సెక్రటరీ..మీనా రాజశేఖర్ జయంతి ఏం చేస్తున్నారో కాస్త చెప్పు


ఎక్కడో ఆంధ్రదేశంలో కాజ అనే పల్లెటూరు..ఆ ఊరికి సరైన రోడ్డే లేదు..బస్సులే తప్ప రైళ్లు కూడా ఎరుగని ఓ పదహారేళ్ల అమ్మాయి ఆ తర్వాత తెలుగుసాహిత్యంలో తనకంటూ కొన్ని పేజీలు లిఖింపజేసుకుంటుందని ఎవరైనా ఊహించగలరా..తన రచనల్లోనే కాదు నిజంగా కూడా లలితమైన పదాలు, ఆర్ద్రత, వాత్సల్యం, ప్రేమ అనురాగంతో
పాటు మధ్యతరగతి జీవితాలను ప్రేమించగలిగే ఓ నవలారాణి ఉద్భవిస్తుందని అనుకోగలరా..అదే జరిగింది 1940లో కృష్ణాజిల్లా కాజ గ్రామంలో పుట్టారు యద్దనపూడి సులోచనారాణి..తొమ్మిదో తరగతిలోనే ఆంధ్రపత్రికకు ఓ కథ రాయడం అది ప్రచురించడంతో ఆమె రచనావ్యాసంగం ప్రారంభమైందని స్వయంగా ఆమే చెప్పారు. అలా అప్పట్లో తన పేరు పత్రికలో చూసుకోవడంలో వచ్చిన ఆనందం..మళ్లీ అదే కథకి 15 రూపాయల పారితోషికం పంపించడం కూడా తననెంతగానే ఆనందపెట్టిన క్షణాలని చెప్తారు.


