మెగా ఫ్యామిలీకి అవార్డులొస్తే చాలా..! అప్పుడు లెవలైపోద్దా..? కొలమానం కాదు కులమానమా అప్పుడే సమానమా ?


వచ్చేశారు..బైటికి వచ్చేశారు..పూర్తిగా బైటికి వచ్చేశారు..ఒకరు ఓ వర్గానికే ఎందుకు అవార్డులిస్తారని..మరొకరు ఇవి సైకిల్ అవార్డులని..ఇంకొకరు.." ఆయ్! మావోడు స్టార్ హీరో..అట్టాంటోడికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డ్ ఏంటి" అంటూ మొత్తంగా బైటపెట్టేశారు..ఈ వరస ఇప్పట్లో ఆగదు..ఇంకా బైటికి వస్తారు..ఐతే నిజంగా వీళ్లంతా అవార్డుల ఎంపిక పద్దతిపై కాకుండా తమ హీరోలకు..తమ వర్గానికి అవార్డులు దక్కలేదని నిస్సిగ్గుగా బైట పడటమే ఏడవాల్సిన పరిస్థితి..ఎందుకంటే ముందే ఇంకో పోస్ట్‌లో చెప్పినట్లు, ఈ పురస్కారాలు ఎవడి సొత్తూ కాదు..కేవలం మన డబ్బుతో ఇచ్చే పురస్కారాలు..

ఇందులో నిజంగా అందరికీ న్యాయం అనేది దేవతావస్త్రాల్లాంటిదే..! ఐతే కనీసం ఓ పది అవార్డులైనా సరిగా ఇస్తే..మిగిలినవి పంచుకున్నా ఎవడూ పట్టించుకోడు..పైగా నంది అవార్డుల పేరుతో ప్రోత్సాహక బహుమతే దక్కుతుంది తప్ప దాంతో కోట్లకి కోట్లు..కోటలు ఏం కట్టుకోరు. ఐతే ప్రభుత్వం తరపున అవార్డులు దక్కితే తక్కువ ఖర్చుతో సినిమాలు తీసిన వారికి కాస్తంత  ఆర్దికంగా భరోసా..ఆయా సినిమాలు ఎవరూ కొనకపోయినా..దూరదర్శన్ వాటిని ఓ పాతికలక్షలకైనా కొంటుంది. కోట్లకి కోట్లు వెనకేసుకున్న నిర్మాతలకు దర్శకులకు నిజంగా ఈ అవార్డులు భుజకీర్తులే తప్ప వారికి ఈ బహుమతి పూచికపుల్లతో సమానం. ఐనా ఇప్పుడిల్లా రెచ్చిపోతున్నారంటే..కీర్తికండూతి తప్ప ఇంకోటి కాదు

గతంలోనూ ఇలానే 1994,95లో అనుకుంటా, జైలరుగారి అబ్బాయి అని ఓ సినిమా వచ్చింది.అందులో  కృష్ణంరాజు, జగపతి బాబు, జయసుధ ( అనుకుంటా) రమ్యకృష్ణ యాక్ట్ చేసారందులో..ఆ సినిమాకి గానూ..కృష్ణంరాజుకి ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా అవార్డ్ ప్రకటించారు..హే..నేనేంటి నాకు క్యారెక్టర్ అవార్డ్ ఏంటంటూ ఆయనా అసహనం ప్రదర్శించాడు.. ఐనా ఆ సినిమాలో ఏ పాత్ర చేస్తే ఆ పాత్రకే ఇస్తారు తప్ప..నేను హీరోని..కాబట్టి నాకు హీరో అవార్డే ఇవ్వాలంటే కుదరదు..ఇది ఓ కోణం.

అసలు గుణశేఖర్‌కి  పోయిన కోట్లు పోగా..ఓ లక్షరూపాయల అవార్డ్ కోసం ఇలా దేబిరించడమే ఆశ్చర్యం కలిగిస్తోంది..బహుశా ఇది ఎన్నాళ్లనుంచో దాక్కుని ఉన్న అసంతృప్తి అయొండొచ్చు..! ఇక స్టోరీ అసలు కోణానికి వస్తే..కేవలం మెగా ఫ్యామిలీకి ఇంకో నాలుగు అవార్డులు వస్తే అంతా హ్యాపీనా..! వీళ్ల దృష్టిలో అదే సరైనదిలా ఉంది..ఎందుకంటే...కొలమానం కంటే..కులమానమే ప్రధానంగా మాట్లాడుతున్నవీళ్ల తీరు చూస్తే అసహ్యం కలగకమానదు.

 ప్రకటించిన మూడేళ్ల అవార్డులే చూస్తే ఇంకా బోలెడన్ని సినిమాలు మంచి ప్రతిభ కనబరిచినవి ఉన్నాయ్ మచ్చుకి 2016 చూస్తే కృష్ణగాడి వీర ప్రేమ గాధ, క్షణం, మనమంతా, నందిని నర్సింగ్ హోమ్, ఎక్కడకి పోతావు చిన్నవాడా  ఈసినిమాలు చూడండి ఎన్ని కేటగరీల్లో అవార్డులు ఇవ్వొచ్చా..! ఇక 2015 విషయం చూస్తే,
సూర్య వర్సెస్ సూర్య, కేరింత, పటాస్..2014లో రౌడీ , దేవస్థానం, అలాఎలా ఇలా చూస్తే పోతే...చాలా సినిమాలు అర్హమైనవే..కానీ ఇచ్చిన లిస్టు చూస్తే జ్యూరీకి ఇవేం కన్పించలేదు. కానీ దీనిపై జరుగుతున్న దుమారమే..ఏదో మెగా ఫ్యామిలీకి నాలుగు వస్తే చాలు..సెట్ రైట్ అయిపోద్దన్నట్లుగా మాట్లాడటం మాత్రం అన్యాయం

Comments