అమ్మకంతో ఆకాశంలో బోలెడంత అవకాశమంట..! ఎయిర్ఇండియా సేల్‌పై దీపం సెక్రటరీ అడ్డగోలు వాదన! ఎహ నమ్మేద్దాం బాసూ..మరి కేంద్రానికెంత మిగిలిందో చూడొద్దంటూ కవరింగ్ ఎయిర్ఇండియాని అమ్మేశాం

ఏవియేషన్‌లో ఆధిపత్యాన్ని తగ్గించాం

దీపం సెక్రటరీ అడ్డగోలు వాదన

ఆ లెక్కన లాభంలో లేని ప్రతి కంపెనీని అమ్మేస్తారా..?

మరి లాభం పంచే కంపెనీలను కూడా ఎందుకు రోడ్డున పడేస్తున్నారు?

ప్రభుత్వాల చేతకానితనాలకు ఇదే నిదర్శనం


నష్టాలపాలవుతున్న ప్రభుత్వరంగ సంస్థలను ఏ పద్దతిలో..ఏ ఏ పారామీటర్స్ ఆధారంగా కేంద్రప్రభుత్వం అమ్మకాలకు పెడుతుందో దానికే తెలియాలి..? ఎయిర్‌పోర్టులు, పోర్టులు,బ్యాంకులు, ఆయిల్ కంపెనీలు, రైల్వేలు ఇలా ఏదైనా అమ్మతుందంటే వ్యాపారం కాక మరింకేంటి..ప్రభుత్వమున్నది వ్యాపారం చేయడానికి కాదంటూనే..ఈ కంపెనీ అమ్మకానికి ఇంత రేటు అని కట్టడం దేనికి..? ఎవడు ఎక్కువిస్తే వాడికి కట్టబెట్టేయవచ్చుగా..! 


ఈ వాదనకి దేశంలోని చాలామంది మద్దతు ఇస్తారు. ఉదాహరణకు ఎయిర్ఇండియానే చూడండి..ఇదెంత లాభసాటిగా నడపాల్సిన సంస్థనో ఆల్రెడీ ఇతర విమానయాన సంస్థలు ఋజువు చేస్తున్నాయి కూడా..అయినా నష్టాలపాలైందన్న సాకుతో ఈ సంస్థని విక్రయించేశారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడానికంటూ సెపరేట్‌గా ఓ శాఖనే క్రియేట్ చేసింది కేంద్రం. దానికి దీపం అనే పేరు కూడా పెట్టారు.ఆ శాఖ సెక్రటరీ తుహిన్ కాంత పాండే అనే మహాశయుడు  ఇప్పుడేమని సెలవిస్తున్నారంటే, ఈ అమ్మకంతో పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కాపాడుతున్నారట


రోజుకి రూ.20కోట్ల నష్టపోతోన్న కంపెనీని ఎవరు మాత్రం రన్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు విమానయానరంగ వృద్ధిని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందట( అంటే లాభాల్లో ఉన్న కంపెనీల జోలికి పోకూడదు కదా..). కేంద్రానికి మిగిలిందెంత అని చూడవద్దంటూ హితవు పలికారాయన


లెక్కలు చూడండి!

ఎయిర్ ఇండియా అప్పులు-రూ.61560వేలకోట్లు

టాటాసన్స్ దక్కించుకుంది-రూ.18వేలకోట్లకి

అప్పులో తీరేది-15300కోట్లు

కేంద్రం తీసుకునేది-2700కోట్లు

ఎయిర్ ఇండియా ఆస్తులు-17వేల కోట్లుమరి మిగిలిన అప్పు మాటేంటి..?


దాని సంగతి తర్వాత టాటాసన్స్ గ్రూప్‌కి ఇంత చీప్‌గా ఓ పెద్ద విమానయాన సంస్థని అప్పగించడం( ఏ కంపెనీ కొనుక్కున్నా..వాటికి ఇది జాక్‌పాటే)