అలా ప్రారంభమైన ఆమె 50 ఏళ్లలో 75 నవలలు రాసేవరకూ సాగింది. 2000వ సంవత్సరం వరకూ రచనావ్యాసంగంలోనే మునిగి తేలిన యధ్దనపూడి సులోచనారాణికి ఒక కుమార్తె ఆమె పేరు శైలజ. యద్దనపూడి చివరిశ్వాస ఆమె దగ్గరే కాలిఫోర్నియాలోనే విడిచారు. కొండపల్లి బొమ్మలంటే ఎంతో ఇష్టపడే యద్దనపూడి సులోచనారాణి తన నవలల్లో పాత్రలు కూడా అంతే సజీవంగా ఉండాలని కోరుకునేవారు. కాజ గ్రామం నుంచి పెళ్లైన తర్వాత 1958లో హైదరాబాద్ మకాం మార్చాల్సి వచ్చిన యద్దనపూడిఅప్పట్లో నగరం ఎలా ఉండేదో కూడా తన చివరి రోజుల్లో బాగా గుర్తుచేసుకున్నారు. స్వయంగా రచయిత కావడం వలన తాను మొదటిసారి నగరానికి వచ్చిన అనుభూతిని చక్కగా వర్ణించారు. మంచుకురుస్తూ..ఎక్కడ చూసినా పరిశుభ్రంగా.ప్రశాంతంగా సుందరనగరంగా సిటీ కన్పించిందని చెప్పారామె.
ప్రేమ,మధ్యతరగతి జీవితాల నేపధ్యంగా సాగే ఆమె నవలలు 1970-80ల మధ్య ఎంతో మందిని ప్రబావితం చేశాయ్. సెక్రటరీ మీనా, జీవనతరంగాలు, అగ్నిపూలు..ఇలా ఒక్కో నవలా ఒక్కో సంచలనం..ఆమెరాసిన నవలల్లో 16 నవలలు ఆ తర్వాత సినిమాలుగా కూడా వచ్చాయి. వచ్చి మెప్పించాయి. యద్దనపూడి ఫేవరిట్ హీరో అక్కినేని నాగేశ్వర్రావ్ అయితే..ఆయనే తన నవలల్లో హీరోగా మారడం ఆమెకెంతో ఆనందాన్నిచ్చిందట.
 చిన్ని చిన్ని వార్తల పట్ల కూడా స్పందించడం యద్దనపూడి సున్నిత మనస్తత్వానికి నిదర్శనం. పేపర్లలో టివీలలో చిన్నపిల్లల కిడ్నాప్ వార్తలు తెలిసినప్పుడు ఎంతో బాధపడేవారు. రొమాంటిక్ నవలల క్వీన్‌గా ఇతర రచయిత్రులు రచయితలే కీర్తించిన ఘనత ఆమె సొంతం..ఐతే ఇంతవరకూ తనని ఎవరూ ఎవర్నైనా ప్రేమించారా అని అడగలేదని చమత్కరించేవారు. తన నవలలలో ఎలాగైతే మంచి వ్యక్తిత్వం కలిగి ఉండే స్త్రీలు కన్పిస్తారో..అలానే నిజంగా కూడా ఉండాలని చెప్తారు. జీవితంలో ప్రతి సుఖం వెనుకా ఓ కష్టం ఉందని అది తెలుసుకుని వ్యవహరించాలని యద్దనపూడి చెప్తారు. ఆమె చేసిన రచనలతోనే ఎమెస్కో పబ్లిషర్లు లక్షల కొద్దీ సంపద ఆర్జించారని చెప్తారు..ఐతే తన రచనల రెమ్యునరేషన్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేవారని మరో రైటర్ మల్లాది వెంకట కృష్ణమూర్తి చెప్తారు. హీరో హీరోయిన్ల వ్యక్తిత్వం ఎలా ఉండాలో..ఎలా రాయాలో తాను యద్దనపూడి రచనల చూసే తెలుసుకున్నానని మరో రైటర్ యండమూరి ఇప్పటికీ చెప్తారు. తెలుగు సాహిత్య చరిత్రలో  ఇతర రచయితలకు ప్రేరణ ఇచ్చిన అతి తక్కువ రచయిత్రులలో యద్దనపూడి కూడా ఒకరు. ఆ రోజుల్లో నవలలు అద్దెకు తెచ్చుకోవడం లేదంటే ఒకరు చదివిన నవలను వేరొకరు అరువు తెచ్చుకోవడం వంటివి చేసేవారు. కానీ యద్దనపూడి నవలలు మాత్రం కవర్ పేజీ చిరిగినా..చివరి పేజీలు నలిగినా..మరొ పుస్తకం కొనుగోలు చేసేవారని అంటారు. అలా తెలుగు నవలల యుగంలో యద్దనపూడి సులోచన నిజంగానే రాణి.
ప్రతి మనిషీ ముఖ్యంగా మహిళలు తమకి సమాంతరంగా మరో జీవితం ఏర్పరుచుకోవాలన.అది ఆధ్యాత్మికం కావచ్చు..సేవారంగం కావచ్చు మరోటి కావచ్చని తన చివరి ఇంటర్వ్యూలలో సలహా ఇచ్చారామె. ముఖ్యంగా చితికిపోతున్న కళలు, కళాకారులను స్వయంగా సమాజమే దత్తత తీసుకోవాలని కూడా భావోద్వేగంతో చెప్పేవారు. 2018 మే 21న చనిపోయిన యద్దనపూడి..తన జీవితాన్ని పూర్ణకుంభంతో పోల్చుకునేవారు. ఎక్కడో చిన్న మారుమూల పల్లెటూరులో పుట్టి..భాగ్యనగరానికి వచ్చి తెలుగు వారందరి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నానని..ఇది చాలు అని చెప్పేవారు.చివరిగా తన నిష్క్రమణని కూడా ఓ కథ రూపంలో చెప్పేవారు. చివరి రోజుల్లో ఇంటర్వ్యూలు తీసుకున్నవాళ్లు కథతో ముగించమని అడగగా..ఇలా చెప్పేవారు..
" నాలానే ఓ 70 ఏళ్లు దాటిన రచయిత్రి ఉంటుంది..ఆమె తన చివరి కథని ఎమెస్కో విజయ్ కుమార్ ‌గారికి ఓ కవర్ ఇస్తుంది..తాను చనిపోయిన తర్వాత అది తెరవాలని చెప్తుంది. ఆమె ఫ్యాన్సంతా ఎంతో ఉత్కంఠతో అదేంటో తెలుసుకోవాలని ఉంటారు. కానీ ఆమె మాత్రం ఏమీ అవకుండా అలానే మాట్లాడుతూనే ఉంటుంది..ఇక టెన్షన్ తట్టుకోలేక ఓ అభిమాని ఆమెని పొడిచి చంపేస్తాడు. విజయ్ కుమార్ గారు బాగా ఏడుస్తుంటారు..ఆయన షర్ట్ అంతా తడిచిపోతుంది. ఈ చంపిన ఫ్యాన్ మాత్రం ఆమె ఇచ్చిన కవర్ ఓపెన్ చేస్తాడు..అందులో ఇలా ఉంటుంది.." నేను వెళ్లిపోతున్నా..మిమ్మల్ని మర్చిపోతున్నా మీరూ నన్ను మర్చిపోండి..నా సెక్రటరీ నవల చదవండి..నన్ను మర్చిపోతారు.."అని ఆ కవర్ లో ఉంటుంది.." అంటూ యద్దనపూడి ఆ కథని ముగించేవారు..నిజంగా ఇలానే ఆమె చివరిరోజులు జరిగాయ్. కానీ ఆమె చెప్పినట్లు ఎవరూ యద్దనపూడిని మర్చిపోలేదు. ఆమె సెక్రటరీ..మీనా, జీవనతరంగాలు, ప్రేమ చదువుతూ మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూనే ఉన్నారు

Comments