చంద్రబాబు తర్వాత టిడిపి భవిష్యత్తు ఎన్టీఆరేనా..?


టిడిపికి భవిష్యత్తు ఏమిటి..ఈ సందేహం చాలామందికి ఎన్నికలకు ముందు వస్తుంటుంది. 2019 ఎన్నికలలో చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ గెలిచినా..ఈ ప్రశ్న వేసుకోవాల్సిందే ఎందుకంటే, ఆయన వయసు అప్పటికే 70ఏళ్ల దాటుతాయి. ఈ వయసు దాటిన తర్వాత రాజకీయాల్లో చురుకుగా ఉండటం కొంతమంది మాత్రమే చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఆలోచనలు వేరే ఉన్నాయని..అందుకే పగ్గాలు వారసుడికి అప్పగించేందుకే
కొడుకుని అధినేత ఎమ్మెల్సీకి నామినేట్ చేశారంటారు... 35 ఏళ్ల వయసులో మంత్రి పదవి కట్టబెట్టడం వెనుక కారణం అదేననే విమర్శలూ ఉన్నాయ్.

 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది నందమూరి తారకరామారావ్ చేతులమీదుగా..
ఇప్పుడాయన తరంలో పుట్టినవాళ్లకి కనీసం 80 ఏళ్లు దాటి ఉంటాయ్. 1990లలో పుట్టినవాళ్లకి ఎన్టీఆర్ గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే వీలులేదు..మహానటుడు కాబట్టి..అప్పటి సినిమాల ద్వారా ఆయన గొప్పదనం తెలుసుకుంటుంటారు. ఐతే ఆయన వారసుడిగా బాలకృష్ణ ఉండటంతో ఎన్టీఆర్ నామస్మరణ చేయడం వీలు కుదిరింది. కానీ అదే బాలకృష్ణకి 2020తో 60 ఏళ్లు వస్తాయి.అంటే గత ముఫ్పై ఏళ్లుగా ఆయన్ని అభిమానిస్తున్నవారి వయసు కూడా 30 ఏళ్లు దాటుతుంది. బాలకృష్ణకి అభిమానగణమైతే ఎక్కువ ఉంది కానీ..సినిమాల సక్సెస్ పరంగా చాలా తక్కువైపోయింది గత దశాబ్దకాలంలో..ఒక్క హిట్ వస్తే తిరిగి హిట్ కొట్టడానికి కనీసం ఐదారేళ్లు పడుతుంది. ఇలాంటి దశలో బాలయ్య వారసుడు ఎంట్రీ ఇవ్వాల్సిందే. లేదంటే బాలయ్య వారసత్వం కొనసాగదు.
అంటే కొత్తగా టిడిపికి స్టార్ ఇమేజ్ తెచ్చేవాళ్లు ఉండరు..యువతరం మెచ్చే నటులు లేకపోతే మధ్యవయసు ఫ్యాన్స్ మాత్రమే మిగిలిపోతే పార్టీకి స్టార్ అట్రాక్షన్ ఉండదు.  1995 తర్వాత పుట్టినవాళ్లు బాలయ్యకి అభిమానులుగా మారినవాళ్లకి 2020కి పాతికేళ్లు వస్తాయి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గురించి ఫ్యాన్స్ ఎలా చెప్పుకుంటున్నారో, బాలయ్య గురించి 2020లో ఆయన కుర్ర అభిమానులు చెప్పుకోవాలంటే వారసుడు రావాల్సిందే. ఐతే ఇక్కడే,  ఈ గ్యాప్‌లోనే ఎన్టీఆర్ అదరగొడుతున్నాడు కానీ ఇది నందమూరి బాలకృష్ణ అభిమానులకు గిట్టదు అంటారు.
 కానీ 2020 తర్వాత టిడిపికి గ్లామర్ పరంగా కానీ, స్టార్‌డమ్ పరంగా కానీ ఎవరైనా ఆశ కలిగిస్తున్నారంటే అది కేవలం జూనియర్ అనే చెప్పాలి. 




