దొంగలు పడ్డ ఆరు నెలలకి బ్యాంక్ కేకలు వేస్తోంది


పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి నీరవ్ మోడీ టోపీ పెట్టి పారిపోయిన వైనం అందరికీ తెలిసిందే..ఐతే బ్యాంకు మాత్రం తన లోపాలను ఒప్పుకోకుండా బ్లేమ్ గేమ్ మొదలుపెట్టింది.  అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి మోసం ఒకటి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించలేదని..చెప్తోంది. ఆర్‌బిఐ ఇచ్చిన మెయిల్స్ తనకి చేరలేదని వాదిస్తోంది. దీంతో ఆర్‌బిఐ డిఫెన్స్‌లో పడింది
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎలా వాదిస్తుందంటే..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఈ మధ్యనే తన అధికారాలపై పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై ఓ వివరణ ఇచ్చారు. ఆ అంశాలపై చర్చ సాగుతుండగానే..పిఎన్‌బిలో మోసం జరిగే అవకాశం ఉందంటూ ఆర్బిఐ మెయిల్ మాకు రాలేదని ఆ బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. దొంగలు పడ్డ ఆర్నెల్లకు నిద్రలేచినట్లు ఈ ఉదంతం బైటపడిన ఇన్నాళ్లకు ఏ మెయిలూ రాలేదని చెప్పడం గమనార్హం. నవంబర్ 2016లో ఆర్‌బిఐ అన్ని బ్యాంకులకూ ఓ ఆదేశం పంపింది. జనవరి 1, 2015 నుంచి జరిగిన స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ సరి చూసుకోవాల్సిందిగా కోరింది. స్విఫ్ట్ అనేది బ్యాంకుల మధ్య జరిగే నగదు బదిలీ గురించి తెలుసుకునే సమాచార వ్యవస్థ. దీనిని మానుప్యులేట్ చేయడం ద్వారానే నీరవ్ మోడీ తన చాకచక్యం చూపి వేలాది కోట్లు నొక్కేయగలిగాడు. ఇలా స్విఫ్ట్ లావాదేవీలను సరి చూసి అన్నింటినీ ఆడిట్ చేయాలని ఆప్పట్లో ఆర్‌బిఐ చెప్పగా..వాటి అతీ గతీ బ్యాంకులు పట్టించుకోలేదని ఆరోపణ. స్విఫ్ట్ సిస్టమ్ ని కోర్ బ్యాంక్ సొల్యూషన్స్‌తో అనుసంధానం చేయాలని ఆర్బీఐ సూచించినా..పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేయలేదని రిజర్వ్ బ్యాంక్ ఎత్తిచూపింది. అలా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ దాదాపు 14300కోట్ల రూపాయల మోసానికి తనకి తెలీకుండానో..అధికారుల అవినీతితోనో దారులు పరిచింది. తీరా ఇప్పుడు ఆర్‌బిఐ పంపించిన ఎలక్ట్రానిక్ మెయిల్..తమకి అందలేదని చెప్పడం విమర్శలకు తావిచ్చేదే ఎందుకంటే మిగిలిన బ్యాంకులు ఈ ఈమెయిల్ తమకి అందినందువల్లనే వ్యవస్థలలో మార్పులు చేశాయ్.
మరి ఇంత చెప్పిన PNB ఈ పదేళ్లలో ఏం చేసిందో తెలుసా..?
పిఎన్‌బిలో మోసం బైటపడిన తర్వాత 21 మంది అధికారులను సస్పెండ్ చేశారు. అటు ఈడీ, సిబిఐ దర్యాప్తుతో పాటు బ్యాంక్ కూడా  అంతర్గత దర్యాప్తు చేపట్టింది
దాని ప్రకారం 54మంది సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ఈ భారీ మోసం చోటు చేసుకుంటున్నట్లు తమ 162 పేజీల నివేదికలో పొందుపరిచింది. ఇందులో క్లర్కుల దగ్గర్నుంచి
ఉన్నతాధికారుల వరకూ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 54మంది నిందితులలో 8మంది ఓవర్సీస్ బ్రాంచ్ సిబ్బంది ఉన్నారు వారిపై ఫెడరల్ కోర్టులో విచారణ సాగుతోంది.
కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతానికి ఈ దర్యాప్తు నివేదికను బహిర్గతపరచడం లేదని చెప్తోంది.

ఈ మొత్తం వ్యవహారానికి ముంబైలోని డౌన్ టౌన్ ఏరియాలోని బ్రాడీ హౌస్‌ బ్రాంచ్ కేంద్రం..ఇక్కడ్నుంచే తప్పుడు స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ చోటు చేసుకున్నాయ్. గోకుల్ నాథ్ షెట్టి అనే డిప్యూటీ మేనేజర్ ఏళ్ల తరబడి ఇలాంటి మోసపూరిత లెటర్ ఆఫ్ క్రెడిట్స్ జారీ చేస్తున్నట్లు ఇప్పుడు దర్యాప్తులో తేలింది. సాధారణంగా ప్రతి బ్రాంచ్‌లో లావాదేవీల ఆడిట్లను బ్యాంకు ఉన్నతాధికారులు ఏటా చేస్తుంటారు. అలా ఈ బ్రాడీ హౌస్ బ్రాంచ్‌ని తనిఖీ చేసినప్పుడు రెండు సార్లు అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఐనా ఆ బ్రాంచ్‌లో ఏమీ జరగనట్లు ఇన్‌స్పెక్షన్ సిబ్బంది కవర్ చేశారు. ఇంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే..2010 నుంచి 2017 వరకూ ఈ శాఖని తనిఖీ చేసిన పిఎన్‌బి ఉన్నతాధికారులు బ్రాడీ హౌస్ బ్రాంచ్‌లో ఎలాంటి తప్పులూ జరగలేదని చెప్పడం గమనార్హం. ఇంత పెద్ద లోపాలు పెట్టుకుని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీరిగ్గా ఆర్‌బిఐపై నెపం వేయడం విచిత్రం

Comments