నమో యాప్ అందుకేనా..బిజెపి దొరికిపోయింది ఇక్కడే


ఆధునిక యుగంలో సమాచారం అనేది ఎంత శక్తివంతమైనదో..రాజకీయపార్టీలకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు. చిన్న ఆధార్ కార్డ్ నంబర్ తెలిస్తే ఏం కొంప మునుగుతుందిలే అనుకునేవారికి..ఆ సమాచారం సాయంతో టెర్రరిస్టులో..ఇంకో యాంటీ సోషల్ ఎలిమెంట్సో వాడుకుంటేగానీ ఆ అనర్ధం తెలీదు. సదరు టెర్రరిస్ట్ హాయిగా ఉంటాడు. మన వివరాలు ఆధారంగా అతను తీసుకున్న సిమ్ కార్డు..అందులో ఉన్న అడ్రసుతో మనల్ని అరెస్ట్ చేసి ఏ టాడానో..మీసా చట్టంకిందో అరెస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మన డేటా విలువ. బెయిల్ కూడా రాకుండా, లోపలే మగ్గిపోతున్నా మనకి కారణం తెలీకపోవచ్చు. అదే సమాచారాన్ని తమకి అనువుగా ఎలా మార్చుకోవచ్చో పొలిటికల్ పార్టీలు తెలుసుకున్నాయ్. మీడియా మేనేజ్‌మెంట్ అంటే ఏంటో తెలుసుకున్న పార్టీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయంగా లబ్ది పొందాయి కూడా..అలాంటి అంశమే ఇప్పుడు అమెరికాలో వెలుగుచూసింది. కేంబ్రిడ్జ్ అనలిటికా సాయంతో ట్రంప్ గెలుపు ఖాయం చేసుకున్నాడంటూ రాద్దాంతం జరుగుతుంటే..ఇదే సిధ్దాంతంతో కాంగ్రెస్ పావులు కదుపుతోందని బిజెపి ఆరోపించింది. సాక్షాత్తూ కేంద్రమంత్రే ఇలా ఆరోపించారు..ఐతే దానికి ధీటుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీపై అస్త్రం ఎక్కుపెట్టారు. నమో పేరుతో విడుదల చేసిన
యాప్ యూజర్ల డేటాని తస్కరిస్తోందని చేసిన కామెంట్, బిజెపిని డిఫెన్స్‌లో పడేసింది. కౌంటర్ ఇవ్వలేక తనని తానే చిక్కుల్లోకి నెట్టుకుంది.

నమో యాప్‌ యూజర్ల డేటాని ఎక్కడా వాడుకోవడం లేదని..కేవలం విశ్లేషణ కోసమే వాడుతున్నామని చెప్పింది. మరి ఆ విశ్లేషణ ఏంటో కూడా చెప్పాలి కదా..అసలు డేటాని ఎలా వినియోగించినా..తప్పే..అందుకే రాహుల్ గాంధీ డేటా వార్‌లో ప్రాథమిక విజయం సాధించాడని చెప్పొచ్చు. ఫ్రెంచ్ ‌కి చెందిన ఒక ప్రజావేగు అందించిన సమాచారంతో ఒక కథనం పబ్లిష్ అయింది. అది ఆధారంగానే రాహుల్ గాంధీ మోడీపై ఈ సమాచార తస్కరణ అస్త్రం సంధించారు. అది కూడా చాలా వెటకారంగా.." హాయ్..నా పేరు నరేంద్రమోడి, నేను భారత దేశ ప్రధానిని. మీరు నా యాప్‌లో ప్రవేశించినప్పుడు మీ వివరాలు అన్నింటినీ అమెరికా కంపెనీలకు చేరవేస్తాను" అంటూ ట్వీట్ చేశారు

డేటాతో ఎలాంటి వివరాలు తెలుసుకుంటాయి పార్టీలు..అసలు వాటితో ఏంటి ఉపయోగం అనుకుంటారా..ఒక వ్యక్తి యొక్క అభిరుచులు..అతని ఏ రాజకీయపార్టీ అంటే అభిమానం, ఎందుకు అభిమానం..లేదంటే ఎందుకు ద్వేషం ఎలాంటి అంశాలు రాజకీయాల్లో కోరుకుంటున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడంతో పాటు..సదరు వ్యక్తి యాప్ వాడిన తర్వాత ఎలాంటి సైట్లు చూస్తున్నాడు.అందులో ఏ అంశాలపట్ల ఆకర్షితుడు అవుతున్నాడనేది ఈ అనలిటిక్స్ ఆధారంగా తెలుసుకోవచ్చు. అది తెలిసిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేయడం చాలా సులభమని ఎన్నికల నిర్మాణం, ప్రచారంలో ఆరితేరినవారు చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు డేటా(సమాచారం) సాయంతో మూడ్ ఆఫ్ ది నేషన్ కనుక్కున్న పార్టీలు మెజారిటీ సీట్లు దక్కించుకుంటాయనేది ఆరోపణ.
ఐతే నమో యాప్ తయారు చేసినవారు, ఇందులో అన్ని వివరాలు పొందుపరచాల్సిన అవసరం లేకుండానే గెస్ట్ మోడ్‌లో కూడా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. స్వయంగా రాహుల్ గాంధీనే యాప్‌ని పరీక్షించి చూడాలని సలహా ఇస్తున్నారు.  ఐతే అలా ఎంతమంది వాడుతున్నారన్నదే ఇంకో ఆసక్తికర ప్రశ్న. 

Comments