అటల్ బిహారీ వాజ్‌పేయీ..నీకు సాటి ఎవరొయీ..?


అటల్ బిహార్ వాజ్ పేయ్ ఒక్క బిజెపికే కాకుండా సమకాలీన రాజకీయాల్లో కురువృధ్దుడిగా అందరూ గౌరవించే వ్యక్తిత్వంగా చెప్తారు.. భారత దివంగత ప్రధాని నెహ్రూ తర్వాత కాంగ్రేసేతర ప్రధానుల్లో మూడుసార్లు వరసగా ఆ పదవిని చేపట్టిన ఘనత ఆయనకే దక్కింది.. ఐదు దశాబ్దాలు ఎంపిగా పని చేసిన అనుభవశాలి అటల్ బిహారీ వాజ్ పేయ్..అలానే నాలుగు రాష్ట్రాలనుంచి ఎంపిగా ఎన్నికైన ఘనత ఆయనకు మాత్రమే సొంతం..క్విట్ ఇండియా మూమెంట్ లో పాల్గొనడం ద్వారా ప్రజల్లోకి వచ్చిన వాజ్ పేయ్ ఆ సమయంలో జైలుశిక్ష అనుభవించారు కూడా..భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుల్లో అటల్ జీ ఒకరు..రాజకీయాలతో పాటుగా..కవిత్వంలోనూ ఆయన ప్రజ్ఞ చూపించారు..హిందీ బాషపై ఆయన అభిమానం ఎనలేనిది..ఐక్యరాజ్యసమితిలో హిందీలోనే ప్రసంగించడం అందుకు నిదర్శనం..
 ప్రధానిగా పదవి చేపట్టక ముందు అటల్ బిహారీ వాజ్ పేయ్ అనేక అత్యున్నత పదవులు అలంకరించారు..మొదటిసారి ప్రధాని పదవి చేపట్టిన సమయంలో దాన్ని 13రోజులకే వదులుకోవాల్సి వచ్చింది.. ఆ తర్వాత పదమూడు నెలలు మాత్రమే మరోసారి ప్రధానమంత్రిగా పదవి నిర్వహించారు.మూడోసారి మాత్రం పూర్తికాలం బాధ్యతలు నిర్వర్తించారు.
1924 డిసెంబర్ 25న గ్వాలియర్ లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు వాజ్ పేయ్..తండ్రి కృష్ణబిహారీ వాజ్ పేయ్ స్కూల్లో టీచర్ గా పని చేసేవారు..తల్లి కృష్ణాదేవి సాధారణ గృహిణి.. స్థానిక సరస్వతి శిశుమందిర్ లో విద్యాభ్యాసం..విక్టోరియా కాలేజ్ లో డిగ్రీవరకూ చదివారాయన.. కాన్పూర్ లోని డీఏవీ కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ లో ఎంఏ పూర్తి చేసారు వాజ్ పేయీ..
స్వాతంత్ర ఉద్యమంలో కూడా వాజ్ పేయి పాల్గొన్నారు..ఓవైపు విద్యాబ్యాసం సాగిస్తూనే..అనేక హిందీ పేపర్లలో స్వాతంత్ర్యోద్యమానికి మద్దతుగా వ్యాసాలు రాసేవారు..
1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతీయ జన్ సంఘ్ స్థాపించారు..ఆయనతో పాటు వాజ్ పేయి కూడా అందులో పాలుపంచుకున్నారు.. ముఖర్జీకి వాజ్ పేయి ముఖ్యమైన మద్దతుదారుగా వ్యవహరించేవారు..మొదటిసారిగా 1957లో బలరామ్ పూర్ నుంచి ఎంపిగా లోక్ సభకు ఎన్నికయ్యారు..ఆ సమయంలోనే తన వాగ్ధాటి ఏంటో ప్రపంచానికి తెలిసివచ్చింది.. శక్తివంతమైన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకోవడం వాజ్ పేయ్ శైలి.. 1968లో జన్ సంఘ్ కు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు వాజ్ పేయ్.. నానాజీ దేశ్ ముఖ్, బల్ రాజ్ మధోక్ , లాల్ కృష్ణ అద్వానీలతో కలిసి కొన్నేళ్లపాటు జన్ సంఘ్ అభివృధ్దికి కృషి చేశారు..1977లో జన్ సంఘ్ భారతీయ లోక్ దళ్, సోషలిస్టు పార్టీలతో కలిసి జనతా పార్టీగా ఆవిర్భవించింది.. ఎన్నికల్లో జనతా ప్రభంజనం వీయగా..వాజ్ పేయ్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు..ఐతే అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేయగానే..జనతా పార్టీ విఛ్చిన్నమైపోయింది..అప్పుడే వాజ్ పేయ్ తన సహచరులు ఎల్ కే అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ తో కలిసి భారతీయ జనతా పార్టీని స్థాపించారు.. అలా 1980లో బిజెపి ఆవిర్భావం జరిగింది..మొదటి అధ్యక్షుడిగా ఆయనే వ్యవహరించారు..
