2019 ఎన్నికలలో ఇదీ జనసేన సత్తా..ఏ పార్టీకి ఎలా ఉంది..-1


సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజధాని అమరావతి కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో అభ్యర్థుల ఎంపిక రసకందాయంలో పడింది. ప్రధాన పార్టీలు జిల్లాపై ఆధిపత్యం సంపాదించేందుకు, సమర్థవంతమైన గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు వ్యూహరచనలు ప్రారంభించారు.   పట్టు నిలుపుకునేందుకు తెలుగుదేశం, పైచేయి సాధించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు పోటీ పడుతుండగా కొత్తగా వచ్చిన జనసేన కూడా తమ బలం నిరూపించుకునేందుకు సన్నద్ధమౌతోంది.
 గోదావరి జిల్లాల తర్వాత జనసేనకి బాగా గ్రిప్ ఉన్న జిల్లా గుంటూరే..పవన్ కల్యాణ్‌కి ఇక్కడ విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది..ఇక్కడే అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా
కొన్ని చోట్ల చదువుకోవడంతో..ఓ రకంగా సొంతజిల్లాగా మెగా బ్రదర్స్ చెప్పుకుంటుంటారు. ఆ రకంగా ఇక్కడ జనసేన, తెలుగుదేశం-వైఎస్సార్ కాంగ్రెస్‌కి పోటీ ఇచ్చే అవకాశాలే ఎక్కువ.
మొత్తం 17 అసెంబ్లీ  నియోజకవర్గాలతో ఉన్న గుంటూరు జిల్లాలో 2014 సార్వత్రిక ఎన్నికలలో  తెలుగుదేశం 12 సీట్లు గెలుచుకుంది..జిల్లాలో ఎంతో పట్టున్న పార్టీగా ప్రచారమైన యువజన శ్రామికరైతు పార్టీ మాత్రం 5 సీట్లతోనే సరిపెట్టేసుకుంది..జగన్‌కి సిఎం పీఠం దూరం చేసిన జిల్లాల్లో పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు కూడా ఒకటి..అందుకే ఈసారి ఇక్కడ ఎక్కువ సీట్లు తెచ్చుకునేందుకు జగన్ రకరకాల ఈక్వేషన్లు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

 2019 ఎన్నికలలో  మొత్తం 17 సీట్లలో టిడిపి, వైఎస్సార్సీపీ, జనసేన అభ్యర్ధులను నిలబెడతారని అంచనా ఉంది. ఐతే టిడిపి తాను గెలిచిన 12 సీట్లలో 7గురు సిట్టింగ్స్‌ని మార్చే ఛాన్సుందంటున్నారు..వాటిలో గుంటూరు వెస్ట్ ఒకటి ఎటూ కన్ఫామ్ అయిపోయింది. జిల్లాలో కులాల ప్రభావం చాలా ఎక్కువ..రెడ్డి అన్న వాళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ కి ...కమ్మ అన్నవాళ్లు టిడిపికి ఓటేయకుండా ఉండలేరనే ప్రచారం ఉంది. మధ్యలో ఉండిపోయిన కాపు కులస్థులకు ప్రజారాజ్యం కనుమరుగు కావడంతో..ఇక వారి చూపు ఇప్పుడు జనసేనపైనే పడిపోయింది..ఐతే ఇదెంతవరకూ వర్కౌట్ అవుతుందనేది..కాండిడేట్లపైన ఆధారపడి ఉంది. అంత మాత్రం చేత ప్రతి కులస్తుడు తన కులంవారికి గంపగుత్తగా ఓటేస్తారని మాత్రం అనుకోవడానికి లేదు.  రాజకీయ ఉద్దండులకు వేదికగా నిలచిన గుంటూరు జిల్లా నుండి ఆచార్య ఎన్‌జీరంగా, కొత్త రఘురామయ్య, చేబ్రోలు హనుమయ్య, నన్నపనేని వెంక్రటావు, దొడ్డపనేని ఇందిర, కాసు బ్రహ్మానంద రెడ్డి, భవనం వెంకట్రామ్(రెడ్డి) నాదెండ్ల భాస్కరరావు, కొణిజేటి రోశయ్య, రాయపాటి సాంబశివరావు,కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివప్రసాదరావు, ధూళ్లిపాళ్ల వీరయ్య చౌదరి, ఆలపాటి రంగారావు వంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించారు..వీరిలో కొంతమంది ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు కూడా

 వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేదీప్యంగా వెలిగిన కాంగ్రెస్ 2009 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో నేలకంటుకుపోయింది.. ప్రతి లీడర్ అటు టిడిపి కానీ..ఇటు జగన్ పార్టీలోకి కానీ జంపవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు కాంగ్రెస్ మంత్రులుగా పని చేసినవారు కూడా పోటీ చేయలేని దుస్థితి ఏర్పడింది..వారి దగ్గర పిఏలుగా చేసినవాళ్లనే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ తరపున నిలబెట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి స్థితిలో ఐదేళ్లు గడిపిన తర్వాత తిరిగి కాంగ్రెస్ 2019లో పోటీకి సిధ్దమవుతోంది..వాస్తవానికి కాంగ్రెస్ లో లీడర్లకి కొదవలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏమాత్రం 17 నియోజకవర్గాలలో అభ్యర్ధులు దొరుకుతారో తెలియాల్సి ఉంది.
బాపట్లకి ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కోన రఘుపతి ఉన్నారు.. గాదె వెంకట రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి ఉద్దండులు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ 9 సార్లు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్దులు గెలుపొందగా మూడు సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్దులు గెలుపొందారు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నుండి అన్నం సతీష్‌ ప్రభాకర్‌ రేసులో ఉన్నారు. అయితే సతీష్‌ ప్రభాకర్‌ ఎమ్మెల్సీగా ఉండటంతో ఆయన స్థానే నరేంద్ర వర్మను పోటీలోకి దింపాలని టిడిపి వ్యూహంగా తెలుస్తోంది.  ఐతే గుంటూరు జిల్లాలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నది బాపట్లలోనే అంటారు..సో ఇక్కడ జనసేన ఓ బలమైన అభ్యర్ధిని కనుక దింపితే..గెలవడం ఖాయమనే అంచనాలు ఉన్నాయ్. ఎందుకంటే ఇక్కడి ఎస్సీ వర్గాల్లోనూ పవన్ ఫాలోయింగ్ అనన్యసామాన్యం. బాపట్లతో మెగాస్టార్ కుటుంబానికి ఉన్న అనుబంధం కూడా తక్కువది కాదు

 ఇక తర్వాత జనసేనకి బాగా గెలవడానికి అవకాశం ఉన్న సీటు చిలకలూరిపేట..ప్రస్తుతం ఇక్కడి నుంచి గెలిచిన పత్తిపాటి పుల్లారావు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.ఇక్కడ 1989, 1999, 2009, 2014ల్లో టీడీపీ గెలుపొందగా, 1994లో మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందింది. ఇక 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా మర్రి రాజశేఖర్‌ గెలుపొందారు. ప్రస్తుతం ఇక్కడ నిన్నమొన్నటి వరకూ వైకాపా అభ్యర్ధిగా మర్రి రాజశేఖర్‌ కొనసాగారు..కానీ టిడిపి నుంచి వచ్చిన రజని అనే మహిళను వైఎస్సార్సీపీ బరిలో దింపుతుందనే ప్రచారం ఉఁది.. ఈమె గతంలో పత్తిపాటికి బలమైన మద్దతుదారు కాగా..ఎక్కడో తేడా కొట్టిందని..అందుకే ఈసారి పత్తిపాటి ఓటమే తన పంతంగా చెప్తుందని అంటున్నారు. ఈ నియోజకవర్గం జనసేన రాష్ట్రస్థాయి నేతల సొంతది కూడా..కాబట్టి..ఇక్కడ నుంచి జనసేన అభ్యర్ధి కనుక నిలబడితే..పత్తిపాటిపై వ్యతిరేకతను ఈజీగా క్యాష్ చేసుకోవచ్చని అంటున్నారు.

