కృష్ణంరాజాయన ! రెబల్ స్టార్ ఎప్పటికీ రెబల్ స్టారే

 



 పేరులోనే కాదు జీవితంలోనూ రాజులానే బతికాడని శ్రీఉప్పలపాటి వెంకట చిన కృష్ణంరాజుకి పేరు ఫోటో గ్రాఫర్‌గా ఉన్న రోజుల్లోనే హీరో మెటీరియల్ అని పేరు తెచ్చుకుని సినిమాల కోసమని మద్రాస్‌కి చేరాడంటారు. సాటి తారలు కృష్ణ, శోభన్ బాబు, హేమమాలినితో పాటు కాటికివెళ్లినా అనే నాటకంలో ఓ పాత్ర పోషించారు. అలానే తేనెమనసులు కోసం మేకప్ టెస్ట్ కూడా జరిగిందట


నటనపై ఉన్న ఆసక్తితో అప్పటి సూపర్‌స్టార్ ఎన్టీఆర్‌ని కలవగా, స్ఫురద్రూపి మీరు రాజసం ఉట్టిపుడుతుంది చిన్న చితకా క్యారెక్టర్లు వద్దని చెప్పి పంపారట. ఈ క్రమంలోనే 1966లో ప్రత్యగాత్మగారు తీసిన చిలకా గోరింకలో హీరోగా ప్రవేశించిన కృష్ణంరాజు గారి చివరి సినిమా రాధేశ్యామ్. ఈ తరం కుర్రాళ్లకి కృష్ణంరాజంటే ప్రభాస్ పెదనాన్నగానే తెలుసు. ఎందుకంటే ఆయన ఇరవైఏళ్లుగా పెద్దగా నటించిందేం లేదు కాబట్టి..!


కానీ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకించి తెలుగు చలనచిత్రరంగంలో మొదటిగా లక్ష రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న వి.నాగయ్య గారి తర్వాత వచ్చిన జగ్గయ్య,ఎన్టీఆర్,ఏఎన్ఆర్ తర్వాతి తరం హీరోల్లో కృష్ణంరాజు కూడా ఒకరు

పర్సనాలిటీ భారీగా ఉండటంతో రెగ్యులర్ డ్యాన్సులు ఫైట్లు పెద్దగా నప్పేవి కావు. ఓ వైపు కాంతారావ్ గారు జానపదం ఎన్‌టిఆర్ పౌరాణికం, ఏఎన్ఆర్ సాంఘికంలో దున్నిపారేస్తున్న సమయంలో వచ్చిపడిన కెరటాలు కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు. మరి ఆయనకి తగిన పాత్రలంటే కొన్నిటికే మడి కట్టుకోకుండా విలన్ పాత్రల్లోనూ రాణించారు. ఐనా సరే హీరో అంటే ఉంటే క్రేజ్ వేరు కాబట్టే, సొంతంగా నిర్మాణ సంస్థలు ప్రారంభించారు అప్పటి నటులు. అందులో భాగంగానే కృష్ణంరాజు తమ్ముడుతో కలిసి గోపీకృష్ణా కంబైన్స్ ప్రారంభించారు. 

కృష్ణవేణి, మనఊరి పాండవులు(జయకృష్ణతో కలిసి) అమరదీపం,భక్త కన్నప్ప, మాఇఁటి మహారాజు యమధర్మరాజు, నేటి యుగధర్మం, మధురస్వప్నం, గువ్వల జంట, శివమెత్తిన సత్యం, కోటికొక్కడు, తాండ్రపాపారాయుడు, నిర్మించగా, చివరికి ప్రభాస్ హీరోగా బిల్లా రీమేక్ చేసారు.  ఇవే కాకుండా ఆయన సినిమాల్లో  ,బొబ్బిలి బ్రహ్మన్న, సీతారాములు, ఆడాళ్లూ మీకు జోహార్లు, రారాజు, పులిబిడ్డ, బెబ్బులి, ప్రేమతరంగాలు రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య, , భగవాన్, బావ బావమరిది,అంతిమ తీర్పు ఎన్నదగినవి.. ఇక కెరీర్ దాదాపు ముగిసిన తర్వాత కాస్తో కూస్తో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో చండి, ఎవడే సుబ్రహ్మణ్యం, రాధేశ్యామ్ చేరుతాయ్


సినిమాలో రెండు గంటలు ప్రతినాయక పాత్రలో ఉండి చివరిలో పరివర్తన తెచ్చుకునే క్యారెక్టర్ల‌లో కృష్ణంరాజు చక్కగా అమరిపోవడంతో 1970ల మధ్యభాగం వరకూ ఆయన హీరోతో పాటు సైడ్ హీరో, సెకండ్ హీరో క్యారెక్టర్లు కూడా చేసారు. 1976-1987 వరకూ పూర్తిగా హీరోగా టర్న్ అయి మంచి హిట్స్ సాధించారు. బొబ్బిలి బ్రహ్మన్న ఇండస్ట్రీ హిట్ అయితే, ఆ తర్వాత శంకరాభరణంలో శంకరశాస్త్రి క్యారెక్టర్‌ కూడా ఆయన్నే చేయమన్నారట. కానీ అందుకు తిరస్కరించడం తెలుగు చలనచిత్రపరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్ సినిమా రావడానికి కారణమైంది.ఆ తర్వాత కాలానుగుణంగా కార్మికనాయకుడు, సమాజంపై తిరుగుబాటు చేసే పాత్రలను పోషిస్తూ రెబల్ స్టార్‌గా గుర్తింపు పొందారు


