ఇంట్రడక్షన్ సాంగ్స్ హీరోలకేనా..కాదు ఈ కథానాయికలూ అలరించారు


తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికైనా హీరోలదే డామినేషన్. క్యారెక్టర్ కానీ, ఫైట్లు కానీ, పాటలు కానీ , సీన్లు కానీ, కాస్ట్యూమ్స్  కానీ ఏవైనా సరే ముందు హీరోగారికే ప్రథమ తాంబూలం ఆ తర్వాతే మిగిలినవారి వంతు. ఐతే ఇక్కడ కాస్త కాస్ట్టూమ్స్ విషయంలో మాత్రం హీరోయిన్లకి మినహాయింపు ఇవ్వొచ్చు..ఎక్కువ డ్రస్సులు మార్చే సదుపాయం మాత్రం వారికి కల్పించారు. ఐతే ఇలాంటి చలనచిత్రపరిశ్రమలో కూడా కొన్ని సార్లు హీరోయిన్ పరిచయంతోనే
 ప్రారంభం అయ్యే సినిమాలు కొన్ని ఉన్నాయ్. హీరోకి ఇంట్రడక్షన్ సాంగ్ ఉండటం చూశాం కానీ..ఇలా హీరోయిన్లకి కూడా పరిచయ గీతాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే పెద్దగా గమనించకుండానే ఆ సినిమాలను కూడా మనం చూశాం..హిట్ చేశాం..

అలాంటి వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ విషయానికి వస్తే భానుమతి, అక్కినేని నటించిన లైలామజ్నులో భానుమతి పాత్ర పాటతో ఇంట్రడ్యూస్ అవుతుంది. అంజలీ దేవి అనార్కలి సినిమా కూడా ఆమెపైనే పాటతో ప్రారంభం అవుతుంది. ఈ సినిమా సమాప్తంలోనూ ఇదే రిపీట్ అవుతుంది. కాస్త కలర్ మూవీస్‌లోకి వస్తే పదహారేళ్ల వయసులో శ్రీదేవి పరిచయం పాటతోనే ప్రారంభం అవుతుంది.
సిరిమల్లె పువ్వా అంటూ సాగే ఆ పాట సినిమాలో తర్వాత విషాద సన్నివేశంలో కూడా కొనసాగుతుంటుంది. పాట సూపర్ హిట్ అని చెప్పక్కర్లేదనుకుంటా. అదే శ్రీదేవి కృష్ణతో నటించిన రామరాజ్యంలో భీమరాజులో కూడా  కాబోయే శ్రీమతి అంటూ మరో పాటలో కూడా సోలోగా అలరిస్తుంది. అంతులేని కథలో జయప్రదపైనే సినిమా ఓపెన్ అవుతుంది. కాకపోతే పాటతో కాదు. ఆ తర్వాత అసలు సిసలు ఇంట్రో అంటే అంతం సినిమాలో ఊర్మిళ పాత్ర పాటతోనే తెరపై కన్పిస్తుంది. అదే సినిమాలో మొదటి పాట కూడా సిల్క్ స్మితపైన చిత్రీకరించిందీ కావడం మరో విశేషం.

కొన్నేళ్లపాటు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విజయశాంతి కెరీర్ బిగినింగ్‌లో వచ్చిన సినిమా నేటి భారతం. ఇందులో ఆమె పాత్ర కూడా ఓ సాంగ్ ద్వారా పరిచయం అవుతుంది. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత ఆమె సినిమాల్లో సోలో సాంగ్స్ కామన్ అయిపోయాయ్. బ్యూటీ క్వీన్ రాధ నటించిన టుటౌన్ రౌడీలో ఇంట్రడక్షన్ సాంగ్ ఆమెదే.ఇక మణిరత్నం సినిమా రోజాలో మధుబాల పాత్ర చిన్ని చిన్ని ఆశ అనే పాటతోనే పరిచయం అవుతుంది. ఇదెంత ఫేమస్ మెలోడీనే అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రియురాలు పిలిచింది అనే డబ్బింగ్ సినిమాలో పలికే గోరింక ఇటు చూడవే నావంక అంటూ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ ఇఁట్రో సాంగ్ ఇప్పటికీ చాలామంది పేవరెట్. 
ఆనంద్ సినిమాలో కమలినీ ముఖర్జీ యమునాతీరం సంధ్యాసమయం అంటూ ఎంత అందంగా కన్పిస్తుందో తెలుసు కదా, ఇక ఒక్కడు సినిమాలో నువ్వేం మాయ చేశావో కానీ అంటూ భూమిక ఇంట్రడక్షన్ మనోహరంగా సాగుతుంది. ఆ తర్వాత గజని సినిమాలో అసిన్ రహతుల రహతుల రహతులవల్లా అంటూ చేసిన హడావుడి గుర్తుండే ఉంటుంది. మహేష్ బాబు నటించిన ఫ్లాప్ మూవీ సైనికుడులో త్రిషా కృష్ణన్‌కి ఇంట్రడక్షన్ సాంగ్ ఉండటం విశేషం.  ఇంకా మనసంతా నువ్వేలో రీమాసేన్, వీరా సినిమాలో తాప్సీ, రెబెల్ సినిమాలో తమన్నాపై డ్యాన్స్ నంబర్స్ ఆకట్టుకుంటాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్స్ అలరించాయనే చెప్పాలి. ఐతే అప్పుడప్పుడూ ఇలా కొన్నిసార్లు మాత్రమే ఇఁట్రడక్షన్ సాంగ్స్ హీరోయిన్స్ కి పడుతున్నాయ్ కానీ..ఎక్కువశాతం హీరోలదే డామినేషన్ అని చెప్పాలి

Comments