అటు కడప..ఇటు బయ్యారం రెండు చోట్లా ఉక్కు ఫ్యాక్టరీ


విభజన సందర్భంగా ఏపీకి ఏవో హామీలు ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకోవడం అవన్నీ నెరవేర్చుతున్నామని బిజెపి వాదించడం జరుగుతుండగానే..నాలుగేళ్లు పూర్తై ఐదో ఏట అడుగుపెట్టాం. పోలవరం కడితే పాపికొండల ప్రకృతి నాశనం అవుతుంది..చుట్టు పక్కల ప్రదేశాల్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని రాతలు రాసిన పత్రికలు ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అని మోత పుట్టిస్తున్నాయ్.చంద్రబాబుగారైతే ఏకంగా అదే ఆయన జీవితాశయంగా చెప్పుకుంటున్నారు. అలానే కడపజిల్లాలో బ్రహ్మణి స్టీల్స్ ప్రారంభం కాకుండా రకరకాల ప్రయత్నాలు చేసి సఫలం అయిన  పెద్దలు ఇప్పుడు ఏకంగా ఆమరణ దీక్షలంటూ( ఆమరణ దీక్ష అంటే ఏంటో అర్ధం తెలుసో లేదో మరి) రెచ్చిపోతున్నారు.

సుప్రీంకోర్టులో కేసు వేసిన సందర్భంలో కేంద్రం అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం కుదరదని అఫడవిట్ దాఖలు చేసిందని అంటున్నారు. ఐతే ఇది తాజా విషయం కాదని..ఎప్పుడో మూడేళ్ల క్రితమే కేంద్రం ఆ విషయం చెప్పినా చంద్రబాబు అండ్ కో ఊరికినే ఉన్నారని వైఎస్సార్సీపీ నేతల వాదన.

ఐతే ఇక్కడే బిజెపికూడా కొత్త నాటకం ప్రారంభించింది. అసలు కడపలో కానీ..బయ్యారంలో కానీ ఉక్కు కర్మాగారం లాభం కాకపోయినా మేం తెప్పిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇతర పార్టీలలో చెల్లని నేతలు ఆ పార్టీలో చేరగానే ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. సాక్షాత్తూ కేంద్రమంత్రి బీరేంద్ర చౌదురి కొన్ని రోజుల్లో మెకాన్ కన్సల్టెన్సీ ఓ నివేదిక ఇస్తుందని..దాని ప్రకారం అటు కడప కానీ..ఇటు బయ్యారంలో కానీ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించడం ఏ మేరకు కుదురుతుందో చెప్తుందని అన్నాడు. ఈ మాటలతోనే ఇక ఈ ఏడాది కాదు గదా..ఇప్పట్లో రెండు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాల ఊసు ఉండదని తేలింది. రాజకీయాలను ఉపాధి కార్యక్రమాలతో లింక్ పెట్టినప్పుడు దేశంలో ఏ పని మొదలుపెట్టాలన్నా..కనీసం ఏడాది పట్టడం పూర్తయ్యేసరికి దశాబ్దాలుతిరిగిపోవడం చూస్తూనే ఉన్నాం...33కోట్ల రూపాయల అంచనాతో ఉన్న రైల్వే లైన్లు నాలుగు ప్రభుత్వాలు మారేసరికి 3వేలకోట్ల రూపాయల ప్రాజెక్టులుగా మారడం  వెనుక నిర్లక్ష్యంతో పాటు కాంట్రాక్టర్లతో కలిసి జనం డొబ్బు నొక్కేయడానికి కాదా...ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరైనా మాత్రం ఏం చేయగలరు..

Comments