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్సార్సీపీకి చెందిన షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్నారు. తూర్పు నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. మొట్టమొదటి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన షేక్‌ మస్తాన్‌ వలీ ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా రెండో ఎమ్మెల్యేగా ముస్తఫా ఎన్నికయ్యారు. ఇక్కడ ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ తరపున మద్దాలి గిరిధర రావు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. దాదాపుగా టిడిపి గిరికే టిక్కెట్ ఇవ్వవచ్చని అంటున్నారు..గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ పవన్ కల్యాణ్ తన వర్గపు ఓట్లతో పాటు..పెట్టని కోటలాంటి అభిమానుల అండతో అభ్యర్ధులను నిలబెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయ్. భారతీయజనతాపార్టీకి కూడా ఇక్కడ పోటీ చేస్తే పెద్ద స్థాయిలో ఓట్లు పడతాయనే అంచనాలు ఉన్నాయ్. ఎందుకంటే 2009లో ఇక్కడ కాంగ్రెస్ తరపున గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ బిజెపి అధ్యక్షుడిగా కొనసాగుతుండటం గమనించాలి..పాకిస్తాన్‌పై మెరుపుదాడుల నేపధ్యంలో బిజెపి అప్పుడే అర్బన్ ఓటర్ల మనసులు గెలిచే ప్రయత్నం చేసేసింది కూడా..ఇదే గుంటూరు వెస్ట్ నుంచి జగన్..లేళ్ల అప్పిరెడ్డికి హ్యాండ్ ఇచ్చి అబ్రహాం అనే యువకుడికి సీటు ఇవ్వనున్నట్లు ప్రకటించారు..ఇతని తాత ఒకప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారని..ఆయనకి ఉన్న మంచిపేరు..ఎస్సీ ఓట్ల ఈక్వేషన్ కలుస్తాయనే వైఎస్సార్సీపీ ఇలా వ్యవహరించిందంటారు..ఐతే నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు పడేవరకూ వీటినే ఫైనల్ అని చెప్పలేం..

 పల్నాడులోని మారుమూల ప్రాంతం..ఎన్ని పార్టీలు అధికారం వెలగబెట్టినా..అభివృధ్ది అనే పదానికి కిలోమీటరు దూరంలో ఉన్న నియోజకవర్గం గురజాల..ఇక్కడి చరిత్ర చూస్తే.. 1952, 1972ల్లో సీపీఐ గెలవగా.. 1962, 1989, 1999, 2004ల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్దులు గెలుపొందారు. 1983లో మాత్రం ఇండిపెండెంట్‌‌గా  జూలకంటి నాగిరెడ్డి గెలిచాడు.  1985, 1994, 2009, 2014లో  టిడిపి.  యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన ఇక్కడ గెలవడం ఇది మూడోసారి...బిసి వర్గాలకు చెందిన జంగా కృష్ణమూర్తి యాదవ్‌ని జగన్ రెండేళ్లక్రితమే  ఎమ్మెల్సీ చేస్తామని మాట ఇచ్చారు..అలానే అది నెరవేర్చడంతో ఆయన వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది..యరపతనేనిని ఢీ కొట్టేందుకు నరసరావుపేట నుంచి కాసు మహేష్ రెడ్డి ని జగన్ తీసుకొచ్చి పోటీకి నిలబెట్టబోతున్నారు..ఇక్కడ జనసేన పోటీ పెట్టే కారణం ఏదైనా ఉందంటే..1989లో కనకం రమేష్ చంద్రదత్ అనే లీడర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలవడమే..కాపు వర్గానికి చెందిన ఆయన గెలుపే..ఇక్కడ జనసేనకి ఓ ఆధారంగా చెప్పొచ్చు..కులాల ఈక్వేషన్లలో టిడిపి కమ్మ వర్గానికి చెందిన కాండిడేట్‌ని నిలబెడితే..వైఎస్సార్ కాంగ్రెస్ రెడ్డిని నిలబెట్టబోతోంది..మిగిలిన జనసేన కూడా తన వర్గానికే చెందిన వ్యక్తిని నిలబెడితేనే ఇక్కడ ఓట్లు చీల్చగలిగేది..ఓ పార్టీపై కులముద్ర వేయాల్సిన అవసరం లేకపోయినా..నియోజకవర్గాలలో కులాలవారీగా ఓట్లు పోలరైజ్ అయిన తరుణంలో పార్టీల ముందు కన్పిస్తోన్న దారి ఇదే.
మైనింగ్‌ కేసుల వ్యవహారం ఈసారి యరపతనేనికిఎమ్మెల్యేకు ప్రతికూల అంశంగా మారింది. దానిని ఉపయోగించుకునేందుకు జగన్ పార్టీ వ్యూహాలు సిధ్దం చేసుకుంది

