బ్యాంకులకు వరస సెలవుల ప్రచారంలో వాస్తవమెంత..ఎందుకీ ఆరాటం



బ్యాంకులు వరసగా ఐదురోజులు సెలవు..ఐదురోజులు పని చేయవు అంటూ ప్రచారం జరుగుతోంది. నిజంగానే అన్ని బ్యాంకులు ఐదు రోజులు వరసగా మూతబడుతున్నాయా..అసలు ఈ ప్రచారంలో నిజమెంత
వారంలో ఉన్నదే ఏడు రోజులు..అందులో ఐదురోజులు సెలవు అయితే..ఏ వ్యవస్థకి అయినా ఇబ్బందులు తప్పవు.

ఇప్పుడలాంటి ప్రచారమే బ్యాంకుల విషయంలో జరుగుతోంది. డిసెంబర్ 21 నుంచి వరసగా ఐదు రోజులు బ్యాంకులకు సెలవు వస్తోన్నట్లు మూతబడతాయన్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 21 శుక్రవారం..యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు సమ్మెకి పిలుపు ఇచ్చాయ్. దీంతో శుక్రవారం అన్ని బ్యాంకులు పని చేయవంటున్నారు. ఇక డిసెంబర్ 22 శనివారం..డిసెంబర్ 23 ఆదివారం..ఈ రెండు రోజులు
బ్యాంకులకు సాధారణంగానే సెలవు..అంటే ఇదేం ప్రత్యేకంగా వచ్చిపడ్డ సెలవులు కావు..ఈ మాత్రానికే భూమి బద్దలైపోయినట్లు ప్రచారం చేయడం కొన్ని వెబ్‌సైట్లకి పత్రికలకు అలవాటుగా మారిపోయింది.

వీటి లెక్క ప్రకారం చూసినా డిసెంబర్ 24 బ్యాంకులు పని చేస్తాయి..ఆ తర్వాతి రోజు అంటే మంగళవారం మాత్రమే క్రిస్‌మస్‌కి సెలవు..ఇక వరసగా ఐదురోజులు సెలవు ఎక్కడో ఈ ప్రచారం చేస్తున్నవాళ్లు చెప్పాలి..పైగా వరసగా మూడురోజులు సెలవు వస్తున్నందున నాలుగోరోజు ఉద్యోగులపై పనిభారం పడుతుందని కూడా రాసేసుకుంటున్నారు. అక్కడికేదో వీళ్లు చెప్పినట్లే బ్యాంకులలో పని తీరు ఉంటుందా..?

ఈ అంశాలన్నీ పక్కనబెట్టినా..ఈ రోజున బ్యాంకులకు వెళ్లి నగదు లావాదేవీలు చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది..ఓ రకంగా బ్యాంకులే వాటిని నిరాకరించి..ఏటిఎంలవైపు మళ్లేలా చేశాయ్. అలాంటప్పుడు ఏటిఎం సెంటర్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇలా ఐదురోజులు సెలవంటూ తప్పుడు ప్రచారంతో పెరిగితే రష్ పెరగవచ్చు కానీ..అసలు నగదు వ్యవస్థే స్తంభించేంత సీన్ అయితే లేదు. పైగా ఇవి నెలాఖరు రోజులు..ఈ రోజుల్లో ఖాతాల్లో డబ్బు మూడువంతులు ఖర్చైపోయే ఉంటుంది వేతనజీవులకు..కాబట్టి వారికి కూడా బ్యాంక్‌లకి వెళ్లాల్సిన అవసరం తక్కువగానే పడుతుంది. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకోకుండా అదేపనిగా  బ్యాంకులకు సెలవు..ఇక కష్టాలు మొదలనే రీతిలో ప్రచారం చేయడం తగదు

Comments