విజయశాంతి చెల్లెలు కూడా హీరోయినే..కానీ ఎందుకు ఫెయిలైందో తెలుసా



ఓ పెద్ద యాక్షన్ హీరోయిన్‌కి కూతురు వరస..మరో స్టార్ హీరోయిన్‌కి చెల్లెలు..ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోయిన్ మామూలుగా అయితే కనీసం ఓ ఐదేళ్లపాటైనా ఇండస్ట్రీలో వెలిగిపోవాలి. కానీ సినిమారంగం  అంటేనే విచిత్రాలకు నెలవు కదా..అందుకే పాపం ఆ హీరోయిన్ చలనచిత్రరంగం నుంచి ఎలాంటి గుర్తింపు లేకుండా కనుమరుగు అయిపోయింది. ఆమే విజయరేఖ. లేడీ అమితాబ్‌గా పేరుతెచ్చుకున్న సూపర్ స్టార్ విజయశాంతి చెల్లెలు. విజయలలిత అని ఓ యాక్షన్ క్వీన్ గుర్తుండే ఉంటుంది. ఆమెకి ఓ అక్క..మరో చెల్లి ఉండేవారు. వాళ్లలో విజయలలిత అక్కగారి కూతురు విజయశాంతి కాగా...చెల్లెలి కూతురు విజయరేఖ. విజయరేఖ కూడా విజయశాంతి కెరీర్ టాప్ రేంజ్‌కు చేరుకుంటున్న సమయంలోనే సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేసింది.

అప్పట్లో కొన్ని పత్రికలలో ఆమె ఫోటోలతో ప్రమోషన్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి.
విజయశాంతికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమె చెల్లెలికి మంచి ఆఫర్స్ వస్తాయని ప్రేక్షకులు అనుకున్నారు. ఐతే తర్వాత జరిగింది మాత్రం వేరు. పెద్దగా పేరులేని దర్శకులు మాత్రమే ఆమెకి అవకాశాలు ఇచ్చారు. 1990లో అంకితం అనే సినిమా అప్పట్లో వచ్చిన వాటిల్లో కాస్తో కూస్తో జనాలకు దగ్గరైన సినిమా. సురేష్ హీరోగా వచ్చిన ఆ సినిమాకి బందెల ఈశ్వరరావ్ అనే అతను దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత విజయరేఖ తెనాలికి చెందిన గెద్దాడ ఆనందబాబు అనే అతని దర్శకత్వంలో నా పెళ్లాం నా ఇష్టం అనే సినిమాలో నటించింది. ఇందులో హీరో నరేష్. ఆ తర్వాత అంటే 1992లో ప్రేమద్రోహి అనే సినిమాలో నటించింది విజయరేఖ.




ఈ సినిమా ప్రేక్షకుల పాలిట
నరకకూపంగా తయారైంది. కనీసం దూరదర్శన్‌లో ప్రసారమయ్యే టివి సీరియల్ నయమనించింది. ఇందులో రఘువరన్ ప్రధాన పాత్ర కాగా, గొల్లపూడి మారుతీరావ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఏ యంగ్ హీరోయిన్ చేయని పాత్ర చేసింది విజయరేఖ. పాతికేళ్లు కూడా దాటకముందే, 50 ఏళ్ల మహిళ పాత్రలో సినిమా అర్ధబాగం నుంచి కన్పిస్తుంది. దీంతో తెలుగు సినిమారంగంలోని దర్శకులు పూర్తిగా ఈమెని పక్కనబెట్టేశారు. విజయరేఖ ఆ తర్వాత అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. కొన్నాళ్లకి అవి కూడా లేకుండా పెళ్లి చేసుకుని పూర్తిగా సినిమారంగానికి దూరమైంది.


Comments