గాలి ముద్దు కృష్ణమనాయుడి మృతికి కారణం తెలుసా

టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇవాళ చనిపోయిన సంగతి తెలిసిందే. 3 నెలల క్రితమే ఆయనకు హార్ట్ సర్జరీ జరిగింది. దాన్నుంచి కోలుకుంటున్న దశలోనే ఇలా చనిపోవడం అనూహ్య పరిణామం..ఐతే విధి ఎప్పుడు ఎలా వికటిస్తుందో తెలీదు కానీ, గాలి ముద్దుకృష్ణమనాయుడుకి డెంగూ జ్వరంతో మృత్యువు ముంచుకురావడం గమనార్హం. రెండు రోజుల్లోనే డెంగూ జ్వరం ఆయన్ని కబళించివేయడం ఈ వ్యాధి తీవ్రతను మరోసారి గుర్తు చేస్తోంది. 

రాజకీయజీవితం విషయానికి వస్తే ప్రభుత్వపాఠశాలలో టీచర్ గా పని చేస్తుండగా..ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించడం ఆ పిలుపుతోనే ఆయన టిడిపిలో చేరడం జరిగిపోయాయ్. చిత్తూరు జిల్లాకి చెందిన ఈయన గుంటూరు జిల్లాపెదనందిపాడులో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశారు. దీంతో ఈ జిల్లాలో కూడా ఆయనకంటూ అభిమానులు ఏర్పడ్డారు.  బిఎస్సీ డిగ్రీతో పాటు గాలి ముద్దుకృష్ణమనాయుడు లా గ్రాడ్యుయేట్ కూడా.. టిడిపి నుంచి ఎన్టీఆర్ నిష్క్రమణ, ఆ తర్వాత ఎన్టీఆర్ మరణంతో ఆ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్‌లో కొనసాగారు..ఐతే అక్కడా సరిపడకా..తిరిగి టిడిపిలోనే జాయినయ్యారు. ఐతే ఈ క్రమంలోనే ఆయన ఇప్పటి సిఎం చంద్రబాబుపై అప్పట్లో చాలానే విమర్శలు చేశారు. ఇది చంద్రబాబుకు నచ్చకపోయినా..అనివార్యతలతో పార్టీలో తీసుకోవాల్సి వచ్చింది. 

ఒక దశాబ్దం పాటు చిత్తూరు జిల్లాలో రోజా వర్సెస్ గాలి మాటల యుధ్దం అందరికీ వినోదం పంచింది. ఐతే ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినా కూడా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడి పాత్ర తగ్గిపోతూ వచ్చింది. 
బొజ్జలగోపాలకృష్ణారెడ్డి వర్గానికి ఆయన వర్గానికి పోరు జరుగుతుండేది.. ఓ దశలో జగన్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కొన్నాళ్ల క్రితం పక్షవాతం బారిన పడిన గాలి ముద్దుకృష్ణమనాయుడికి తర్వాత అన్నిరకాల ఒత్తిడులతో అనారోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నది. చివరకు హార్ట్ సర్జరీ కూడా జరిగింది. దాన్నుంచి కోలుకోవడానికి సొంతఊరు వెళ్లిన క్రమంలోనే డెంగూ బారిన పడటం..చనిపోవడం జరిగాయ్.  పార్టీలకతీతంగా ఆయన పట్ల అభిమానం ఉన్న నేతలు గాలి లేని లోటు తీర్చలేనిదంటూ ప్రకటించడం విశేషం. అలా చిత్తూరు జిల్లాలో గాలి శకం ముగిసింది. వచ్చే ఎన్నికలలో ఇక గాలి కుటుంబానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారా లేక కొత్త ముఖాలను పరిచయం చేస్తారా అనేది ఆసక్తికర అంశం

Comments