ఒక్క యాక్సిడెంట్ ముగ్గురు నటులకు జీవితాన్నిచ్చింది..! నూటొక్క జిల్లాల అందగాడి విశేషాలు చూడండి


"దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది...కెన్ యు గివ్ మి సమ్ ఐడియా, శిశువా...సాక్ష్యం ఉంటే చూపించు సిఎంనైనా అరెస్ట్ చేస్తా మన్....గమ్మా...నూటొక్క జిల్లాల అందగాడ్ని."..అంటూ వైవిధ్యమైన ఉఛ్చారణతో తెలుగు ప్రేక్షకులను రంజింపజేసిన నటుడు నూతన్ ప్రసాద్. అసలు పేరు తాడినాధ వరప్రసాద్. నటనలో రాణించాలంటే అందం సంగతి పక్కనబెడితే, వాచికం, ఆంగికం, అభినయం ముఖ్యం. అలాంటి వాటిలో కేవలం తన గొంతు, సంభాషణలు పలికే తీరుతోనే గుర్తింపు తెచ్చుకోవడం, ప్రేక్షకులతో శభాష్ అన్పించుకోవడమే కాకుండా తనకంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని కాగితాలు లిఖించుకున్నవారిలో నూతన్ ప్రసాద్ ఒకరు

1945 కృష్ణాజిల్లా కైకలూరులో పుట్టిన నూతన్ ప్రసాద్ 1973 వరకూ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారట. అప్పట్లో
తెరపైకి వచ్చిన అందరు నటులలాగానే నూతన్ ప్రసాద్ కూడా నాటక రంగంలో అభినివేశం చేశారు. నా ఓటు అనే నాటకంలో నటించిన ఆయనది కృష్ణాజిల్లానే కావడంతో ఎన్టీఆర్, ఏఎన్నార్ లని కలిసి తన ఉత్సాహం గురించి తెలిపారు. ఎన్టీఆర్ ప్రోత్సహించారని చెప్తారు. అలా 1973లో సత్తిరాజు లక్ష్మీనారాయణ ఉరఫ్ బాపు దర్శకత్వంలో వచ్చిన అందాలరాముడుతో కెరీర్ ప్రారంభించాడు. తీర్చిదిద్దినట్లు ఉంటే కోల ముఖంలో కొట్టొచ్చినట్లు కన్పించే హావభావాలు అప్పట్లో చిన్న పాత్రలు పోషించినా ఆయనకి గుర్తింపు తెచ్చాయనడంలో సందేహం లేదు. ఆ తర్వాత బాపు మరో సినిమా ముత్యాలముగ్గులో పాత్ర కూడా ఆయన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా చెప్పాలి.




అక్కడ మొదలైన ఆయన ప్రయాణం 365 సినిమాల వరకూ సాగింది. రేడియోలో ఆయన గొంతు విన్నా వెంటనే అది నూతన్ ప్రసాద్‌ది అని వెంటనే గుర్తు పట్టేలా పాపులారిటీ తెచ్చుకున్నారాయన. పేజీలకు పేజీలు డైలాగులు చెప్పాలన్నా ఒకే టేక్‌లో ఓకే అన్పించగల దిట్ట. 1970-1980ల మధ్యలో వచ్చిన మధ్యతరగతి జీవితాల ఆధారంగా తీసిన అనేక సినిమాల్లో కథకి కీలకంగా ఉండే ఎన్నో పాత్రలు పోషించారు. ఆలుమగల మధ్య తగాదాలు పెట్టే పాత్రలు, తగాదాలు తీర్చే పాత్రలు, జులాయి అన్నయ్య పాత్ర, విలన్లకు బుద్ది చెప్పే పాత్రలు, విలన్ పాత్రలు, హీరో స్నేహితుల పాత్రలు, కామెడీ, ఇలా ప్రతి పాత్రలో నూతన్ ప్రసాద్ కన్పించేవారు. ఆయన కన్పిస్తే చాలు జనంలో ఓ ఉత్సాహం..ప్రత్యేకంగా నూతన్ ప్రసాద్-రమాప్రభ, నూతన్ ప్రసాద్-శ్రీలక్ష్మి వంటి జంటలు సెపరేట్  ట్రాకులు, ప్రత్యేక గీతాలు కూడా ఉండేవి. అంత క్రేజ్ తెచ్చుకున్న నూతన్ ప్రసాద్ కెరీర్లో రాజాధిరాజు అనే సినిమా ప్రముఖంగా చెప్పుకోదగినది..తెలుగు చలనచిత్ర చరిత్రలోనే సైతాన్ పాత్ర పోషించిన మరో నటుడు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ పాత్రలో నూతన్ ప్రసాద్ శిశువా..శిశువా అంటూ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఏకంగా ఆ పాత్రకి ఓ పాట కూడా ఉంది..అదిప్పటికీ జనం చెవుల్లో మారు మోగుతుంది..కొత్తా దేముడండీ..కొంగొత్తా దేముడండీ అనేదే  ఆ పాట.