ఇతర హీరోలతో అరమరికలు లేకుండా ఉండటంతో పాటుగా, ప్రొడ్యూసర్ నుంచి కారు వచ్చినా వద్దని సొంతంగా తన కారులోనే వెళ్లేవారాయన. అలానే దానికి పెట్రోల్ కూడా సొంతంగా భరించేవారట. ఇందులో గొప్పేముందనుకోకండి..అంతవరకూ , ఆ తర్వాత కూడా చాలామంది హీరోలు తమ సొంతకార్లలో షూటింగ్‌కి వచ్చినా పెట్రోల్ ఖర్చు మాత్రం ప్రొడ్యూసర్లకే పంపేవారట. ఇక ఆయన ఆభిజాత్యంతో బాధపడి, ఆర్థికంగా చితికిపోయిన బాపురమణ గురించి చెప్పుకోవాల్సిందే. హిందీలో తీసిన ఓ సినిమాకి ముళ్లపూడి రమణ ఫైనాన్షియర్లకి గ్యారంటీగా ఉండటంతో..ఫ్లాప్ అయిన ఆ సినిమా తాలుకూ నష్టాలు రమణనెత్తిపైనే పడ్డాయట. వాటి గురించి రమణగారు అడిగినందుకు చీవాట్లు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయ్. దీంతో చేసేది లేక రమణగారే తన ఇల్లు అమ్మేసి ఆ డబ్బు కట్టారట. స్వయంగా రచయిత్రి కే.రామలక్ష్మిగారు ఈ విషయాన్ని ఇప్పటికీ చెప్తారు. మనిషి చనిపోయిన సందర్భంలో కేవలం మంచి మాత్రమే చెప్తామంటే కుదరదు. ఎందుకంటే  ఇకపై కృష్ణంరాజు గారి గురించి మనం ప్రస్తావించుకోబోయేది లేదు కదా..!


నలుగురు అగ్రహీరోల తర్వాత విన్పించే కృష్ణంరాజు గారి పేరుతో మిమిక్రీ చేయడం అనేది దాదాపు శాటిలైట్ ఛానల్స్ వచ్చే వరకూ ఎక్కడా లేదు.ఎందుకంటే ఓ పెక్యులియర్ వాయిస్ ఆయనది..అంత తొందరగా ఇప్పటికీ కూడా ఆయన్ని ఇమిటేట్ చేసేవాళ్లు చాలా తక్కువ


కుటుంబం విషయానికి వస్తే, 1995,1996 మధ్యలో అనుకుంటా ఆయన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారి పద్దతి ప్రకారం చనిపోయిన భార్య సోదరినే రెండో వివాహం చేసుకున్నారు కృష్ణంరాజు. అలా శ్యామలదేవి ద్వారా ఆయనకు ముగ్గురు కుమార్తెలు కలిగారు. అప్పటిదాకా ఆయనకి సంతానం లేదు. అలా చాలా లేటు వయసులో తండ్రి అయిన కృష్ణంరాజుగారు ఆ మధురిమను చాలా ఆస్వాదించినట్లు బోలెడు సందర్భాల్లో స్వయంగా చెప్పుకున్నారు. తమ్ముడు సూర్యనారాయణరాజు సంతానం అయిన ప్రభాస్‌ని హీరో చేయడంలో కృష్ణంరాజుగారి పట్టుదలే ఎక్కువ. తన వారసుడిగా ఓ గొప్ప స్థానానికి ప్రభాస్‌ని తీసుకెళ్లాలనుకున్నారు అలానే అది చూసారు కూడా..! ఇక ఆయన సొంతంగా విశాలనేత్రాలు అనే ఓ నవలని సినిమాగా చేయాలని చాలా తపించారు. కుదరకపోతే, ప్రభాస్‌తో తీయాలని అనుకున్నారు. అది తీరలేదు


నటన నుంచి విరామం తీసుకున్నా..తాత తండ్రుల నుంచి వచ్చిన వారసత్వపు వైద్యం ఒకటి కంటిన్యూ చేసేవారాయన. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని చెప్పారు. పచ్చకామెర్లతోపాటు, ఉబ్బసానికి కూడా సొంతంగా చాలామందికి వైద్యం చేసేవారట


పొలిటికల్‌గా సాటి నటుడు మిత్రుడు కృష్ణతో కలిసి 1991లో కాంగ్రెస్ నుంచి ఎంపిగా గెలిచారు కృష్ణంరాజు. తర్వాత వాజ్‌పేయిపై అభిమానంతో 1998లో బిజెపి నుంచి పోటీ చేసి గెలిచారు. కేంద్రమంత్రిగా పని చేసారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి చిరంజీవికి అండగా ఉన్నారు. ఐతే అక్కడ ఓటమిపాలవడంతో ఇక దాదాపు రాజకీయాలకు దూరమయ్యారు. ఐతే 2014 తర్వాత బిజెపి హవా ఓ రేంజ్‌కి చేరడం, ప్రభాస్ అగ్రహీరోల స్థాయికి చేరుకోవడంతో కృష్ణంరాజులో తిరిగి రాజకీయ ఆసక్తి ప్రారంభమైంది. బిజెపి ఆయన్ని ఏదోక రాష్ట్రానికి గవర్నర్‌గా పంపుతుందనే ప్రచారం సాగింది.కరోనా తర్వాత రిలీజైన రాథేశ్యామ్‌లో ఓ చిన్నపాత్రలో కన్పించినా ఆయన ఫ్యాన్స్‌కి ఆనందం మిగిల్చారు.


పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు వృద్ధాప్యం కూడా కృష్ణంరాజుని కృంగదీసి ఉండొచ్చు..ఏదెలా ఉన్నా..ఇక ఆయన మాట మనకి విన్పించదు ఆయనా కన్పించడు..రెబల్ స్టార్ ఎప్పటికీ రెబల్ స్టారే..!


Comments