సిల్క్ స్మిత గురించి ఇప్పటిదాకా బైటికి తెలియని కొన్ని నిజాలు


వ్యాంప్, సెక్సిణి, నైట్ క్లబ్ డ్యాన్సర్..ఇలా ఏ పదం వాడినా తెలుగులో ముందుగా కళ్లముందు కన్పించే రూపం సిల్క్‌స్మిత. అంతకుముందు జయమాలిని, జ్యోతిలక్ష్మి ఎంతగా చిందులు వేసినా..సిల్క్ వచ్చిన తర్వాత మాత్రం ఆ కథే వేరు. ఆమె బతికున్న రోజుల్లో బాగా పొగరు అని, మీడియా అంటే చిరాకు పడేదని..రకరకాల పుకార్లు ఉండేవి..చనిపోయిన తర్వాత మాత్రం ఆమెలోని మరో కోణాన్ని బైటికి రావడం ప్రారంభమైంది..అంతెందుకు 22 ఏళ్ల తర్వాత కూడా మనమో కథనం చెప్పుకుంటున్నామంటే అది ఆమెకే సాధ్యపడింది కదా..1984లో ఆమె ఫిల్మ్ ఫేర్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చూస్తే ఇప్పటిదాకా అందరికీ తెలిసిన విషయాలతో పాటుగా కొన్ని తెలీని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి
ముందుగా ఆమెకి అసలు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదనేది అవాస్తవం. సిల్క్ స్మిత బాబాయిలు, సోదరుల వరస అయ్యేవాళ్లు ఇండస్ట్రీలో చిన్నా చితకా వేషాలు వేశేవారట. ఐతే స్మిత ఎంట్రీకి మాత్రం వాళ్లెవరూ సాయపడలేదు. మలయాళం సినిమా ఇన్ అయైథేదితో అలా తెరంగ్రేటం చేసిందామె. ఇక సిల్క్ ఇంట్లో ఆమె సినిమాల్లోకి  వెళ్లడం ముందు ఇష్టపడలేదట. కానీ బాగా డబ్బు వచ్చి పడేసరికి మాత్రం అంతా ఆనందంగా ఉన్నారని ఆ ఇంటర్వ్యూలో చెప్పడం వాళ్లవాళ్లలోని వైరుధ్యంపై ఆమె నిరాసక్తతకి అద్దం పడుతుంది. పెర్ఫామర్‌గా చేయాలని ఆమె అనుకుంటే వ్యాంప్‌గా చేశారని వండిచక్రం సినిమాని గుర్తు చేసుకుంటుంది సిల్క్. వచ్చిన క్యారెక్టర్లను చేసుకుంటూ పోయిందే కానీ..ఏ డైరక్టర్‌నీ తన కోసం క్యారెక్టర్ డిజైన్ చేయమని అడగలేదట. ఆఫర్లు తీసుకోవడమే కానీ..డిమాండ్ చేయనని అది నా పని కాదని కూడా అప్పట్లో చెప్పిందామె.