ఎయిర్ఇండియాకి 4400 డొమెస్టిక్ ల్యాండింగ్ పర్మిషన్, పార్కింగ్ సౌకర్యం ఉంది. అలానే  1800 అంతర్జాతీయ విమానసర్వీసులకు ల్యాండింగ్‌,పార్కింగ్ సౌకర్యం ఉంది. ఇంతేకాకుండా విదేశాల్లో 900 స్లాట్లున్నాయ్. ఈ స్థాయి పార్కింగ్, ల్యాండింగ్ సౌకర్యం దేశంలోని ఏ కంపెనీకి వెంటనే సాధ్యపడేది కాదు. 49 బోయింగ్ విమానాలు ఎయిర్ఇండియాకి ఉన్నాయ్. అలానే మరో 78 ఎయిర్‌బస్‌లు ఉన్నాయ్. ఒక్కో బోయింగ్ ఖరీదు రూ.8400కోట్లు. అంటే ఒక్క బోయింగ్ విమానాల ఖరీదే రూ.4,11,600. అక్షరాలా నాలుగు లక్షల పదకొండువేల ఆరువందల కోట్ల రూపాయలు. వీటిలో కాలం చెల్లినవీ..పనికిరానివి అంటూ ఏవీ ఉండవు. జస్ట్ టాటా సంస్థ ఓ 5వేలకోట్లు ఖర్చు పెడితే ఈ రీవ్యాంపింగ్ ప్రక్రియ అంతా పూర్తైపోతుందని ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెప్తున్నారు. ఎంత హీనంగా లెక్కేసుకున్నా, టాటా సంస్థకి లక్ష కోట్లరూపాయలు కలిసి వచ్చేదే ఈ డీల్.


ఇప్పుడు మిగిలిన అప్పు సంగతి చూద్దాం..

రూ.46260కోట్ల అప్పు ఇంకా అలానే ఉండిపోయింది. ఈ అప్పునంతటినీ, ఎయిర్ఇండియా అసెట్ హోల్టింగ్స్ లిమిటెడ్-AIAHL అనే మరో స్పెషల్ పర్పస్ వెహికల్‌కి బదిలీ చేస్తారు. ఈ అప్పు అంతా ఇదే తీర్చబోతోంది. అందుకోసం కేంద్రం ఏం చేయబోతోందా తెలుసా..? బాండ్లను విక్రయించి రూ30వేల కోట్లను సమీకరించబోతోంది. ఇందాక చెప్పుకున్న AIAHL ఎయిర్ఇండియా అప్పులో రూ.30వేలకోట్లకి బాధ్యత తీసుకుంది. మిగిలిన 40-45వేల కోట్ల అప్పుని కూడా ఈ సంస్థకి బదలాయింపు తర్వాతే టాటాసన్స్‌కి ఎయిర్ఇండియాని కేంద్రం అప్పజెప్పనుంది.  ఈ బాండ్ల గోలతో సంబంధం లేకుండా టాటా సన్స్ గ్రూపే, ఎయిరిండియా ఆస్తులను అమ్మి..అప్పు కింద రూ.35వేల కోట్లని కట్టనుంది. అంటే ఆస్తుల విక్రయం టాటా గ్రూప్ చేతికి వచ్చిందన్నమాట


ఇప్పుడు చూడండి, కేంద్రం అమ్మితేనో, ప్రభుత్వశాఖలు అమ్మితేనో రాబట్టలేని రేటుని టాటాసన్స్ గ్రూప్ చాలా ఈజీగా తీసుకువస్తుంది. అంతకంటే ఎక్కువ రేటు కూడా తీసుకురాగలరు. ఎందుకంటే ప్రస్తుతం రియాల్టీ ధరలు అలా ఉన్నాయ్. టాటాలే స్వయంగా తమ సన్నిహితుల ద్వారా కూడా ఈ స్థలాలను, ఆస్తులను చేజిక్కించుకునే అవకాశం కూడా ఉంది. 


మొత్తం మీద  ఈ డీల్ పూర్తైన తర్వాత కేంద్రం, బ్యాంకులకు, ఆయిల్ కంపెనీలకు అన్ని అప్పులు తీర్చేస్తుంది. ఎయిర్ ఇండియా ఉద్యోగులని ఏడాదిపాటు మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. ఆ తర్వాత టాటా గ్రూప్ ఇష్టం.  


మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా చూడండి..కేవలం 18వేలకోట్లు ఖర్చు పెడితే చాలు, ఎయిర్ఇండియా అప్పులు తీరిపోతాయంటే..మరి ఆ పని కేంద్రం ఎందుకు చేయలేకపోతోంది. ప్రవేట్ కంపెనీలనగానే ఎక్కడలేని సామర్ధ్యం, ప్రభుత్వరంగసంస్థలనగానే దిక్కుమాలిన అసమర్థత వచ్చేస్తాయా..? ఆ చర్యలేవో, మనసుపెట్టి చేస్తే ఈ అమ్మకం ప్రస్తావన ఎందుకు వస్తుంది..? దీనికంటే, ఎయిర్ ఇండియాలో 30శాతం వాటాలను మార్కెట్లలో లిస్టింగ్‌కి తీసుకువచ్చినా బ్రహ్మాండమైన ఆదరణ దక్కేది కదా..!Comments