 1984లో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన ఎన్నికలు కావడంతో లోక్ సభలో బిజెపి కేవలం రెండు సీట్లకే పరిమితం అయింది.. అలాంటి పార్టీని 88సీట్లకు పెంచడంలో అటల్ బిహారీ వాజ్ పేయ్ పాత్ర ఎనలేనిది..నిర్విరామంగా పని చేయడంతో 1991లో 120సీట్లతో బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది..అలా బిజెపి ప్రస్థానంతోనే వాజ్ పేయి ప్రస్థానం ముడిపడిందా అన్నట్లు దాదాపు రెండుదశాబ్దాలు సాగాయ్..1993లో కూడా ఆయనే ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు.. 1995లో బిజెపి ఆయన్నే తమ ప్రధానమంత్రి పదవికి అభ్యర్ధిగా ప్రకటించింది..అప్పట్లో ఈ ప్రకటనతో ఎల్కే అద్వానీ కూడా కినుక వహించారంటారు..ఐతే 1996లో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా ఎన్నిక కావడంతో వాజ్ పేయ్ తొలిసారి ప్రధాని కాగలిగారు.. ఐతే పదమూడు రోజుల్లోనే దిగిపోవాల్సి వచ్చింది..
 రెండేళ్ల అనంతరం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది..అలా 1998లో అటల్ జీ తిరిగి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.. మళ్లీ ఏడాదికే మధ్యంతరం రావడంతో మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారాయన..ఐతే 1998లో అధికార పగ్గాలు చేపట్టిన నెలలోనే అణుపరీక్షలు నిర్వహించడం ద్వారా ఘనమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు వాజ్ పేయ్.. గతంలో 1974లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన అణుపరీక్షల తర్వాత జరిగిన ప్రయోగం అదే కావడం గమనార్హం..
 రెండోసారి ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కార్గిల్ వార్ చోటు చేసుకుంది.. పాకిస్తాన్ సైనికుల దురాక్రమణను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది.. యుధ్దంలో విజయం సాధించడం ద్వారా వాజ్ పేయ్ సమర్ధత ఆయన్ని స్ట్రాంగ్ లీడర్ గా నిలబెట్టింది.. ఈ రెండు విజయాలతో 1999 అక్టోబర్ లో జరిగిన మధ్యంతరంలో ఎన్డీఏ ఘనవిజయం సాధించింది..
ఆర్ధికపరమైన సంస్కరణలు అనేకం తెచ్చిన వాజ్ పేయి ప్రవేట్ సెక్టార్లను వృధ్ది చేయడంలో ఉత్సాహం చూపించారు.. ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరించడంలో వాజ్ పేయి పాత్ర ఎనలేనిదంటారు.. నేషనల్ హైవే డెవలప్ మెంట్ ప్రాజెక్టు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఎన్డీఏకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.. ఆయన హయాంలోనే అప్పటి అమెరికా ప్రసిడెంట్ బిల్ క్లింటన్ భారత పర్యటనకు వచ్చారు.. రెండు దేశాల మధ్యా వాణిజ్యం పెంపొందడానికి వాజ్ పేయ్ హయామే కారణమంటారు..
పొరుగుదేశం పాకిస్తాన్ తో కూడా స్నేహహస్తాన్నే చాటారాయన.. ఫలితాలతో సంబంధాలు లేకుండా..శాంతి నెలకొల్పేందుకు పాకిస్తాన్ కు బస్ యాత్ర చేపట్టారు వాజ్ పేయ్..ఐతే వాజ్ పేయ్ హయాంలోనే అంటే డిసెంబర్ 13 2001లో పార్లమెంట్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు..ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాతే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజమ్ యాక్ట్ ను పునరుద్ధరించారు..
2002-03 కాలంలో వాజ్ పేయ్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగానే భారత తలసరి వృధ్ది 6 నుంచి 7శాతానికి పెరిగింది..భారతదేశాన్ని ప్రపంచం చూసే కోణంలో కూడా వాజ్ పేయ్ హయాంలోనే ప్రారంభమైందంటారు..2001లో చేపట్టిన సర్వశిక్షా అభియాన్ ఇప్పటికీ ప్రాథమికోన్నత విద్యలో ఓ విప్లవంగా చెప్తారు..2005లో రాజకీయాలనుంచి విరమించిన వాజ్ పేయి కు భారత ప్రభుత్వం పోయినేడాది  భారతరత్న ప్రకటించింది..1992లో పద్మవిభూషణ్ సత్కారం లభించగా.. 1994లోనే ఆయనకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు దక్కింది..
 వ్యక్తిగత నేపధ్యానికి వస్తే..వాజ్ పేయ్ అవివాహితులు కావడంతో..నమిత అనే ఓ బంధువుల అమ్మాయిని దత్తు తీసుకున్నారు..ఆయనకు లతా మంగేష్కర్ , ముఖేష్, మహ్మద్ రఫీ పాటలంటే ఇష్టం..వాజ్ పేయ్ తో ఇతర పార్టీల నేతలు సన్నిహితంగా వ్యవహరిస్తుంటారు ..భారతరాజకీయాల్లో వాజ్ పేయి ఓ భీష్ముడిలాంటి వ్యక్తిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుస్తారు..అప్పటి ప్రధానులు ఇందిరాగాంధీ..రాజీవ్ గాంధీ..సహా ఇప్పటి ప్రదాని మోడీ వరకు అందరూ ఆయన్ని గౌరవిస్తారు..రామజన్మభూమి ఘటన తర్వాత దానికి వ్యతిరేకంగా మాట్లాడిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో వాజ్ పేయ్ కూడా ఒకరు..ఆయన మితవాదంతోనే బిజెపి కేంద్రంలో అధికారపగ్గాలు చేపట్టిందని కొంతమంది నమ్మకం..గుజరాత్ లో గోద్రా అల్లర్లు చోటు చేసుకున్న సమయంలోనూ..మోడీకి రాజధర్మం గురించి హితబోధ చేశారంటారు..పార్టీలతో సంబంధం లేకుండా సందర్భాన్ని బట్టి స్పందించడంలో ఆయన తీరే వేరంటారు

Comments