1990లో జరిగిన ఓ సంఘటన నూతన్ ప్రసాద్ జీవితాన్ని తారుమారు చేసింది. ఏవిఎం ప్రొడక్షన్స్ తీస్తోన్న బామ్మమాట బంగారు బాట అనే సినిమా షూటింగ్ జరుగుతుండగా..కారు ప్రమాదం చోటు చేసుకుంది. అందులో హీరో రాజేంద్రప్రసాద్, హీరోయిన్ గౌతమి, ప్రధాన పాత్రల్లో భానుమతి, నూతన్ ప్రసాద్, సిల్మ్ స్మిత నటించారు. ఇందులో ఓ ఆటోమేటిగ్గా విడిపోయే కారు కూడా ముఖ్యపాత్ర కలిగినది. పోరాట సన్నివేశాల్లో భాగంగా కారు ముందు భాగం, వెనుక భాగం విడిపోతుంది. ఒక దాంట్లో నూతన్ ప్రసాద్ మరో దాంట్లో రాజేంద్రప్రసాద్ ఉండాలి..అయితే అలా పైకి వెళ్లిన కారు రెండు పార్టులుగా విడిపోయి పైనుంచి కిందపడిపోయింది. దీంతో నూతన్ ప్రసాద్ తీవ్రంగా గాయపడగా..రాజేంద్రప్రసాద్ కొద్దిపాటి గాయాలతో బైటపడ్డాడు. అలా ప్రమాదంలో శరీరం కింది భాగం చచ్చుబడిపోవడంతో నూతన్ ప్రసాద్ కుర్చీలకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో నిజంగా ఓ వైవిద్యమైన నటుడైన నూతన్ ప్రసాద్ పోషించే పాత్రలకు నటులు కరువు అయ్యారు. నూతన్ ప్రసాద్ ఓ క్యారెక్టర్ యాక్టర్, నూతన్ ప్రసాద్ ఓ కమెడియన్, నూతన్ ప్రసాద్ విలన్..సరిగ్గా ఇదే సమయంలో అప్పుడప్పుడే తెరపైకి వస్తోన్న బ్రహ్మానందం, కోటశ్రీనివాసరావు, బాబూమోహన్ పంటపండింది. నూతన్ ప్రసాద్ చేయవలిసిన క్యారెక్టర్లన్నీ ఆటోమేటిగ్గా వీరికి వెళ్లిపోయాయి. ఎందుకంటే నూతన్ ప్రసాద్ చేసే సెటైరికల్ విలనీ కోట చేయగలడు. నూతన్ ప్రసాద్ హీరో స్నేహితుడిగా చేయగలడు..అదే సమయంలో గోడమీద పిల్లి లాంటి క్యారెక్టర్లూ చేయగలడు..అలాంటి వేషాలకు బ్రహ్మానందం,బాబూమోహన్ ని ఎంచుకోవడం ప్రారంభించారు. ఇక్కడి ఉద్దేశం వీరికి టాలెంట్ లేదని కాదు. కాలం తిప్పిన మలుపులో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే ఎవరైనా చేయాల్సింది. అందుకే కోట క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలనీ పాత్రలు తర్వాతి కాలంలో ఎక్కువగా వచ్చాయే కానీ కామెడీ తక్కువగా చేశారు. మీరు ఇప్పుడు 1990ల తర్వాత ఈ ముగ్గురు నటులు చేసిన పాత్రలను తరిచి చూస్తే వాటిలో నూతన్ ప్రసాద్‌ని ఊహించుకుని చూడండి..ఈ వాస్తవం బోధపడుతుంది.



ఐతే మరి నూతన్ ప్రసాద్‌లోని నటుడు ఊరుకుంటాడా..లేదు కానీ నిర్మాతల్లో ఉత్సాహం లేకపోవడంతో దర్శకుల వ్యక్తిగత ఇష్టంతో కొన్ని క్యారెక్టర్లు కేవలం ఆయన కోసమే రచించి మరీ సినిమాల్లో జొప్పించారు వాటిలో కర్తవ్యం పేరెన్నికగన్నది. అలా సినిమాల్లో ఒకటి రెండు సీన్లలో కూర్చుని మాత్రమ కన్పించే జడ్జిలు, క్యాంటీన్ ఓనర్లు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వంటి పాత్రలు చేశారు. అంత పెద్ద ప్రమాదం జరిగినా తనలోని ఆత్మబలం కోల్పోకపోవడమే నూతన్ ప్రసాద్ ఇచ్చే స్ఫూర్తిగా చెప్పాలి. ప్రమాదం జరిగిన తర్వాత పరామర్శకి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి తానే స్వాంతన కలిగించే మాటలు చెప్పి పంపించారని స్వయంగా చిరంజీవే చెప్పారు. జరిగినదాన్ని మార్చే వీలు లేదు కాబట్టి అక్కడ్నుంచి కొత్త జీవితం మొదలుపెట్టాలనే ధృఢనిశ్చయంతోనే నూతన్ ప్రసాద్ ఇంకో రంగంవైపు మళ్లారు. అదే ఈటీవిలో ప్రసారమైన నేరాలు ఘోరాలు. నూతన్ ప్రసాద్ అంటేనే తన గొంతు..డిఫరెంట్  డైలాగ్ డిక్షన్..తన బలాన్నే ఆయుధంగా చేసుకుని ఆ ఎపిసోడ్లకి ప్రాణం పోసారాయన. వాటిపైన విమర్శలు వచ్చినా నూతన్ ప్రసాద్ పాపులారిటీ మాత్రం తగ్గలేదు. 1990లో ప్రమాదం జరిగి కాళ్లు, చలనం కోల్పోతే తన 65వ ఏట 2011 మార్చి 30న కన్నుమూశారు. 

Comments