సుప్రీంకోర్టు జడ్జీలే రోడ్డెక్కారు..అసలు కారణం తెలుసా?


దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అత్యున్నత న్యాయస్థానం జడ్జిలు మీడియా ముందుకు వచ్చి న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐతే వాళ్లు చెప్పినట్లుగా ఆ అసంతృప్తి ఒక్క వ్యవహారానికే ముడిపెట్టుకున్నా..అదో సంచలనమే. రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు నిబద్దతను కాపాడాల్సిందిగా సాక్షాత్తూ ప్రధానన్యాయమూర్తికే తాము చెప్పినా సమస్య పరిష్కారం కాలేదని, అందుకే తాము మీడియా ముందుకు వచ్చినట్లుగా వాళ్లు చెప్పడం విశేషం. సుప్రీంకోర్టు  జడ్జిలు జాస్తి చెలమేశ్వర్, రంజన్ గొగొయ్
జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ నలుగురు జడ్జిలు ఇవాళ మధ్యాహ్నం 12.15నిమిషాలకు మీడియా ముందుకు వచ్చి 2 నెలలుగా సుప్రీంకోర్టు నడుస్తున్న తీరు సరిగా లేదని..ఈ విషయంపై ప్రధానన్యాయమూర్తిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు.  భవిష్యత్తులో తమ విధినిర్వహణను వేరెవరూ తప్పుబట్టకూడదనే ఇలా చేస్తున్నట్లు కూడా జస్టిస్ చెలమేశ్వర్ చెప్పారు.

స్థూలంగా చూస్తే ఎన్‌డిఏ-2 హయాం ప్రారంభమైన నాటి నుంచి ప్రతి అంశంలో తనదైన ముద్ర వేసేందుకు తాపత్రయం స్పష్టంగా కన్పిస్తూ వచ్చింది. ప్రణాళిక కమిషన్ రద్దుచేయడం నోట్ల రద్దు చేయడం, బడ్జెట్ సంవత్సరాలను మార్చడం, రైల్వే బడ్జెట్ రద్దు, వర్సిటీల్లో కొత్త విద్యా విధానం కోసం తాపత్రయం ఇలా..ప్రతి అంశంలో తన ముద్ర వేసేందుకు మోడీ ప్రయత్నించారనేది నిజం. వీటిలో ఫలితాలు ఏ మేరకు వచ్చాయనేది పక్కనబెడితే, కాంగ్రెస్ పాలనకు తమ పాలనకు తేడా కన్పించాలంటే రద్దు మార్గమే ఆయనకి శరణ్యంగా కన్పించిందనుకోవచ్చు. ఐతే ఈ దశలో సామాన్యులను పరిగణించకపోవడం కూడా గమనార్హం. పైన చెప్పుకున్న అంశాలతో పాటు కొలీజియం రద్దుకి సిఫార్సు చేయడంతోనే న్యాయవ్యవస్థతో పార్లమెంటరీ వ్యవస్థకి అగాధం ఏర్పడింది. ఎవరి అధికారాలు ఎవరు లాక్కుంటున్నారనే ధోరణి పెరిగిపోయింది. ఈ వివాదం నడుస్తుండగానే..ఇప్పుడు న్యాయమూర్తులు రోడ్డుపైకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమనే అరుదైన సంఘటన చోటు చేసుకుంది. న్యాయమూర్తులు లేవనెత్తిన అంశానికి మోడీ రాజకీయజీవితానికి కూడా దగ్గర సంబంధం ఉన్నట్లు కన్పించడం ఈ కేసులో వైచిత్రి. సోహ్రబుద్దీన్ అనే వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేయగా..ఆ కేసుని జస్టిస్ బిహెచ్  లోయా విచారించారు. ఆ న్యాయమూర్తి  డిసెంబర్ 1,2014న గుండెపోటుతో చనిపోయినట్లు నమోదైంది. ఇది జరిగిన మూడేళ్లకి అంటే 2017 నవంబర్ లో లోయా సోదరి ఆయన మృతిపై సందేహాలు వ్యక్తం చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సోహ్రాబుద్దీన్ కేసుకి సంబంధించిన విచారణ తీరే ఆయన మృతికి కారణమనే రీతిలో ఆ సందేహాలు వ్యక్తమయ్యాయ్. ఇక అక్కడ్నుంచీ కథలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయ్. మహారాష్ట్రకి చెందిన ఓ జర్నలిస్ట్ ఈ వ్యవహారంపై పిల్ దాఖలు చేయగా..సుప్రీంకోర్టు బెంచ్ దాన్ని విచారణకు స్వీకరించింది. ఈ దశలోనే నలుగురు న్యాయమూర్తులు మీడియా సమావేశం పెట్టారు.  ప్రముఖంగా జస్టిస్ లోయా మృతి కేసుకి సంబంధించిన విచారణ తీరుపై పరోక్షంగా అసంతృప్తి వెళ్లగక్కారు.అసలు సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసు ఏంటి..దానికి ఉన్న రాజకీయప్రాధాన్యం ఏంటి..ఇప్పుడు చూద్దాం

