ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ మర్చిపోలేని సినిమా..ఘోర అవమానం


తెలుగు చలనచిత్రరంగానికి మకుటం లేని మహారాజు నందమూరి తారకరామారావు. సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించిన తర్వాత మొదట్లో నెలవారీ జీతానికి పని చేసినా సినిమాలు మాత్రం సూపర్ హిట్ అవుతుండటంతో..నిర్మాతలు క్యూ కట్టేవాళ్లు ఎప్పుడైతే పౌరాణిక పాత్రలు పోషించడం ప్రారంభించారో అప్పుడిక ఆయన చాలామందికి
పూజనీయుడిగా మారిపోయాడు కూడా. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ అన్నగా మారారు. రాజకీయాల్లోకి వచ్చేముందు ఆయన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయ్. కానీ కెరీర్ తొలి దశకంలో మంచి ఊపులో ఉండగా..చరిత్రకెక్కిన సినిమాలు తీస్తున్నదశలో వచ్చిన ఓ సినిమా ఆయన పరువుని అమాంతం తీసేసింది. తన సినిమాలు కనకవర్షం కురిపిస్తున్న రోజులలో వచ్చిన ఆ సినిమా రిలీజైన మొదటి రోజునే వెనక్కి వచ్చేసింది..ఒక్క షో పడీ పడగానే  జనం థియేటర్ల నుంచి పరిగెత్తుకుంటూ ఇంటి దారి పట్టారు.అదే కాడెద్దులు-ఎకరంనేల.

వాలి సుగ్రీవ, కుటుంబం, సౌభాగ్యవతి, భట్టి విక్రమార్కను డైరక్ట్ చేసిన జంపన చంద్రశేఖర్రావు దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.  1960 సెప్టెంబర్‌లో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన భట్టి విక్రమార్క సూపర్ హిట్ కావడంతో , పొన్నలూరు బ్రదర్శ్ అనబడు వసంతకుమార్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఇద్దరు నిర్మాతలు కాడెద్దులు ఎకరం నేలను అక్టోబర్ 6న   విడుదల చేశారు. ఈ నిర్మాతలే శోభన్ బాబును అంతకు ముందు ఏడాది దైవబలం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయం చేశారు. ఎన్టీఆర్ అందులో హీరో అది యావరేజ్‌గా ఆడగా...ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఆశించారు. ఐతే ఫలితం చూస్తే..జనం బేజారెత్తిపోయారు. నిర్మాతలు నెత్తిన చెంగు వేసుకుని తిరిగి ప్రకాశం జిల్లా దారిపట్టారని చెప్తారు. ఇప్పటికీ ఈ సినిమా రీళ్లు ఏమయ్యాయో తెలీదు.కానీ ఈటివి దగ్గర మాత్రం ప్రింట్ ఉంది. యుట్యూబ్‌లో ఈ సినిమా లింకులు పని చేయవు.  ఈ సినిమాలో  పాటలు మొత్తం పిబి శ్రీనివాస్, జేవి రాఘవులు మాత్రమే పాడటం విశేషం. అప్పట్లో ఘంటసాల గాత్రం లేని సినిమాలు తక్కువ.

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, సురభి బాలసరస్వతి, షావుకారు జానకి, రేలంగి, రమణారెడ్డి, వంగర సత్యనారాయణ మిగిలిన పాత్రలు పోషించారు. గ్రామంలో రాజకీయాలు వాటిని ఎదురించే పేదరైతుగా ఎన్టీఆర్ తర్వాత జరిగే ఘటనలలో జైలుపాలడవం,  బైటకి వచ్చి విలన్లకి బుద్ది చెప్పడం ఇదీ స్థూలంగా కథ. అప్పటిదాకా ఇలాంటి టైటిల్‌నే తెలుగు ప్రేక్షకులు విని ఉండలేదు. పైగా సినిమాలో వినోదం పాళ్లు తక్కువ. ఇంత బోర్ సినిమా ఎన్టీఆర్ నుంచి ఊహించలేదనుకుంటూ జనం రీళ్లని తిప్పి కొట్టారు. విడుదలైన చాలా సెంటర్లలో ఒక్క షోనే పడితే ఒక రోజుకి మించి ఆడిన సెంటర్లు దాదాపుగా లేవు. ఇంత ఘోరమైన పరాజయం తర్వాత తేరుకుని ఎన్టీఆర్ సీతారామకల్యాణంతో జనాన్ని మెప్పించడంతో పీడకలలాంటి ఈ పరాజయాన్ని ఫ్యాన్స్ మర్చిపోగలిగారు

Comments