హిట్ ఇస్తాడనుకుని బి.గోపాల్‌తో సినిమా తీస్తే..పాపం ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చింది..ఝాన్సీ అనుభవం చూడండి


పాతతరం నటుల్లో కొంతమంది 70ఏళ్లుదాటినా మంచి ఆరోగ్యంగా  కన్పిస్తుంటారు. కొంతమంది మాత్రం అరవైఏళ్లకే ఎనబై ఏళ్ల వ్యక్తులుగా కన్పిస్తారు. సావిత్రి, గుమ్మడి , కైకాల సత్యనారాయణ, జేవి సోమయాజులు వంటి అనేకమంది ప్రముఖులతో నటించిన ఝాన్సీ అనే పాతతరం నటి గుర్తుండే ఉంటుంది. పాత్రల మధ్య పుల్లలు పెట్టే విలనీ పండించడంలో ఈమెకి బాగా పేరు ఐతే ఆమె కెరీర్లో సౌమ్యమైన పాత్రలు ధరించినవి కూడా ఉన్నాయి. ఐతే బాపు దర్శకత్వంలో వచ్చిన సినిమాలే ఆమెకి బాగా పేరు తెచ్చాయి.
గుడివాడలో పుట్టిన ఆమెకి ఇప్పుడు 80 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగానే ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలు గుర్తు తెచ్చుకుందామె మొదటి సినిమా కలిమిలేములు కాగా రెండో సినిమా చివరకు మిగిలేది. ఆ సినిమా ద్వారా సావిత్రి పరిచయం కలిగారట ఝాన్సీకి. ఆమె ద్వారా ఆరాధన, అంతస్తులు వంటి సినిమాల్లో పాత్రలు పోషించారు. అంతస్తులు సినిమాలో భానుమతికి తల్లిగా వేషం వేసేనాటికి ఆమె వయస్సు కేవలం 18 సంవత్సరాలేనంటే విచిత్రమే. ఈ సందర్భంలోనే బాపు తీసిన బాలరాజుకథలో ఛాన్స్ రావడం ఈమె పనితీరు నచ్చి బాపుగారి యూనిట్లో ఒ పర్మినెంట్ మెంబర్‌గా మారిపోయారట. కుటుంబగాధా చిత్రాలతో మెప్పించడమే కాకుండా, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణంవంటి పౌరాణికాల్లోని నటించారీమె. కౌబాయ్ తరహా పాత్రలు కూడా చేసారీమె. హిందీ నటుడు ఫృథ్వీరాజ్ కపూర్‌తో కూడా తెర పంచుకున్న ఝాన్సీ 1957లో చెన్నైకి వచ్చారట ఐతే తెలుగు చిత్రసీమ హైదరాబాద్ కి వచ్చేసిన తర్వాత మాత్రం ఆదరణ తగ్గిపోయిందని గుర్తు చేసుకుంటారు. 1972లో వివాహం జరగగా..ఇద్దరు సంతానం ఝాన్సీకి. ఎన్నో మంచి సినిమాల్లో నటించినా కూడా ఎప్పుడూ ఇంత రెమ్యునరేషన్ కావాలని డిమాండ్  చేయలేదని ఝాన్సీ చెప్పడం విశేషం. ఈమె సినిమాల్లో శంకరాభరణంలో చేసిన వేశ్య పాత్ర ప్రేక్షకులకు జుగుప్స కలిగించిందంటారు. అంటే అంత చక్కగా పాత్రలో ఇమిడిపోయారని..ఐతే ఇందుకు కారణం మాత్రం డైరక్టర్ కే విశ్వనాధ్ గారి గొప్పతనమే అని వినమ్రంగా చెప్తారీమె.
 ఎంతోమందికి తన అనుభవంతో నిర్మాతగా మారవద్దని  సలహా ఇచ్చిన ఝాన్సీ చివరకు తానే ఆ తప్పు చేశానని ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే బి.గోపాల్ డైరక్షన్‌లో ఖైదీ ఇన్‌స్పెక్టర్ పేరుతో ఓ సినిమా నిర్మించారు. ధనేకుల పద్మ ఝాన్సీ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా భారీగా తీశారు. అప్పటికీ బి.గోపాల్ చాలా ఖర్చు అవుతుంది మీరు భరించలేరని ముందు హెచ్చరించారట.