 ఐతే ఆమెలోని నటిని సంతృప్తి పరుచుకోవడానికి స్త్రీ సాహసం, వీరవిహారం లాంటి సినిమాలను నిర్మించింది. చేతులు కాల్చుకుంది. సిల్క్ స్మితకి బాలుమహేంద్ర, భారతీరాజా అంటే బాగా ఇష్టం. నటులలో చిరంజీవి, కమల్ హసన్ అంటే ఇష్టపడుతుంది. శివాజీగణేషన్‌ని కూడా అగౌరవ పరిచిందని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఐతే సిల్మ్ స్మితకి చిన్నప్పట్నుంచి కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం అలవాటట. అందుకే అలా ఆయన ముందు కూర్చోవడంతో అది తప్పుగా ప్రచారం చేశారు. అలానే ఎంజిఆర్ అటెండ్ అయిన ఓ ఫంక్షన్‌కి కూడా ఆమె గైర్హాజరు అయింది. ఐతే చిరంజీవితో చేస్తోన్న ఓ సినిమాలో చాలా డేట్లు ఇవ్వగా ఆ షూటింగ్ కోసమే తాను సదరు ఫంక్షన్‌కి వెళ్లడం కుదరలేదట. నిర్మాతలు నష్టపోకూడదనే అలా చేశాను తప్ప ఏ ఫంక్షన్‌ని ఎగ్గొట్టడం తన అభిమతం కాదని సిల్క్ స్మిత వాదన. సిల్మ్ స్మిత కెరీర్ ఎంత రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోయిందంటే జస్ట్ నాలుగేళ్లలోనే 200సినిమాల్లో నటించేంత. ఈ క్రేజ్ ‌చూసి ఓర్వలేకే కొంతమంది ఇలాంటి తప్పుడు ప్రచారం చేయించారని ఫిల్మ్ ఫేర్ మేగజైన్ ఇంటర్వ్యూలో చెప్పిందామె. 
అలానే ఎంఎస్ విశ్వనాధన్ కండక్ట్ చేసిన ఓ సంగీత విభావరి కోసం సింగపూర్ వెళ్లింది సిల్క్ స్మిత. ఈ సందర్భంగా ఆమెపై స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చాయి. వాటి వెనుక కథ ఏమిటంటే,  ఎంఎస్ విశ్వనాధన్ కంపెనీతో సింగపూర్ వెళ్లేందుకు సిల్మ్ ఓ కండిషన్ పెట్టిందట. అందరితో కలిసి అంత మంది ముందూ డ్యాన్స్ చేయాలని మాత్రం పట్టుబట్టకూడదని కండిషన్ పెడితే దానికి అంగీకరించారట నిర్వాహకులు. అందుకు తగ్గట్లుగానే సింగపూర్ స్టేజ్‌పై ప్రేక్షకులకు నమస్కారం చెప్పి దిగిపోగానే ఆడియెన్స్ పెద్దగా అరవడం ప్రారంభించారట. దాంతో పోలీసులు ఆమెని దగ్గరుండి బస చేసిన హోటల్ వరకూ తీసుకెళ్లాల్సి వచ్చిందట. కాసేపటికి ఎంఎస్ విశ్వనాధన్ వచ్చి ప్రేక్షకులు ఆమెడ్యాన్స్ చేయకపోతే మిగిలిన ప్రోగ్రామ్ నడవనీయమని గోల పెడుతున్నారని చెప్పారు. ఐనా సిల్క్ స్మిత వినలేదట. తర్వాతి రోజు ఎంఎస్ విశ్వనాధన్ ఆయన కుటుంబం సిల్క్ స్మితకి ఏ మాత్రం చెప్పకుండా ఇండియా బయలు దేరి వచ్చేశారు. దీంతో సిల్క్ స్మితకి పట్టరాని కోపంతో పాటు చాలా అవమానం జరిగిన ఫీలింగ్ కలిగింది. ఎలాగోలా ట్రిప్ ఆర్గనైజర్లని పట్టుకుని పాస్‌పోర్ట్ తీసుకుని మద్రాసు వచ్చేసిందట. మద్రాసు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ డిపార్ట్ మెంట్ క్లియరెన్స్ లభించినా..కొన్ని వస్తువులకు డ్యూటీ కట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆరుగురు సిబిఐ ఆఫీసర్స్‌ వచ్చి ఆమె లగేజీ అంతా చెక్ చేశారు. ఐతే ఆ తర్వాత వాళ్లు సిల్క్ స్మితకి  క్షమాపణలు చెప్పి వెళ్లిపోయారట. జానీ దోస్త్, సద్మా హిందీ సినిమాలు చేసినా, మంచి నటిగా గుర్తింపు దక్కించుకోవాలనేది ఆమె తపనగా మిగిలిపోయింది. ఆమె గురించి తెలిసిన, పని చేసిన  కొంతమంది యువదర్శకులు ఇప్పటికీ ఆమె వైభోగం గురించి చెప్తుంటారు. నటిగా కొన్ని క్యారెక్టర్లలో మెరిసినా...సిల్మ్ స్మిత అంటే మాత్రం చాలామందికి ఆమె ఓ హాట్ సెక్సీ సింబల్ మాత్రమే..ఇదే అన్నిటికన్నా విషాదం

Comments