పెళ్లై పిల్లలున్న టాప్ స్టార్ కూడా ఈమెని లవ్ చేసా మళ్లీ పెళ్లి చేసుకుంటా అన్నాడు..!


సినిమా పరిశ్రమలో అందం, అభినయం రెండూ ఉండాలి..ఈ రెండూ ఉన్నా కూడా అదృష్టం లేక
తెరమరుగు అయిన నటులు ఎంతమందో ఉన్నారు. కానీ చిన్న పాత్రలతో మొదలుకుని ఇండస్ట్రీలో
హీరోలకు కూడా అసూయ తెప్పించే రెమ్యునరేషన్ అందుకున్న చరిత్ర ఈ హీరోయిన్ సొంతం. తాను అభిమానించే
హీరోయిన్‌ పక్కన చెలికత్తెల వేషాలు వేయడమే కాకుండా..ఆ తర్వాత ఆమెనే తాను అనుకరించానని చెప్పుకున్న
నిజాయితీ కూడా ఈమెదే..ఆమే వాణిశ్రీ..తెలుగులో రెండో తరం హీరోల సరసన..ఆ తర్వాతి తరం హీరోలకు ధీటుగా
నటించిన వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. నెల్లూరు జిల్లాలో పుట్టింది. మొదట్లో స్థితిమంతుల కుటుంబంలోనే ఉన్నా..హఠాత్తుగా ఒక్క నెల గ్యాప్‌లోనే వాణిశ్రీ కుటుంబసభ్యులు ముగ్గురు మరణించడం ఆర్ధికంగా దెబ్బతీసిందట. టిబితో తండ్రి చనిపోతూ రత్నకుమారి ఉరఫ్ వాణిశ్రీని , ఆమె అక్క కాంతాన్ని బాగా చదివించమని చెప్పి చనిపోయారట. భర్తకి ఇచ్చిన మాట కోసం వాణిశ్రీ తల్లిగారు మేకలు కాచుకుంటూ..వాటి పాలను అమ్ముతూ జీవనం నెట్టుకొచ్చేవారట. అలా కొద్దిపాటి ఆదాయంతోనే వాణిశ్రీకి మంచి చదువు అందాలని
ఆమె తల్లి మద్రాసులోని ఆంధ్రమహిళాసభకి పంపారట. ఐతే ఆమె అక్క కాంతానికి బాగానే చదువు అబ్బిందట కానీ..వాణశ్రీ ధ్యాస మాత్రం వాటిపై నిమగ్నం కాకుండా భరతనాట్యం క్లాసులపైనే ఉండేదట. అలా ఆమె 12 ఏళ్ల వయసులో  స్కూల్లో జరిగిన ఓ ఫంక్షన్లో ఆమె డ్యాన్స్ చేస్తుండగా..ఓ కన్నడ డైరక్టర్ చూసి ఆమెని నటి సావిత్రిలా ఉందే అనుకున్నాడట. అలా  ఆమెకి మొదటి సినిమా ఛాన్స్ దొరికింది. అలా సత్యహరిశ్చంద్ర అనే
కన్నడసినిమా ద్వారా తెరపైకి వచ్చిన వాణిశ్రీ మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో ఇక చదువుకు స్వస్తి పలికింది. ఆమె తల్లి ఇందుకు మొదట్లో అభ్యంతరపెట్టినా వరసగా అవకాశాలు వస్తుండటంతో కెరీర్ కి బ్రేక్ పడలేదు. ఇక్కడ తమాషాగా ఆమెకి తమిళం, కన్నడంలో హీరోయిన్ క్యారెక్టర్లు వస్తుంటే..తెలుగులో మాత్రం
చిన్న చిన్న చెలికత్తెల క్యారెక్టర్లు వచ్చేవి. భీష్మ సినిమాలో తొలి తెలుగు క్యారెక్టర్ చేయగా..ఆమెకి తెరపై వాణిశ్రీ అనే పేరుని ఎస్వీరంగారావే సూచించారని చెప్తారు. ఈ పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే..ఎస్వీరంగారావ్ సొంత నిర్మాణ సంస్థ పేరు శ్రీవాణి ఫిలింస్..అది అటు ఇటూ మార్చి ఆమెకి వాణిశ్రీగా నామకరణం చేశారన్నమాట. లక్ష్మీనివాసం, అసాధ్యుడు, సుఖదుఖాలు సినిమాల తర్వాత ఆమెలోని హీరోయిన్‌ని తెలుగు దర్శకనిర్మాతలు గుర్తించడం
ప్రారంభించారు. ఆమెనే టైటిల్ రోల్‌లో పెట్టి సినిమాలు రావడం ప్రారంభం అయ్యాయ్. చిట్టిచెల్లెలు, కథానాయిక మొల్ల ఆమె నటనకి అద్దం పట్టాయి. కృష్ణ నటించిన మరపురాని కథ ఆమెకి హీరోయిన్‌గా తొలి చిత్రం..ఆపై 1971లో వచ్చిన దసరాబుల్లోడు, ప్రేమ్‌నగర్‌తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది వాణిశ్రీ..ఎన్టీఆర్, ఏఎన్నార్ సరసన సావిత్రి తర్వాత ఇక చేయాలంటే వాణిశ్రీనే చేయాలన్నట్లుగా క్రేజ్ తెచ్చుకుంది.