మధ్యప్రదేశ్‌కి చెందిన సొహ్రాబుద్దీన్ షేక్ అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్న ఓ టెర్రరిస్ట్. ఐఎస్ఐ, లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్న  గుజరాత్, మధ్యప్రదేశ్‌లో స్థానిక వ్యాపారులనుంచి బలవంతంగా డబ్బు వసూళ్లు, హత్యలు వంటి అనేక కేసులు సొహ్రాబుద్దీన్‌పై ఉన్నాయి. సొహ్రాబుద్దీన్ గుజరాత్‌లోని అప్పటి అధికారపక్షనేతల్లో పెద్దతలకాయలను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినా ఆ పెద్దతలకాయలు అప్పటి గుజరాత్ సిఎం నరేంద్రమోడి, హోంమంత్రి అమిత్‌షా. నవంబర్ 26,2005న అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్‌షా ప్రోద్బలంతో సోహ్రాబుద్దీన్‌ని ఫేక్ ఎన్‌కౌంటర్‌లో చంపినట్లు ఆరోపణలు వచ్చాయ్. అసలు ఈ సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కాబడిన విషయం కూడా చాలా నాటకీయంగా బైటికి వచ్చింది. నవంబర్ 23, 2005న హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని సంగ్లికి ఓ బస్సులో ప్రయాణిస్తున్న సోహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్‌బీని పోలీసులు పట్టుకున్నారు. తెల్లవారుఝామున 1.30కి గుజరాత్ యంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీరిద్దరిని అదుపులోకి తీసుకుని..కౌసర్‌బీని అహ్మదాబాద్‌కి తరలించారు. మూడు రోజుల తర్వాత అహ్మదాబాద్‌లోని విశాల సర్కిల్ దగ్గర సొహ్రాబుద్దీన్‌ని ఎన్‌కౌంటర్‌లో చంపినట్లు తెలుస్తోంది సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ జరిగిన రెండు రోజులకు కౌసర్‌బీని రేప్ చేసి చంపేసి గుజరాత్‌లోని ల్లాల్ అనే ఏరియాలో పూడ్చిపెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయ్. ఈ విషయాలు సుప్రీంకోర్టు ముందు గుజరాత్ స్టేట్ అటార్నీ అంగీకరించినట్లు సమాచారం. ఐతే ఈ విషయాలన్నీ పైన చెప్పిన రోజుల్లో తెలియలేదు..

సొహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఓ ఎంక్వైరీ జరగగా..ఏప్రిల్ 2007లో గుజరాత్ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. జులై 2010లో ఇదే కేసులో అమిత్ షాను అరెస్ట్ చేయడం కూడా చోటు చేసుకుంది. ఇదే క్రమంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పాత్రపై కూడా సిబిఐ దర్యాప్తు కోరినట్లు సమాచారం.  కొన్ని వర్గాల కథనం ప్రకారం కొంతమంది పోలీస్ అఫిషియల్స్ కొంతమంది జర్నలిస్టులతో మందు కొడుతూ సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ విషయం లీక్ చేసినట్లు కూడా పుకార్లు ఉన్నాయ్. ప్రశాంత్ దయాళ్ అనే జర్నలిస్టుకు ఇలానే ఈ విషయం తెలియగా..అతను సొంతంగా ఇన్వెస్టిగేట్ చేసి కౌసర్‌బీని పూడ్చి పెట్టిన స్థలం కనుగొన్నాడట. నవంబర్ 2006 గుజరాత్ దైనిక్ భాస్కర్ అనే పత్రికలో ఈ వివరాలన్నీ బహిర్గత పరచాడని అంటారు. ఇంకా ప్రచారంలో ఉన్న అత్యంత ఆసక్తికర పుకారు ఏమిటంటే..హరేన్ పాండ్యా అనే గుజరాత్ బిజెపి లీడర్‌ని మర్డర్ చేసేందుకు కూడా సోహ్రాబుద్దీన్ షేక్‌ని వాడుకుని ఉంటారని అనుమానం. ఈ హరేన్ పాండ్యా అప్పటి గుజరాత్ సిఎం నరేంద్రమోడికి కొన్నాళ్లు బాగా సన్నిహితంగా మెలిగేవాడట. ఆ తర్వాత ఈ కేసు అనూహ్యంగా మూతబడింది. ఈ నిజాలు బైటపడకుండా ఉండేందుకే సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ జరిగి ఉండవచ్చనే ఊహాగానాలు అప్పట్లో గుజరాత్‌లో బాగా ఉండేవి..ఇంతటి ఘన చరిత్ర ఉన్న సోహ్రాబుద్దీన్ కేసుపై విచారించిన జడ్జే జస్టిస్ బిహెచ్ లోయా. ఆయన 2014లో చనిపోవడంతో కేసు  అనేక మలుపులు తిరిగింది. ప్రతివాదులుగా ఉన్న అమిత్ షా సహా పలువురు సీనియర్ అధికారులకు కూడా కేసు నుంచి విముక్తి దొరికింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు మళ్లీ నలుగురు సుప్రీంకోర్టు జడ్జిలు లోయా మృతి కేసుని సరైన న్యాయమూర్తికి అప్పగించాలంటూ కోరడంతో చర్చకు వస్తోంది

Comments