డిగ్గీరాజాకి వద్దన్న సీటే ఇచ్చారు..70 ఏళ్ల వయసులో ఇదేం కష్టం


మధ్యప్రదేశ్ కాంగ్రెస్ దిగ్గజానికి కష్టాలు వచ్చి పడ్డాయ్. గత 30ఏళ్లలో కాంగ్రెస్ గెలవని భోపాల్ నుంచి దిగ్విజయ్ సింగ్ ని పోటీకి పెట్టడంతో డిగ్గీరాజా పెద్ద సవాలునే ఎదుర్కొంటున్నారు. ఈ ఎంపికకి ముందు కూడా పెద్ద డ్రామానే చోటు చేసుకుంది డిగ్గీరాజా పోటీ అంటూ చేయదలిస్తే..అది కష్టమైన సీటునుంచే పోటీ చేయాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాధ్ సవాల్ చేసారు.  దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ పదవీకాలం 2020 వరకూ ఉంది. పోటీ చేస్తే..మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గర్‌ నుంచి పోటీ చేయాలనుకున్నట్లు చెప్పారాయన. ఐతే ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు భోపాల్ నుంచి దిగకతప్పడంలేదు. దీనికి కారణం కమల్ నాధ్‌తో విబేధాలు కూడా కారణమంటారు.  మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత సిఎం రేసులో జ్యోతిరాదిత్య సింథియా ఉన్నా కూడా..డిగ్గీరాజా దౌత్యంతోనే కమల‌్‌నాధ్ కి ఆ పీఠం దక్కిందంటారు. ఐనా ఈ ఇద్దరి మధ్యా విబేధాలు ఎందుకు వచ్చాయో క్యాడర్‌కి అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు.

 భోపాల్‌లో కాంగ్రెస్ తరపున  చివరిసారిగా కెఎన్ ప్రధాన్ 1984లో విజయం సాధించారు. ఆ తర్వాత ఎప్పుడూ కాంగ్రెస్ ఇక్కడ గెలుపు రుచి చూడలేదు. 1989,1991, 1996,1998లో జరిగిన ఎన్నికలలో వరసగా నాలుగుసార్లు బిజెపి అభ్యర్ధి సుశీల్ చంద్రవర్మ విజయం సాధించారు. 1999లో బిజెపి నుంచి ఉమాభారతి ఇక్కడ అప్పటి మాజీ కేంద్రమంత్రి సురేష్ పచౌరీపై 168864 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. ఆ తర్వాత అంటే 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలోనూ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ 38మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికలలో 2004, 2009లో కైలాష్ జోషి బిజెపి తరపున గెలిచారు. 2014లో అలోక్ శర్మ 3,70,696 ఓట్ల రికార్డు మెజారిటీతో దక్కించుకున్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకతా గమనించవచ్చు..కాంగ్రెస్ ఎప్పుడూ వరసగా రెండోసారి ఒకే అభ్యర్ధిని పోటీకి పెట్టలేదు. భోపాల్ నియోజకవర్గ పరిధిలో 8 శాసనసభ సెగ్మెంట్లు ఉండగా..వాటిలో భోపాల్ నార్త్, సౌత్, సెంట్రల్ సీట్లను ఈ మధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకుంది. మిగిలిన ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లైన బెరాసియా, నారేలా, గోవిందపురా, హుజూర్, సేహోర్‌లో బిజెపి అభ్యర్ధులే గెలిచారు. ఈ నేపధ్యంలో భోపాల్ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ ఆయన రాజకీయజీవితానికి ఓ పరీక్షనే చెప్పాలి. ఐతే భోపాల్‌లో నాలుగున్నరలక్షల మైనార్టీ ఓటర్లు  ఉన్నారు..వీరంతా కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపితే..ఇదే బిజెపికి  మైనస్‌గా కన్పిస్తోన్న పాయింట్

 బలవంతంగా ఈ ఛాలెంజ్ స్వీకరించిన దిగ్విజయ్ సింగ్ మాత్రం తనకి సవాళ్లంటే ఇష్టమని... 1977లో జనతా పార్టీ ప్రభంజనం వీచినప్పటికీ.. రాంగఢ్‌ నుంచి గెలిచినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీ చెప్పిన స్థానంలో పోటీకి సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. బిజెపి కూడా పైపైన దిగ్విజయ్ సింగ్ అభ్యర్ధిత్వాన్ని తమషా చేస్తోంది..కాంగ్రెస్‌లోని వర్గపోరు కారణంగా..గెలవడని తెలిసీ ఇక్కడ్నుంచి ఆయన్ని దింపుతున్నట్లు ఎగతాళి చేస్తోంది

 కానీ భోపాల్ నుంచి దిగ్విజయ్ సింగ్ బరిలో ఉండటం ఖచ్చితంగా రాష్ట్రమంతా ప్రభావం చూపుతుందని లోలోన మథనపడుతోంది. ఎందుకంటే ఇది స్టేట్ కి హార్ట్ లాంటింది..ఇక్కడ డిగ్గీరాజా ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రచారం చేస్తుంటే..రాజధాని ప్రాంతం కావడం వలన మీడియా కవరేజీ అంతా ఇక్కడే ఉంటుంది. అందుకే సీటు విషయంలో ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాకపోయినా.. బిజెపి సిట్టింగ్ ఎంపి అలోక్ శర్మతో పాటు మాజీ సిఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ అభ్యర్ధిత్వాన్నీ పరిశీలిస్తోంది. ఓ వేళ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌కే సీటు ఇస్తే మాత్రం డిగ్గీరాజా కష్టాలు మరింత ఎక్కువ కావడం ఖాయంగా కన్పిస్తోంది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ డిగ్గీరాజా నేతృత్వంలోని కాంగ్రెస్‌ని మూడుసార్లు అసెంబ్లీ సమరంలో ఓడించిన చరిత్ర ఉంది. అంతేకాదు..దిగ్విజయ్ సింగ్ తమనేతలను దువ్వకుండా అలర్టైంది.   మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్‌ తన గురువైన దిగ్విజయ్ సింగ్ టెంట్‌లో చేరిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ఇప్పటిదాకా మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి లేనంత ప్రాముఖ్యత సడన్‌గా భోపాల్‌కి వచ్చింది

Comments