవారాయన. అలా కాకుండా 1979లో దాసరి డైరక్షన్లో వచ్చిన నీడ అనే సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ రమేష్ చేశాడు. చిన్నతనంలో మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఆ మేరకు రాణించలేకపోయాడు. ఒక రకంగా ఫిజిక్ మెయిన్ టైన్ చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.



తన తండ్రి కృష్ణ డైరక్షన్లో వచ్చిన ముగ్గురు కొడుకులు, కలియుగకర్ణుడు సినిమాల్లో మంచి ఈజ్‌తో పైట్స్, డ్యాన్స్
చేసిన రమేష్ ఆ  తర్వాత మాత్రం వాటిలో దూకుడు పెంచలేకపోయాడు.





ఫలితంగా ఎన్ని సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. బజారు రౌడీ వంటి హిట్ సినిమా పడినా..తిరిగి సక్సెస్ కోసం ఐదేళ్లు ఆగాల్సి వచ్చింది . కానీ ఈ మధ్యలోనే రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు మొదలై కూడా ఆగిపోవడం విడుదల కాకపోవడంతో రమేష్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది..అందులో ఒకటి సాహసయాత్ర పేరుతో గిరిబాబు నిర్మాణంలో కౌబాయ్ మూవీ ఒకటి మొదలుపెట్టారు. అందులో ముగ్గురు కథానాయికలు..రూపిణి, రమ్యకృష్ణ, గౌతమి..ఒక ద్వీపంలో ఉండే నిధి నేపద్యంలో సాగే ఈ సినిమా పూర్తై విడుదలై ఉంటే రమేష్‌కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టేదంటారు.

అలానే శాఖమూరి సూరిబాబు నిర్మాణతలో తమిళ్ డైరక్టర్ టి.రాజేందర్ డైరక్షన్లో ప్రేమచరిత్ర అనే సినిమా కూడా ఒకటి పూర్తైంది. అందులో 11 పాటలు ఉన్నాయ్. చాందినీ అనే అమ్మాయి హీరోయిన్‌గా నటించింది. ఇందులో రాధ కూడా ఒక పాత్రలో కన్పిస్తుంది. టి.రాజేందర్ మెయిన్ రోల్..రమేష్ , చాందిని లవ్ పెయిర్ కాగా..వారి ప్రేమకి సాయపడే క్యారెక్టర్లో రాజేందర్ నటించాడు..ఈ సినిమా పూర్తైనా తెలుగులో విడుదల కాలేదు..తమిళంలో మాత్రం మంచి విజయం సాధించింది. ఇది యూట్యూబ్‌లో కన్పిస్తుంది కూడా..ఇప్పటిదాకా ఈ సినిమా విడుదల కాలేదనే భ్రమలోనే చాలామంది ఉన్నారు..నిజానికి ఆ సినిమా కూడా తెలుగులో విడుదలై ఉంటే..రమేష్ కెరీర్ కనీసం ఇంకో పదేళ్లు సాగేది..అలా రెండు సినిమాలు రమేష్ కి దెబ్బ వేశాయ్.

 ఐతే 1993లో  సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన అన్నాచెల్లెలు అనే సినిమా ఆర్ధికంగా లాభాలు తెచ్చిపెట్టింది. అదే
ఊపులో మరి కొన్ని సినిమాలు తీసినా అవి ఫెయిలయ్యాయ్. ఆదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ మాత్రం హిట్లపై హిట్లు కొడుతూ కెరీర్ పొడిగించుకోవడం గమనార్హం. తన పెద్ద కొడుకు రమేష్ ఇలా చతికిల బడటం ఇష్టం లేని కృష్ణ అక్కడకీ మరో రెండు సినిమాలు ప్రారంభించారు..అది 1994లో బైరవద్వీపం వచ్చి హిట్టైన సందర్భంలో రమేష్ ని
హీరోగా ఇంద్రజ హీరోయిన్ గా భూలోక రంభ అని ఓ జానపద సినిమా ప్లాన్ చేశారు.. ఆ తర్వాత 1995లో రమేష్, సౌందర్య హీరోహీరోయిన్లుగా అహో విక్రమార్క అనే మరో సినిమా కూడా ప్లాన్ చేశారు..ఇందులో కృష్ణకి కూడా ఓ క్యారెక్టర్ ఉంది. కృష్ణకి పెయిర్ గా రమ్యకృష్ణని ఎంపిక చేశారు..ఐనా ఇదీ పూర్తి కాలేదు..ఇక దీంతో రమేష్  స్వయంగా తానే ఓ నిర్ణయం తీసుకున్నాడు. 1997లో తండ్రితో కలిసి ఎన్ కౌంటర్ అనే సినిమాలో కన్పించి..గుడ్ బై చెప్పేశాడు. కాస్తో కూస్తో నటించగలిగి ఉండి కూడా అలా సూపర్ స్టార్ పెద్ద కొడుకు సినిమాలకు దూరమయ్యాడు. మొత్తం తన కెరీర్లో 14 సినిమాల్లో హీరోగా నటించాడు.




రమేష్ బాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన గాలి వెంకటేశ్వరరావ్ అనే డాక్టర్ కుమార్తె అయిన మృదులని వివాహం చేసుకున్నాడు. సంతానం విషయానికి వస్తే భారతి అనే కుమార్తె జయకృష్ణ అనే కుమారుడు ఉన్నారు..వీరిలో జయకృష్ణ మహేష్ తేజల జయం సినిమాలో మొదటి సన్నివేశాలలో కన్పిస్తాడు..ఇప్పుడు పెద్దై హీరోగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడట. రమేష్ బాబు పద్మాలయా స్టూడియో ఉన్నంతవరకూ ఆ నిర్వహణలో ఉండగా..ఇప్పుడు కృష్ణా ప్రొడక్షన్స్ పేరుతో సొంత సంస్థ స్థాపించి సినిమాలు నిర్మించాడు. ఖాళీ దొరికినప్పుడల్లా సొంతఊరు వెళ్లి అక్కడి జనంతో కలిసి వస్తుంటాడట. ఎక్కువగా మద్రాసులోనే ఉండటంతో పెద్దగా హైదరాబాద్ సినీజనంతో కలవడానికి ఇష్టపడడట రమేష్..అందుకే తమ్ముడు మహేష్ బాబు సినిమాలు ఎన్ని హిట్టైనా ఎక్కడా ఒక్క ఫంక్షన్‌కి కూడా వచ్చిన దాఖలాలు కన్పించవ్.




తన కుటుంబం అంటేఎంతో పొసెసివ్‌గా ఉండే రమేష్ వైఖరితోనే మంజుల హీరోయిన్ అవకుండా జరగడం కూడా అయిందంటారు. తాను ఎటూ హీరోగా సక్సెస్ కాకపోయినా..తన కుమారుడు జయకృష్ణని హీరోగా చేయాలనేది ఆయన తపనగా కన్పిస్తోంది. అందుకే లావుగా ఉన్న జయకృష్ణకి ఫిట్ నెస్ ట్రైనింగ్ తోపాటు నటనలో శిక్షణకోసం వైజాగ్ సత్యానంద్ దగ్గర చేర్పించాడంటారు..అలా సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా జయకృష్ణ తెరపైకి రానున్నాడట

Comments