ఐకియా బిర్యానీలో పురుగు..ఫైన్ వేసింది మాత్రం కవర్‌కి


భూగోళంలో ఎన్నడూ లేని స్టోరేదో హైదరాబాద్‌లో ఓపెనైనంత బిల్డప్ ఇచ్చారు ఐకియా అనబడు ఓ చెక్కసామాను వ్యాపారం ప్రారంభమైన రోజు..ఆ తర్వాత కూడా జనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో ఎగబడ్డారు..రోజులు గడిచాయ్..మెట్రో రైలులానే ఐకియా స్టోరు కూడా పాతబడిపోయింది. జనం అంతే..ఎప్పుడు నెత్తినబెట్టుకుంటారో..ఎప్పుడు కిందపడేస్తారో తెలీదన్నట్లు, ఆ వైపు చూడటం తగ్గించేశారు. అంత మాత్రాన వ్యాపారం తగ్గిపోయిందని కాదు కానీ..కొత్త మోజు..తొందరగానే తీరిపోయింది. 
ఐతే ఉన్నట్లుండి పాపం వెజ్ రేట్‌కే నాన్ వెజ్ బిర్యానీ వచ్చినట్లు ఓ వ్యక్తి తాను తింటున్న బిర్యానీలో బొచ్చుపురుగు వచ్చిందని గగ్గోలు పెట్టాడు. అటు జిహెచ్ఎంసీకి కంప్లైంట్ పెట్టడంతో వదిలిపెట్టకుండా మంత్రి కల్వకుంట్ల తారకరామారావునీ ట్యాగ్ చేశాడు..ఫలితం వెంటనే కన్పించింది. హడావుడిగా వచ్చేసిన జిహెచ్ఎంసి పనోళ్లు ఐకియాకి నోటీసు ఇచ్చేశారు. పనిలో పనిగా రూ.11,500 జరిమానా వేశారు.
భలే జరిగింది తిక్క కుదిరింది ఐకియాకి అనుకున్నారా..లేదు ఈ ఫైన్ పురుగుల బిర్యానీ వడ్డించినందుకు కాదు..50 మిల్లీ మైక్రాన్ల కంటే మందపాటి కవర్లు విక్రయించనందుకు..వేసిన ఫైన్..
మరి ఐకియా  ఏం చెప్తుంది ఇప్పుడు.." సారీ..మా కస్టమర్లకి ఇలాంటి అసౌకర్యం కలిగినందుకు( అంటే ఈసారి ఇలాంటిది కాకుండా మరోలాంటిది కలిగిస్తుందేమో). అసలు ఇదెలా జరిగిందో విచారిస్తాం( అంటే బాధపడతాం అని కాదు..ఎంక్వైరీ చేస్తారట..అంటే బొద్దింక ఎందుకు వచ్చిందనా..లేక వెజ్ బిర్యానీ అడిగినోడికి ఇలా నాన్ వెజ్ ఎందుకు వడ్డిస్తారనో..అని చెప్పింది..పైగా సదరు వ్యక్తి ఆగస్ట్ 31 రాత్రి తిన్న బిర్యానీ తమ కిచెన్‌లో వండినది కాదు..నాగ్‌పూర్ నుంచి దిగుమతి చేసుకుంటోన్న సెమీ-ఫ్రోజెన్ ఫుడ్ అని బుకాయిస్తోంది. దీంతో జిహెచ్ఎంసి సదరు స్నాక్స్ తయారీ సంస్థకి, ఐకియాకి రెండింటికీ నోటీసులు ఇచ్చింది. వారం రోజులలోగా ఈ ఫుడ్ తయారీ విధానాన్ని వివరింపుడు లేదంటే మీపై చర్యలు ఉంటాయి అనేది ఆ నోటీసులు సారాంశం. 
"కస్టమర్ల హెల్త్ మాకు చాలా ముఖ్యమైన విషయం. ఇందులో ఆహారం విషయంలో అస్సలు రాజీ  పడేది లేదు. కఠినమైన నియమనిబంధనలు పాటిస్తాం " ఇదీ ఐకియా విడుదల చేసిన ఓ ప్రకటన. మరి ఆ లెక్కన సదరు నాగ్‌పూర్ స్నాక్స్ కంపెనీ ఫుడ్ ఐటెమ్స్ ఇకపై ఐకియా స్టోర్‌లో కన్పించకూడదు..నిజంగా అలా జరుగుతుందా...? సో ఇదంతా చదివిన తర్వాతైనా..పరాయి సంస్థల గొప్పదనపు ప్రకటనలపై మోజు పెంచుకోవద్దనే విషయం అవగతమవుతుందనుకుంటా..

Comments