చివర్లోనూ పచ్చచొక్కానే ఐనా పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంచారెందుకు


నందమూరి హరికృష్ణ ఎన్టీఆర్ కుమారుడిగా, నటుడిగా మాత్రమే కాదు టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేత కూడా పైగా ఆ పార్టీకి చనిపోయేంతవరకూ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా..పార్టీ తరపున మంత్రిగా పని చేశారు. పార్టీని స్థాపించిన నేత కుమారుడుగానే కాకుండా కార్యకర్తలకు అత్యంత దగ్గరగా మెలిగిన హరికృష్ణ లేని లోటు నందమూరి కుటుంబసభ్యుల్లో ఎవరూ తీర్చలేరు. అలాంటిది అంత్యక్రియల సందర్భంగా తీసుకున్న ఓ నిర్ణయం పార్టీ కార్యకర్తలను, నందమూరి అభిమానులను ఆలోచనలో పడేసేదే.
మెహదీపట్నంలోని హరికృష్ణ నివాసం నుంచి అంతిమయాత్ర నేరుగా మహాప్రస్థానానికి చేరింది. మధ్యలో అటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌, పార్టీ కార్యాలయాల్లో ఎక్కడా ఆయన భౌతికకాయం ఉంచకపోవడం హరికృష్ణని అవమానించడమే. పార్టీలోని పెద్ద నేతలు మరణించిన తర్వాత ఇలా ఆయా పార్టీల కార్యాలయాల్లో వారి భౌతికకాయాలను కాసేపైనా సందర్శనకి ఉంచడం  వారికి పార్టీ ఇచ్చే తుదిగౌరవంగా భావిస్తారు. పివి నరసింహరావు విషయంలో  ఇలా చేయలేదనే కాంగ్రెస్ నేతలను టిడిపి, బిజెపి లీడర్లు విమర్శిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు సాక్షాత్తూ ఎన్టీఆర్ కుమారుడి విషయంలో ఇలా వ్యవహరించడం అసంతృప్తి రగిలించేదే.
ఐతే ఇది కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయమనే అనుకోవాలేమో. ఎందుకంటే వారు ఇష్టపడితే పార్టీ ఆఫీస్‌లో ఉంచడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ ఇదే సందర్భంలో హరికృష్ణ కుటుంబంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించినవారు లేరు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి. మరి ఇంత పెద్ద అనుభవమున్న నారా చంద్రబాబునాయుడికైనా ఈ విషయం తట్టి ఉండాలి కదా అనుకోకుండా ఉండలేరు. పార్టీ సంగతి అలా ఉంటే,  సినిమారంగం కూడా హరికృష్ణని చిన్న చూపు చూసినట్లే భావించాలి. రామకృష్ణా సినీ స్టూడియోస్ నిర్మాతగా హరికృష్ణని గుర్తుంచుకుని ఉంటే ఫిల్మ్ నగర్ హాల్లో కాసేపు అయినా ఆయన డెడ్‌బాడీని అభిమానుల సందర్శన కోసం ఉంచమని అడిగి ఉండాల్సింది. సినిమారంగం సంగతి పక్కనబెడితే, పార్టీ పరంగా మాత్రం హరికృష్ణని చిన్నచూపు చూసిందనే విమర్శ ఎదుర్కోవాల్సిందే.

Comments