ఒకవైపు జమున, సావిత్రి, భానుమతి హీరోయిన్లుగా చేస్తుండగానే, రాజశ్రీ, చంద్రకళ, భారతి వంటి కొత్త తరం తారలు దూసుకొచ్చిన తరుణంలో వాణిశ్రీ ఓ మహారాణిలాగా ఇండస్ట్రీని ఏలింది. తాను తెరపైకి వచ్చిన కొత్తల్లో సావిత్రి ఎలాగైతే నటించేదే అచ్చంగా అలానే చేసి మంచి పేరు తెచ్చుకున్నానని వాణిశ్రీ చెప్తారు..ఐతే ఆ తర్వాత మాత్రం తనకంటూ ఓ స్టైల్ తెచ్చుకుందామే. కలర్ ఫిల్మ్స్ మొదలైన తర్వాత వాణిశ్రీ స్టైల్‌ అప్పటి స్త్రీలకు ఓ క్రేజ్..హెయిర్ స్టైల్ కానీ..లిప్ స్టిక్స్, స్టిక్కర్స్..చీరకట్టు..అన్నింటిలో వాణిశ్రీనే అనుకరించేవారు. చామనచాయ అయినా కూడా గ్రేట్ ఫోటొజెనిక్ ఫేస్ కావడంతో అప్పటి యువతరానికి ఆమె గిలిగింతలు పెట్టిన పూబోణి అని చెప్తారు. డ్యూయల్ రోల్స్ చేసిన కొద్ది మంది హీరోయిన్లలో ఆమె ఒకరు..ఇద్దరు అమ్మాయిలు, గంగమంగ వాణి రాణిలో ఆమె ద్విపాత్రాభియనం చేయగా..యద్దనపూడి నవల సెక్రటరీలో జయంతి క్యారెక్టర్ ఇక ఆమె తప్ప ఇంకెవరూ చేయలేరన్నట్లుగా అతికిపోయింది ఆ దశలో ఆమె తీసుకునే పారితోషికం అప్పటి కొంతమంది హీరోలకంటే ఎక్కువని చెప్పేవారు. రోజుకు 16 గంటల చొప్పున చేస్తూ..ఏడాదిలో 14 సినిమాలు విడుదలైన ఘనత ఆమె సొంతం. ఐతే కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు కదా..అలా సాగుతున్న కెరీర్‌లో ఎదురులేని మనిషి అనే సినిమా పెద్ద దెబ్బ తీసింది
ఎక్స్‌పోజింగ్ అప్పుడప్పుడే పెరుగుతున్న దశలో ఆ సినిమాలోని ఓ పాటలో ప్రేక్షకులకు మత్తు కలిగించే భంగిమల్లో నృత్యం చేయాలని సూచించారట దీన్ని తీవ్రంగా అభ్యంతరపెట్టిన వాణిశ్రీ..అప్పుడే ఇక తాను వ్యక్తిగతజీవితంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. అలా వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ ని పెళ్లాడారు. ఇది 1979లో జరిగింది. అలా
ఇండస్ట్రీలో వాణిశ్రీ వెనక్కి తగ్గి పెళ్లి చేసుకోవడానికి మరో కారణం. శ్రీదేవి, జయప్రద, జయసుధ లైమ్ లైట్‌లోకి వస్తుండటంతో ఇక తన హవా తగ్గుతుందని తెలుసుకున్నారట. దాంతో హీరోయిన్‌గానే వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నా...తిరిగి మళ్లీ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందామెకి. ఎందుకంటే ఆమె అక్క బావలు వాణిశ్రీ ఆస్తులు కాజేయడంతో కోర్టుకెక్కాల్సి వచ్చింది. తనకి ఇచ్చిన రెమ్యునరేషన్‌ని తక్కువ చేసి చూపించడంతో కోర్టువారు వాణిశ్రీకి మీరు చెప్తోన్నంత రెమ్యునరేషన్ ఇచ్చారని ప్రూవ్ చేసుకోవాలని అన్నారట. దీంతో 1989లో మళ్లీ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాతో అత్త పాత్రతో దర్శనమిచ్చింది. ఆ సినిమా హిట్ అవడానికి చిరంజీవి, విజయశాంతిలతో పాటు..