ఇక గురజాలకు దగ్గర్లోనే ఉన్న మరో పల్నాడు సీటు మాచర్ల..ముందుగా 1972లో ఇక్కడ నుంచే జూలకంటి నాగిరెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి తర్వాత గురజాలకి వెళ్లడం గమనించాలి. 1978, 1985, 2004, 2009ల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవగా.. 1983, 1989, 1994, 1999ల్లో టీడీపీ మాచర్ల సీటుని దక్కించుకుంది. 2012లో జరిగిన బై ఎలక్షన్..2014 ఎలక్షన్లలో వైఎస్సార్సీపీ తరపున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారు.. టిడిపి కూడా ఇదే కులానికి చెందిన నేతలను దింపబోతోంది. కొమ్మారెడ్డి చలమా రెడ్డి, జూలకంటి బ్రహ్మానంద రెడ్డిలు పోటీలో ఉన్నారు. జనసేన పార్టీకి పవన్ ఫాలోయింగే ఇక్కడ పెద్ద దిక్కుగా నిలవాలి.

 మంగళగిరి సీటు చూస్తే జిల్లాలో లెఫ్ట్ పార్టీలని గతంలో ఇక్కడి జనం బాగా ఆదరించారు.  1952, 1962ల్లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ, 1994లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం, 1955, 1967, 1989, 1999, 2004, 2009ల్లో కాంగ్రెస్‌ పార్టీ, 1983, 1985ల్లో తెలుగుదేశం పార్టీలు గెలిచాయ్.  అయితే 1978లో మాత్రం జనతాపార్టీ అభ్యర్ధి జీవీ పాతయ్య గెలుపొందారు. ప్రస్తుతం  ఆళ్ల రామకృష్ణా రెడ్డి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గంజి చిరంజీవి, కాండ్రు కమల పోటీపడుతున్నారు. ఈ కాండ్రు కమలకుమారి 2004, 2009లో చేనేత వర్గాలనుంచి గెలిచి..వైఎస్ ఫాలోయర్ గా బాగా పేరుతెచ్చుకున్నారు. ఆ తర్వాత జగన్ తో కొంతకాలం నడిచినా ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు.  రాజధాని పక్కనే ఉన్న నియోజకవర్గం కావడంతో పోటీ రసవత్తరంగానే ఉండబోతుంది. ఇక్కడ జనసేన వామపక్ష పార్టీలకు చెందిన కాండిడేట్‌కి మద్దతిస్తే..మంచి వ్యూహం కాగలదని  అంచనా

టిడిపి అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొనే స్థానం ఏదైనా ఉందంటే ఇది నరసరావుపేటనే..తాము చేసిన పనుల కంటే..చేయకూడని పనులతోనే ఇక్కడి టిడిపి పెద్దలపై జనంలో ఛీత్కారాలు ఎదురవుతున్నాయంటారు..డీ మానిటైజేషన్ సమయంలో ఇక్కడి నేతల వారసులు వ్యవహరించిన తీరు..ప్రతి పనిలో వాటాలు అడుగుతారనే ప్రచారం ఉంది..పైగా చివరికి ఇది ఏ స్థాయికి చేరిందంటే..తోపుడు బళ్ల దగ్గర కూడా రోజుకి ఇంత అని వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయ్. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ కాండిడేట్‌గా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్లీ తన గెలుపు ఖాయం అనుకుంటున్నారు..ఐతే కోడెల కొడుకు టిడిపి తరపున ఇక్కడ పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపధ్యంలో జనసేన తరపున నిలబడే అభ్యర్ధి సరైన దిశగా వ్యవహరించగలిగితే గెలుపు పెద్ద కష్టం కాబోదనే అంచనా ఉంది.