ఐతే అప్పటికే ఆయన హిట్ సినిమాలు తీశారని ఇప్పుడు ఝాన్సీ చెప్పుకొచ్చారు. నిజానికి బి.గోపాల్ 1992లో రౌడీ ఇన్‌స్పెక్టర్ తర్వాత మెకానిక్ అల్లుడు లాంటి డిజాస్టర్ తీశారు. ఆ దెబ్బకే నిర్మాతలు చాలా దూరం జరగగా..ఆ తర్వాత గ్యాంగ్ మాస్టర్ మరో బండ, ఆ తర్వాత ఎంఎస్ ఆర్ట్స్ తీసిన స్ట్రీట్ ఫైటర్ మరో ఫ్లాప్..ఇలా మూడు సినిమాలు వరసగా ఫ్లాప్ అయినా..ఆయనపై నమ్మకంతో ఝాన్సీని ఈ సినిమా తీయమని ప్రోత్సహించి ఉంటారనిపిస్తుంది. అలా తీసిన ఖైదీ ఇన్‌స్పెక్టర్‌లో  సుమన్, మహేశ్వరి, రంభ హీరోహీరోయిన్లుగా  నటించారు. విలన్లుగా రామిరెడ్డి, మోహన్‌రాజ్  లాంటి భారీనటులు చేశారు. పోసాని కృష్ణమురళి కథ అందించగా, సంగీతదర్శకత్వం బప్పీలహరి. కెమెరామెన్‌గా విఎస్ఆర్ స్వామి పని చేసిన ఈ సినిమా లుక్ అంతా భారీగానే వచ్చింది. సినిమా కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయ్. హీరో క్యారెక్టర్ పేరు సీతారామరాజు..ఎస్‌ఐగా పనిచేస్తాడు. నిజాయితీగల ఎస్ఐ క్యారెక్టర్‌లో సుమన్ చెప్పే డైలాగ్స్‌కి మంచి అప్రిషియేషన్ వచ్చింది.  ఐతే సడన్‌గా నెల రోజులు తిరిగేసరికి కలెక్షన్లు డ్రాప్ అయ్యాయ్. కారణం వేరే సినిమాలు రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల కోసం ఈ సినిమాని ఎత్తేశారు. ఉదాహరణకు గుంటూరులో యార్లగడ్డ రాములు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయగా..కృష్ణ 300వ సినిమా తెలుగువీరలేవరా రిలీజ్ చేస్తుండటంతో చాలా థియేటర్లలో ఖైదీ ఇన్సెపెక్టర్ పై దెబ్బ పడింది. సినిమా కొనుక్కున్నవారు బాగుపడ్డారు కానీ నిర్మాతగా ఝాన్సీకి చిప్ప మిగిలిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి పాపం  ఫిల్మ్ నగర్‌లో కట్టుకున్న మూడంతస్థుల బిల్డింగ్ అమ్ముకోవాల్సి వచ్చిందట. ఐతే ఓ సినిమా బాగా అడినా కూడా నిర్మాతకు ఎలా లాస్ వస్తుందో తెలిపే ఓ సమాచారంతో స్టోరీ ముగిద్దాం..ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఓ నటి..ఇంకో పెద్ద స్టార్ చేస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావడంతో చెప్పా పెట్టకుండా ఖైదీ ఇన్స్‌పెక్టర్ షూటింగ్ ఎగ్గొట్టి మరీ సదరు హీరో సినిమాలో నటించింది. దీంతో షెడ్యూల్స్ అన్నీ అప్‌సెట్ అయిపోయి డేట్లు తిరిగి కుదిరేసరికి ఎప్పుడో సమ్మర్‌లో విడుదల కావాల్సిన సినిమా  సెప్టెంబర్‌కి కానీ రిలీజ్ చేయడం కుదరలేదట. ఆ హీరో పెద్ద హీరోనే కానీ, అప్పటికి వరస ఫ్లాపులతో అల్లాడుతూ ఓ డబుల్ మీనింగ్ డైలాగుల డైరక్టర్‌తో కాంబినేషన్‌లో సదరు సినిమా చేశాడు. విషయం ఏదైతేనేం ఎక్కడైతే ఝాన్సీ కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఉందో..అదంతా తిరిగి సినిమా తీయడంతోనే పోయినట్లైంది. ప్రస్తుతానికి ఝాన్సీ ప్రశాంతంగా గడుపుతున్నారని తెలుస్తోంది

Comments