లక్ష్మీ సరస్వతులు నిజంగానే ఒక్క చోట ఉండలేరా..? ఆటో తోలుకుంటూ బతుకుతున్న లెక్చరర్: జాలి పడొద్దు కథ అక్కడితో ఐపోలేదు!

 



అనగనగా ఓ ఆటో


కర్నాటకలో ఆ ఆటో ఎక్కేవారికి ఓ పెద్దాయన ఎక్స్‌లెంట్ ఇంగ్లీష్‌తో స్వాగతం పలుకుతారు. 

 Please come in Ma'am or Sir..ఇలా


తన ఆటోలో ఎక్కించుకుని వారు ఎంత ఇస్తే అంత తీసుకునే ఆయన పేరు పట్టాభి రామన్. ఇంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆటో ఎందుకు తోలుతున్నారంటే..అప్పుడు తెలుస్తుంది అసలు కథ, కర్నాటకకు ఈయన వచ్చి పద్నాలుగేళ్లు. అంతకి ముందు ముంబైలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశారట. అది కూడా 20ఏళ్లు. మరిప్పుడు ఇలా ఆటో డ్రైవర్ అవతారమెత్తడం ఎందుకు అంటే..? ఉదరపోషణార్ధం


పట్టాభి రామన్ గురించి ప్రపంచానికి (కనీసం నెటిజన్లకు) ఎక్కువగా తెలిసిందెప్పుడంటే, నికితా అయ్యర్ అనే లేడీ ఈయన ఆటో ఎక్కగా ఆయన గురించి తెలుసుకోవడం  తటస్థించింది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అసలు అర్ధం తెలియాలని, లింక్డ్ ఇన్‌లో ఈయన గురించి పోస్ట్ చేసింది


ఇక పట్టాభి రామన్, కర్నాటక నుంచి ముంబై ఎందుకు వెళ్లారంటే, ఇక్కడసలు ఉద్యోగాలే దొరకలేదని చెప్తారాయన. ఎక్కడకు వెళ్లినా, మీ కులం  ఏంటని అడిగేవారట. అలా చివరకు ఆయన ప్రయాణం ముంబైలో ఓ కొలిక్కి వచ్చి ఇంగ్లీష్ లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. ఐతే తన 60వ ఏట తిరిగి అదే ఉద్యోగ వేటలో మళ్లీ కర్నాటకకు వచ్చి ఆటో డ్రైవర్‌గా మారారు


ఐతే బతకలేక బడిపంతులనే సామెత ఇప్పటికీ ప్రవేట్ లెక్చరర్లకు వర్తిస్తుంది కాబట్టి, ఆటో తోలుకుంటా రోజుకు రూ.750-1500 వరకూ సంపాదిస్తున్నట్లు గర్వంగా చెప్తారు పట్టాభిరామన్. ఈ డబ్బు తనకి, తన గాళ్ ఫ్రెండ్‌కీ సరిపోతుందని హాయిగా నవ్వేస్తారాయన. ఇంతకీ 

గాళ్ ఫ్రెండ్ ఎవరంటే ఆయన భార్యేనట. బెంగళూరులోని కాడుగోడిలో నివాసముంటున్న ఆయన ఇంటి అద్దె రూ.12000. ఈ డబ్బు  వాళ్ల  కొడుకు ఇస్తుండగా మిగిలిన ఖర్చులకు మాత్రం ఆటో సవారీతో సంపాదిస్తున్నారట. 


" ఇప్పుడు నా రోడ్డుపై నేనే రాజును..ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆటో తీస్తా..లేదంటే మానేస్తా " అంటూ గర్వంగా పట్టాభి రామన్ చెప్తారు


ఈ మొత్తం ఎపిసోడ్ గమనిస్తే..అంత విజ్ఞానం ఉండి ఆటో తోలడం ఏంటనే జాలి పడటం వృధా అనిపిస్తుంది. ఎందుకంటే, నిలువుజీతానికి అన్నట్లుగా లెక్చరర్ ఉద్యోగం చేసే కంటే, ఇలా తన జీవితానికి తానే రాజులా బతకడంలోనే సంతృప్తి ఉందనకతప్పదు. లాక్‌డౌన్ టైమ్‌లో నారాయణ, చైతన్య సహా అనేక కాలేజీ ఖార్ఖానాల్లో

చాలామంది లెక్చరర్లు, టీచర్లు ఇలానే ఉద్యోగాలు ఊడి..చెప్పుల దుకాణాలు, ఇడ్లీ హోటళ్లు, తోపుడు బళ్లు పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాదు

ఇవే చాలా హాయిగా ఉన్నాయని కూడా చెప్పుకురావడం గుర్తుండే ఉంటుంది. 


ఐనా సరే..సరస్వతీపుత్రులకు లక్ష్మీ కటాక్షం పెద్దగా ఉండదనే నానుడి ఎటూ ఉండనే ఉన్నది

















Comments