నరసరావుపేటకి సమీపంలోని మరో నియోజకవర్గం వినుకొండ...1989, 2004ల్లో కాంగ్రెస్‌ అభ్యర్దులు గెలుపొందగా, 1994లో స్వతంత్ర అభ్యర్ధి వీరపనేని యలమందా రావు గెలుపొందారు. 1999, 2009, 2014ల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక జగన్ పార్టీ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు బరిలో ఉండబోతున్నారు. ఇక్కడ కూడా జనసేనకి మంచి ఫాలోయింగే ఉంది.

 ఇక గుంటూరు జిల్లాలోనే అభివృధ్ది అనే పదానికి దూరమైన మరో నియోజకవర్గం పెదకూరపాడు..ఇక్కడ 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో అప్రతిహతంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ గెలుపొందారు. 2009, 2014ల్లో వరుసగా తెలుగుదేశం పార్టీకి చెందిన కొమ్మాలపాటి శ్రీధర్‌ గెలిచారు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మళ్లి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కి చెందిన కావటి శివనాగ మనోహర్‌ నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇతనికి కాంగ్రెస్, టిడిపిలోని పెద్ద స్థాయినేతలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఐతే గెలుపు వరకూ అవి ఎలా ఉపయోగపడతాయో చూడాలి..జనసేన కూడా తన అదృష్టం పరీక్షించుకోవాల్సిందే తప్ప..గెలుపుపై ఆశలు పెద్దగా పెట్టుకోవక్కర్లేదంటారు.

 పొన్నూరు అసెంబ్లి నుంచి కేవలం 1989లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చిట్టినేని వెంకట్రావు గెలుపొందారు. 1983, 1994, 1999,2004, 2009, 2014ల్లో వరుసగా  టీడీపీ గెలుస్తోంది. ఈసారి కూడా ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కాకుండా మరొకరికి ఇచ్చే అవకాశం లేదు..జగన్ పార్టీ నుంచి  రావి వెంకట రమణ పోటీకి రెడీ అవుతుండగా... సడన్‌గా మోదుగుల వేణుగోపాలరెడ్డి ఎంట్రీ కలకలం రేపుతోంది.. కాండిడేట్ ఆయనే అవుతారనే ప్రచారం జరుగుతోంది..ఇక జనసేన తరపున నాదెండ్ల మనోహర్ సూచించిన అభ్యర్ధినే దిగే అవకాశం కన్పిస్తోంది.

 పత్తిపాడు నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉంది. 1989, 1994, 1999ల్లో మాకినేని పెదరత్తయ్య వరుసగా తెలుగుదేశం శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2004, 2009ల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా ప్రస్తుతం మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన కాస్తా ఈసారి జనసేన తరపున బరిలో దిగుతున్నారు. టిడిపి తరపున మాజీ మంత్రి  డొక్కా మాణిక్యవరప్రసాద్ పోటీ చేయవచ్చంటున్నారు..జగన్ తన పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరితని నిలపబోతున్నారు. ఈమె 2012 బై ఎలక్షన్లలో వైఎస్సార్సీపీ తరపున గెలిచారు.

 తీరప్రాంతం రేపల్లె నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ 1962లో సీపీఐ, 1978లో సీపీఎం గెలవగా..1955, 1967, 1972,1983,1989, 2004, 2009ల్లో కాంగ్రెస్‌ గెలిచింది. 1985, 1994, 1999ల్లో టీడీపీ అభ్యర్దులు గెలుపొందారు. ప్రస్తుతం ఇక్కడ వైకాపా నుండి మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ బరిలో ఉన్నారు. ఇక్కడ రెండు పార్టీలకు సమాన బలం ఉంది. ప్రజల్లో ఎమ్మెల్యే పట్ల పెద్దగా అసంతృప్తి లేకపోయినప్పటికీ ఆయన అనుచరులపై మాత్రం మడ అడవుల ఆక్రమణ ఇసుక దందాల వంటి ఆరోపణలు ఉన్నాయి.  ఇక్కడ జనసేనకు మంచి బలం ఉందని చెప్తున్నారు. ఓ దశలో నటుడు సుమన్ పోటీ చేయవచ్చనే ప్రచారం జరిగింది.

 సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ శాసనసభ్యుడిగా ఉన్నారు. 1989, 2004, 2009ల్లో కాంగ్రెస్‌ పార్టీ, 1994లో సీపీఎం, 1999లో టీడీపీ గెలుపొందాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున అంబటి రాంబాబుకి తిరిగి టిక్కెట్ ఇస్తారో లేదో అనే సస్పెన్స్ కొనసాగుతోంది..ఇక్కడ జనసేనకి పార్టీకి మంచి ఫాలోయింగ్ తో పాటు నేతల దన్ను కూడా ఉండటంతో..జనసేన ఖాతా తెరవడం ఖాయమని ఆ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయ్.

 జిల్లాలో మరో ఎస్సీ నియోజకవర్గం తాడికొండ..రాజధాని ప్రాంతమైన ఇక్కడ 1989, 2004, 2009ల్లో కాంగ్రెస్‌ పార్టీ, 1994లో సీపీఐ గెలవగా..1999, 2014ల్లో తెలుగుదేశం జయకేతనం ఎగరవేసింది. ప్రస్తుతం ఇక్కడ తెనాలి శ్రవణ్ కుమార్‌ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయనపై క్యాడర్ అసంతృప్తిగా ఉందనే ప్రచారం జరుగుతోంది.. టీడీపీ నుండి శ్రవణ్‌ కుమార్‌‌కి టిక్కెట్ రాకపోతే..మాజీ మంత్రి పుష్పరాజ్ తనకి ఇవ్వాలని కోరుతున్నారు.  జేఆర్‌ పుష్పరాజ్‌లు టిక్కెట్టు ఆశిస్తున్నారు. జగన్ పార్టీ నుంచి  హెనీ క్రిస్టీనా కట్రా పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆశించిన విధంగా ప్రధానపార్టీల్లో టిక్కెట్ రాకపోతే జనసేనలోకి జంపవుదామనే ఆలోచనలోనూ ఇక్కడి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది
 ఆంధ్రా ప్యారిస్‌  తెనాలి సంగతి చూస్తే.. 1952, 1955, 1957, 1962, 1967, 1989, 2004, 2009ల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్దులు గెలుపొందారు. 1978లో మాత్రం జనతాపార్టీకి చెందిన దొడ్డపనేని ఇందిర గెలుపొందారు. 1983,1985,1994,1999,2014ల్లో టీడీపీ గెలుపొందింది. అంటే దాదాపుగా టిడిపి అదికారం చేపట్టిన ప్రతిసారీ..ఇక్కడ టిడిపి ఎమ్మెల్యే గెలుపు ఖాయంగా కన్పిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.2019లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి  అన్నాబత్తుని శివకుమార్‌ పోటీలో ఉండబోతున్నారు. జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌కి తెనాలిలో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు  మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌  జనసేన పార్టీలోచేరిన నేపద్యంలో ఆయన అక్కడ నుండి పోటీచేసే అవకాశం ఉంది. లేదంటే ఎంపిగా పోటీ చేసే అవకాశాలనూ కొట్టిపారేయలేం.  దీంతో త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
వాయిస్() వేమూరు నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వు నియోజకవర్గంగా ఉంది. ప్రస్తుతం  నక్కా ఆనంద బాబు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. 1962,1965,1978,1989,2004ల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందగా, 1967, 1972ల్లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధి యడ్లపాటి వెంకట్రావు గెలుపొందారు. 1983, 1985, 1994, 1999, 2009, 2014ల్లో టీడీపీ గెలుపొందుతూ వస్తోంది. జగన్ పార్టీ నుంచి తిరిగి డాక్టర్‌ మేరుగ నాగార్జున బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంద. ఇక్కడ కూడా జనసేనకు మంచి బలమైన కేడర్‌ ఉంది. తెనాలి తాలుకూ ఎఫెక్ట్ ఈ సీటుపై కూడా పడే అవకాశం ఉంది.
మొత్తం మీద కొత్తగా బరిలో దిగే జనసేనకి గుంటూరు జిల్లాలో సరైన కాండిడేట్లు దొరికి..పార్టీ అధినాయకత్వం ఏ తప్పిదాలు చేయకుండా ఉంటే..కనీసం 4-6సీట్లలో విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు..వాటిలో బాపట్ల, సత్తెనపల్లి, తెనాలి, చిలకలూరిపేట, గుంటూరు వన్ కన్పిస్తున్నాయ్.

Comments