శబరిమలై జ్యోతే బిజెపికి కేరళలో దారి చూపుతుందా..లేక గుండు సున్నా కొడుతుందా..


కేరళ ఎన్నికలలో  పోటీ ఎప్పుడూ సిపిఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్యే ఉంటోంది. ఈ రెండింటి మధ్యలో ఎన్డీఏ పాత్ర చాలా తక్కువ. నాయర్, క్రిస్టియన్ వర్గాల
మద్దతు సంప్రదాయంగా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కి లభిస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా ఇక్కడి హిందూ కమ్యూనిటీని శబరిమలై విషయం బాగా కదిలించింది. అందుకే ఇందులోనుంచి వీలైనంత లాభం పొందేందుకు..కేరళలో బోణీ కొట్టేందుకు బిజెపి బాగా ప్రయత్నిస్తోంది.. ఇందుకోసమే బిజెపి శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలను హింసాత్మకంగా మార్చిందనే వాదన ఉంది.

 దీనికి విరుగుడుగా సిపిఎం ఆధ్వర్యంలోని ప్రభుత్వం పోలీస్ యాక్షన్‌ని అంతే గట్టిగా అమలు చేసింది. యునైడెట్ డెమోక్రటిక్ ఫ్రంట్ మాత్రం మహిళల ప్రవేశమనేది మతపరమైన అంశంతో కూడి ఉన్నదని..కోర్టు తీర్పు బలవంతంగా అమలు కాకూడదంటూ కర్రవిరగని..పాము చావని స్టాండ్ తీసుకుంది. యూడిఎఫ్ కి మద్దతిచ్చే నాయర్ సర్వీస్ సొసైటీ కూడా ఆందోళనలకు దూరంగా ఉండటం గమనార్హం. ఎల్డీఎఫ్ కూడా ఇదే అంశంలో తామూ లాభం పొందేందుకు దీన్నో సంస్కరణగా ప్రచారం చేసుకుంది. లక్షలాది మహిళలతో మానవహారం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బిజెపి పథనంతిట్ట నుంచి తమ పార్టీ జనరల్ సెక్రటరీ కే సురేంద్రన్ ని నిలబెట్టింది. కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొని జైలుశిక్ష అనుభవించడమే ఆయన ఇక్కడ్నుంచి పోటీకి దింపడానికి అర్హత అంటే అతిశయోక్తి కాదు. సిపిఎం కూడా దీనికి ధీటుగా వీణా జార్జ్ ని ఇక్కడ రంగంలో నిలిపింది. హిందువుల ఓట్లని ఈమె కొల్లగొడుతుందనే అంచనాలో ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్లాన్ వర్కౌట్ అవడమే ఇందుకు కారణం. ఇక యూడిఎఫ్ మాత్రం తన పాత పద్దతికే కట్టుబడి కాంగ్రెస్ నుంచి ఆఁటోనిని బరిలో నిలిపింది. దీంతో ఇక్కడ్నుంచి బిజెపి బోణీ కొట్టే వ్యూహం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి

 ఇక ఇప్పుడు సీట్లు..ఓట్ల లెక్కలు చూద్దాం.. మొత్తం 20 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న కేరళలో 2014 ఎన్నికలలో యూడిఎఫ్ 42.08 శాతం ఓట్లతో 12 గెలవగా..ఎల్డీఎఫ్ 40.23శాతం ఓట్లతో  8  ఎఁపీసీట్లనుగెలుచుకుంది..అదే 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం 140 శాసనసభ నియోజకవర్గాలలో ఎల్డీఎఫ్ 91సీట్లు, యూడిఎఫ్ 47 సీట్లకు పరిమితం కాగా..బిజెపికి మాత్రం ఒక్క సీటు దక్కింది.  యూడీఎఫ్ ఓట్ షేర్ 38.81శాతానికి పడిపోగా..ఎల్డీఎఫ్ మాత్రం 43.48శాతానికి పెంచుకుంది. పోటీ ఎంత హోరాహోరీగా ఉన్నా...ఓట్లశాతంలో మాత్రం పెద్దగా తేడా ఉండదని తెలుస్తోంది. ఐతే ఈ ఎన్నికలలో ఢిల్లీ స్థాయిలో బిజెపిని ఓడించాలనే ఉమ్మడి ధ్యేయంతో పని చేస్తోన్న కాంగ్రెస్, సిపిఎం రాష్ట్రంలోనూ కొన్ని కీలక స్థానాలలో లోపాయికారీ ఒప్పందాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎక్కడైతే బిజెపి ఓట్ షేర్ పెరుగుతుందని భావిస్తున్నారో..ఆ స్థానాల్లో సిపిఎం, కాంగ్రెస్ అభ్యర్ధులు ఎవరో ఒకరికి రెండు పార్టీలు సహకరించుకునేలా డీల్ కుదిరిందట..అలప్పుజా జిల్లాలోని మావెలిక్కర రిజర్వ్ డ్ నియోజకవర్గం..ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ కోడికున్నిల్ సురేష్ మూడోసారి పోటీ చేయబోతున్నారు. ఐతే ఇక్కడ సురేష్ పట్ల జనంలో వ్యతిరేకత వస్తోంది. అందుకే తనపై గట్టి పోటీ ఇచ్చే  పున్నాల శ్రీకుమార్ అనే అభ్యర్ధిని దింపవద్దని ఇప్పటికే సిపిఎంకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. వీటికి తోడు ఇటీవలే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముళ్లపల్లి రామచంద్రన్ కూడా ఎల్డీఎఫ్్‌తో పొత్తు పెట్టుకునేందుకు కూడా సిధ్దమని ప్రకటించడం గమనించాలి. అంటే రాష్ట్రస్థాయిలో పోరు ఉన్నా..పార్లమెంట్ స్థాయిలో మాత్రం కుదిరితే స్నేహం చేసేందుకు కూడా ఎల్డీఎఫ్, యూడిఎఫ్ సిధ్దమవుతున్న విషయం గుర్తుంచుకోవాలి..అందుకే ఇక్కడ బిజెపికి ఖాతా ఓపెన్ చేయడమన్నది అంత సులభం కాదని అంటున్నారు

Comments