అత్తగా వాణిశ్రీ కూడా అంతే కారణం. ఆ దెబ్బతో కోర్టు వాళ్లు వాణిశ్రీకి రావాల్సిన డబ్బులు ఇప్పించారట. కానీ ఈ కోర్టు జంజాటం 12ఏళ్లపాటు సాగడంతో వాణిశ్రీ మానసికంగా వేదన అనుభవించాల్సి వచ్చిందట. అప్పుడే ఆమె శివభక్తురాలిగా మారిపోయిందట. ఆ తర్వాత కూడా అత్త పాత్రలతో బొబ్బిలిరాజా, అల్లరి అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి, ఏమండీ ఆవిడ వచ్చింది లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసి అల్లాడించింది. చివరిగా  మెయిన్ రోల్ చేసిన సినిమా భద్రాద్రి రాముడనే ఫ్లాప్ మూవీ. వాణిశ్రీకి అనుపమ అనే ఓ కుమార్తె, అబినయ వెంకటేశ కార్తీక్ అనే కొడుకు ఉన్నారు. కొడుకు పుట్టినప్పుడు థైరాయిడ్ సమస్య తలెత్తడంతో
విపరీతంగా లావు అయిందామె. అది అలా పెరుగుతూ పోతూ..ఆమెని బాధపెడుతోంది ఇంకా. ఆమె ఇద్దరు సంతానం డాక్టర్లే కావడం విశేషం. వాణిశ్రీ పెళ్లి చేసుకుంటుందని తెలిసిన ఓ అగ్రహీరో అప్పట్లో ఆమె దగ్గర ఏడ్చాడట..ఇన్నాళ్లూ నా మనసులో నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ చెప్పలేదు అన్నాడట. ఆల్రెడీ పెళ్లైన ఈ హీరో తనకి  పిల్లలున్నారని చేసుకోవా ఏమిటి అని అడిగి కావాలంటే తిరిగి పిల్లలు పుట్టేందుకు ఆపరేషన్ చేయించుకుంటా అని కూడా ఆఫర్ ఇచ్చాడట. వాణిశ్రీకి విపరీతమైన జ్ఞాపకశక్తి ఉందని సాటి హీరో కృష్ణంరాజు గుర్తు చేసేవారు. హీరో కృష్ణ ఎలాగైతే పేజీలకు పేజీలు డైలాగులు చెప్పేవాడే అలానే వాణిశ్రీ కూడా చెప్పేదని..తెలీనివాళ్లు ఆమెకి పొగరు అని బిరుదు అంటగట్టేవారు కానీ వాణిశ్రీ ఓ నిబద్దత కలిగిన హీరోయిన్ అని కృష్ణంరాజు కితాబు ఇచ్చారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కృష్ణంరాజుతో స్నేహంగా కలుస్తారట వాణిశ్రీ. తన హీరోల గురించి చెప్తూ..హీరో కృష్ణ అసలు సెట్లపై మాటలే కలపరని , మంచి మనిషి అని వాణిశ్రీ చెప్తారు. ఎన్టీఆర్ ని కారణజన్ముడిగా పోల్చుతారామె. నాగేశ్వర్రావ్ మాత్రం మూడ్ కి తగ్గట్లు ప్రవర్తిస్తారని అంటారు. ఈ ట్రెండ్ హీరోల్లో మహేష్ బాబు అంటే వాణిశ్రీకి బాగా ఇష్టమట..ఎక్కువగా చదవడం వల్లనే తనకి ఓ హీరోయిన్ క్యారెక్టర్ ని అర్ధం చేసుకోవడం తెలిసిందని..తాను ట్రై చేసినన్ని మోడల్స్, ఫ్యాషన్లు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎవరూ చేయలేదని సగర్వంగా చెప్తారామె. తెలుగు తమిళం, కన్నడ హిందీ కలిపి 96 సినిమాలు చేసిన వాణిశ్రీ ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవనంలో హాయిగా కాలం గడిపేస్తున్నారు

Comments