ఎందుకంటే ఇవాళ, రేపు అంటూ ఊరిస్తున్న మోక్షజ్ఞ పర్సనాలిటీ చూస్తే ఆకట్టుకునేలా లేదు. దాన్ని అదుపులోకి తెచ్చి ఫిట్‌గా మారడానికి కనీసం ఓ ఏడాది పడుతుంది. కానీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నట్లు కన్పించడం లేదు. వారి  ఫ్యామిలీ ఫంక్షన్లలో అడపాదడపా బైటికి వస్తున్న కొన్ని ఫోటోలు చూసి నందమూరి ఫ్యాన్స్ షాక్ తిన్నారు కూడా. ఆ ఫోటోలు నిజమైనవే అయ్యుంటే ఒక తీరుగా రావడానికి చాలా రోజులు పడుతుందని అన్పించకమానదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్  టిడిపికి ఆశాకిరణం తమ హీరోనే అని చెప్పుకుంటుంటారు. కొంతమంది  తెలుగు నటులు కూడా జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్తారని చెప్తుంటారు.  సినిమారంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న జూనియర్ కొత్తగా ఎక్కే ఎత్తులు రాజకీయాలు తప్ప వేరే రంగంలో లేదు. ఎప్పటికైనా పార్టీకి ఆయనే సారధ్యం వహిస్తారనే ప్రచారాన్ని కొంతమంది చేయడానికి ఇదే కారణం.

ఎన్టీఆర్‌కంటూ టిడిపిలో ఓ వర్గం కూడా ఉందని గతంలో ప్రచారం జరిగేది. కొడాలినాని, వల్లభనేని వంశీ సహా కొంతమంది ఇందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని కూడా చెప్తారు. అందుకే టిడిపికి ఏనాటికైనా ఎన్టీఆరే దిక్కు అనే వాదన చేస్తారు. నారాలోకేష్ సమర్ధతని ప్రశ్నించేవాళ్లు ఇలాంటి వాదనకు బలం చేకూర్చుతుంటారు. మాట్లాడుతున్న విషయంపై పట్టు ప్రశ్నలను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న తీరు, ఫాలోయింగ్, ప్రచారంలో ప్రసంగాలు ఇలాంటి అంశాలను వాళ్లు ఎత్తి చూపుతుంటారు. ఎన్టీఆర్‌తో పోల్చినప్పుడు లోకేష్ తేలిపోతాడని..నారా చంద్రబాబు కొడుకు అనే ట్యాగ్ తీసేస్తే..జూనియర్‌తో పోల్చినప్పుడు లోకేష్‌కి చాలా తక్కువ మార్కులు పడతాయంటారు.
కొందరైతే అసలు ఏ విషయంలోనూ సరిపోలడని కూడా చెప్తారు. ఐతే ఇందుకు విరుగుడుగానా అన్నట్లు ఐటీశాఖని ఆయనకి కట్టబెట్టి చంద్రబాబు కృషితో వచ్చే ఇండస్ట్రీలను లోకేష్ పనితీరుకు నిదర్శనంగా చూపే ప్రయత్నాలు మొదలయ్యాయ్. వీటితో పాటు అసలు రాని కంపెనీలపై ప్రచార ఆర్భాటం కూడా అందుకే అని అంటారు. అదే
ఎన్టీఆర్‌లాంటి వ్యక్తి అయితే, ఇలాంటి జాకీలేసి లేపే ప్రయత్నం అవసరం లేదని జూనియర్ ఫ్యాన్స్ చెప్తారు. ఈ రెండు వాదనలలో ఏది నిజమో 2019 ఎన్నికల ఫలితాలే కాకుండా ఆ తర్వాతి రోజుల్లోని పరిణామాలే తేల్చుతాయి

Comments